Telugu Global
NEWS

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెల్లుచీటి..?

హైదరాబాద్‌లో నాలుగు రోడ్ల కూడలిలో రెడ్ సిగ్నల్ పడిందంటే.. అప్పుడే సిగ్నల్ దగ్గరకు వచ్చిన వాహనం డ్రైవర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణం 10 నిముషాలు ఆలస్యం అవుతుందని మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. మిగతా మూడు రోడ్లపై వాహనాలు తక్కువగా ఉన్నా.. తన సమయం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వాహనాలు లేవు కదా అని పొరపాటున సిగ్నల్ జంప్ అయితే చలానా మోత మోగిపోతుంది. అందుకే తిట్టుకుంటూ జంక్షన్లో బండిపై […]

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెల్లుచీటి..?
X

హైదరాబాద్‌లో నాలుగు రోడ్ల కూడలిలో రెడ్ సిగ్నల్ పడిందంటే.. అప్పుడే సిగ్నల్ దగ్గరకు వచ్చిన వాహనం డ్రైవర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణం 10 నిముషాలు ఆలస్యం అవుతుందని మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. మిగతా మూడు రోడ్లపై వాహనాలు తక్కువగా ఉన్నా.. తన సమయం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

వాహనాలు లేవు కదా అని పొరపాటున సిగ్నల్ జంప్ అయితే చలానా మోత మోగిపోతుంది. అందుకే తిట్టుకుంటూ జంక్షన్లో బండిపై ఉండిపోతారు. ఇకపై ఇలాంటి సమస్య లేకుండా చేస్తోంది జీహెచ్ఎంసీ. మిగతా రోడ్లపై వాహనాలు లేకపోతే.. వెంటనే మనకి గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది.

వాహనాల సంఖ్యను బట్టి ఆటోమేటిక్ గా మారిపోయే సిగ్నల్ వ్యవస్థ ఇప్పుడు హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. దాని పేరే ATSC. అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్. ఈ కొత్త విధానంలో.. రియల్ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వాటంతట అవే మారిపోతాయి.

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) సంస్థ ఈ ATSC విధానాన్ని అభివృద్ధి చేసింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడాప్టివ్ కంట్రోల్ ఆల్గారిథం ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కాంపోజిట్ సిగ్నల్ కంట్రోల్ స్ట్రాటజీ అని దీన్ని పిలుస్తారు.

ఇది రియ‌ల్ టైం ఆధారంగా ప‌నిచేస్తుంది. సాధారణ ట్రాఫిక్ సిగ్నల్‌ లా కాకుండా.. వాహనాల రాకపోకలు, వాటి సంఖ్య ఆధారంగా ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్‌ ను నిరంతరంగా సర్దుబాటు చేస్తుంది ఈ వ్యవస్థ. అవసరం లేకపోయినా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి చూసే జంఝాటం దీని వల్ల తప్పిపోతుంది. కొత్తగా వచ్చే సిగ్నల్స్ కి కెమెరా ఆధారంగా ట్రాఫిక్ సెన్సార్లు అమర్చుతారు.

మారుతున్న ట్రాఫిక్ ఆధారంగా సిగ్నల్ టైమింగ్స్ అడ్జస్ట్ అవుతాయి. వీటికి సోలార్ పవర్ వాడతారు, బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. కొత్త విధానం వల్ల ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు, వాహన కాలుష్యం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

ప్రస్తుతం హైదరాబాద్ లో 122 ATSC సిగ్నల్స్, 94 పెలికాన్ సిగ్నల్స్, 213 HTRIMS సిగ్నల్స్ ఉన్నాయి. కొత్తగా ATSC సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. వీటితోపాటు 94 పెలికాన్ సిగ్నల్స్ కూడా పాదచారులకు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు దాటాలంటే పాదచారులు రెడ్ సిగ్నల్ వేసి.. అది గ్రీన్ గా మారే 15 సెకన్ల సమయంలో రోడ్డు దాటాల్సి ఉంటుంది. వీటిని ఎక్కువగా ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీల వద్ద ఏర్పాటు చేశారు.

First Published:  25 Jun 2022 4:19 AM IST
Next Story