Telugu Global
NEWS

తెలుగు కోసం ఉద్యమించాల్సిన దుస్థితి, చింతిస్తున్నా- సీజేఐ

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష కోసం ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌ వీ రమణ. అమెరికా న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగించిన సీజేఐ.. తెలుగుభాష అనేక అటుపోట్లను తట్టుకుని నిలబడిందన్నారు. మారుతున్న పరిస్థితుల్లో తెలుగుతో పాటు ఇతర భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అప్పుడే ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి జీవించడం సాధ్యమవుతుందన్నారు. […]

తెలుగు కోసం ఉద్యమించాల్సిన దుస్థితి, చింతిస్తున్నా- సీజేఐ
X

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష కోసం ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌ వీ రమణ. అమెరికా న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగించిన సీజేఐ.. తెలుగుభాష అనేక అటుపోట్లను తట్టుకుని నిలబడిందన్నారు. మారుతున్న పరిస్థితుల్లో తెలుగుతో పాటు ఇతర భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అప్పుడే ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి జీవించడం సాధ్యమవుతుందన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు, కుటుంబసభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.

భాషను, సంస్కృతిని మరిచిపోతే తెలుగు జాతి కొన్ని తరాల తర్వాత అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు కోసం ఉద్యమించాల్సిన దుస్థితి వచ్చిందని అందుకు తాను చాలా చింతిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్‌ నేర్చుకుంటే తప్ప ఉద్యోగం రాదన్న అపోహను సృష్టించారన్నారు. తాను డిగ్రీ వరకు తెలుగులోనే చదువుకున్నానని.. లా కోర్సు మాత్రమే ఇంగ్లిష్‌లో నేర్చుకున్నానని.. తెలుగులో చదువుకున్నా గొప్పస్థాయికి వెళ్లవచ్చు అనేదానికి తనను ఒక ఉదాహరణగా చూడాలన్నారు.

భాషను, సంస్కృతిని పరిరక్షించుకునే విధానాన్ని తమిళ ప్రజలను చూసి తెలుగువారు నేర్చుకోవాలన్నారు. నెల క్రితం తాను తమిళనాడు వెళ్తే అక్కడి ముఖ్యమంత్రితో పాటు అనేక మంది వచ్చి కలిశారని, వారంతా మద్రాస్ హైకోర్టులో తమిళంలోనే వాదనలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని తనను కోరారన్నారు. చరిత్రను గమనించినా తమిళనాడు చాలా పటిష్టమైన రాష్ట్రంగా ఉంటోందని, తమిళ భాష, సంస్కృతిని పరిరక్షణకు అక్కడి వారు ఇచ్చే ప్రాధాన్యతే అందుకు కారణమన్నారు. భాషను, సంస్కృతిని రక్షించుకునేందుకు తమిళ ప్రజలు ఎవరినైనా ఎదురిస్తారని, అలాంటి స్పూర్తి తెలుగు ప్రజలకు ఉండాలన్నారు.

సమాజంలో సమానత్వం కల్పించలేనప్పుడు మధ్యయుగాల కాలానికి వెళ్లినట్లు అవుతుందన్నారు. చూట్టూ ఉన్న ప్రజలు, సమాజం ఇబ్బందుల్లో, అశాంతితో ఉన్నప్పుడు.. సొంతంగా ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించడం సాధ్యం కాదన్నారు. సమాజం ఎప్పుడూ అనేక మతాలు, కులాలు, అనేక ప్రాంతాలకు చెందిన ప్రజల సముదాయంగా ఉంటుందని.. అందరినీ గౌరవించి, సరైన మర్యాద ఇవ్వాలని అలా ఇవ్వని పక్షంలో సమాజంలో అశాంతి ఉంటుందన్నారు. దేశం వదిలి వచ్చిన వారు మరింత ఐక్యంగా ఉండాలన్నారు.

కుటుంబంలో న్యాయవాదో, న్యాయమూర్తో, సరైన గాడ్‌ ఫాదర్‌ లేకుండా న్యాయవ్యవస్థలో ఉన్నతస్థాయికి చేరడం చాలా కష్టమైన విషయమన్నారు. తనకు అలాంటి వారు వెనుక లేకపోయినా ఈ స్థాయికి వచ్చానని.. కష్టపడడం, భగవంతుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే తానీ స్థానంలో ఉన్నానన్నారు. కోకా సుబ్బారావు తర్వాత 62ఏళ్లకు తెలుగువాడినైన తనకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం దక్కిందని గుర్తు చేశారు. ఆత్మవిశ్వాసమే ఒక మనిషి ఎదుగుదలకు ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రపతిని కలిసినా, సామాన్యుడిని కలిసినా తన వ్యవహారశైలి ఒకేలా ఉంటుందని.. అందరూ కూడా అదే తరహాలో ప్రతి ఒక్కరినీ సమగౌరవంతో చూడాలని సీజేఐ కోరారు.

First Published:  24 Jun 2022 9:46 PM GMT
Next Story