Telugu Global
NEWS

‘పెద్దలకు మాత్రమే’ -హైదరాబాద్ పబ్బుల ముందు బోర్డులు

జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం జరిగిన చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో పబ్బుల యాజమాన్యాలు కళ్ళు తెరిచాయి. ఇకపై పబ్బుల్లోకి 21 ఏళ్ళు నిండని వారిని అనుమతించమంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. పోలీసుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో పబ్బులు ఈ చర్యలు చేపట్టాయి. జూబ్లీహిల్స్‌, మాదాపూర్,గచ్చిబౌలి బెల్ట్‌లోని పలు పబ్బుల్లోకి గ్రూపులు, కుటుంబాలు వచ్చినప్పుడు అందులో 21 ఏళ్ళ లోపు వారుంటే వారిని కూడా రానివ్వడం లేదు. పెద్దలకు మాత్రమే అనే […]

‘పెద్దలకు మాత్రమే’ -హైదరాబాద్ పబ్బుల ముందు బోర్డులు
X

జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం జరిగిన చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో పబ్బుల యాజమాన్యాలు కళ్ళు తెరిచాయి. ఇకపై పబ్బుల్లోకి 21 ఏళ్ళు నిండని వారిని అనుమతించమంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి.

పోలీసుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో పబ్బులు ఈ చర్యలు చేపట్టాయి. జూబ్లీహిల్స్‌, మాదాపూర్,గచ్చిబౌలి బెల్ట్‌లోని పలు పబ్బుల్లోకి గ్రూపులు, కుటుంబాలు వచ్చినప్పుడు అందులో 21 ఏళ్ళ లోపు వారుంటే వారిని కూడా రానివ్వడం లేదు. పెద్దలకు మాత్రమే అనే బోర్డులు ఇప్పుడు పబ్బుల ముందు దర్శనమిస్తున్నాయి. ప్రత్యేక ఈవెంట్ల పోస్టర్లలో కూడా ’21 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ’ అని రాస్తున్నారు.

“మే 27 అమ్నీషియా పబ్ కేసు తర్వాత పబ్ యజమానులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎవరూ ఇబ్బందులకు గురికావాలనుకోవడంలేదు” అని జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ పబ్ సహ యజమాని చెప్పారు.

“మైనర్‌లను అనుమతించవద్దని పోలీసులు పబ్‌లను కోరినప్పటికీ, మేము ఒక అడుగు ముందుకు వేసి వారితో పాటు పెద్దలు ఉన్నప్పటికీ వారి ప్రవేశాన్ని నిషేధించాము.” అని ఆయన తెలిపారు.

”కొంత మంది పబ్ యజమానులు చేసే తప్పుడు పనుల వల్ల మేమందరం కష్టాలపాలు కావాల్సి వస్తోంది. అందుకే మైనర్‌లను అనుమతించకూడదని నిర్ణయించుకున్నాము. ఈ చర్య ఖచ్చితంగా మా ఆదాయాన్ని తగ్గిస్తుంది” అని జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36లోని ఒక క్లబ్ యజమాని చెప్పారు.

పగటి పూట నాన్ ఆల్కాహాలిక్ పార్టీలకు 18-21 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళను ఆపేయడం వల్ల మేము నెలకు దాదాపు 10 లక్షల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. అయితే ఓ మంచి విషయం ఏంటంటే ఈ మైనర్ల‌ను అదుపు చేయడానికి మేము ఇకపై భద్రతను మోహరించాల్సిన అవసరం లేదు” అన్నారాయన

పబ్ లు బోర్డులు పెట్టడమే కాక అప్పుడే చర్యలు కూడామొదలుపెట్టాయి. నిన్న హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ స్నేహ చైతన్య అనే ఓ యువతి తన 18 ఏళ్ల కజిన్‌తో కలిసి గచ్చిబౌలిలో ఓ పబ్బుకు వెళ్ళారు. తాము భోజనం మాత్రమే చేస్తామని అల్కాహాల్ ముట్టమని చెప్పినా వారిని ఆ పబ్ యాజమాన్యం లోనికి అనుమతించలేదు.

హైదరాబాద్ పబ్బుల్లో ఏదో ఓ సంఘటన జరిగినప్పుడల్లా పబ్ యాజమాన్యాలు కొద్ది రోజులు ఇలా చర్యలు తీసుకోవడం మామూలే. అయితే ఈ సారి కూడా ఎప్పటి లాగే కొద్ది రోజుల్లో నిబంధనలు అటకెక్కిస్తారా లేక ఎల్ల కాలం పాటిస్తారా అనేది చూడాలి.

First Published:  25 Jun 2022 12:49 AM GMT
Next Story