Telugu Global
National

వ్య‌వ‌సాయ విద్యుత్ మీట‌ర్ల‌ను పీకి పారేసిన యూపీ రైతులు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తెస్తోంది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై రైతుల్లో ఆందోళన ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు మీటర్ల ఏర్పాటు వేగవంతం చేశాయి. బలహీన ప్రాంతీయ పార్టీల ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వాలూ మోడీ ఆదేశాలకు తలూపుతున్నాయి. తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే మీటర్లు రైతులకు ఉరితాళ్లు అవుతాయని, తాము అంగీకరించబోమని తేల్చిచెబుతున్నాయి. మీటర్లు ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది […]

UP-farmers-dump-electricity-meters
X

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తెస్తోంది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై రైతుల్లో ఆందోళన ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు మీటర్ల ఏర్పాటు వేగవంతం చేశాయి. బలహీన ప్రాంతీయ పార్టీల ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వాలూ మోడీ ఆదేశాలకు తలూపుతున్నాయి. తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే మీటర్లు రైతులకు ఉరితాళ్లు అవుతాయని, తాము అంగీకరించబోమని తేల్చిచెబుతున్నాయి.

మీటర్లు ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది అన్న దానికి తొలి ఫలితం బీజేపీ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చింది. అక్కడ రైతులు విద్యుత్‌ మీటర్ల దెబ్బకు హడలిపోయారు. ఏకంగా మీటర్లను పెలికించి తీసుకెళ్లి కరెంట్ ఆఫీస్‌ల వద్ద కుప్పపోశారు. రైతులకు ఈ స్థాయి ఆగ్రహం రావడానికి కారణం బిల్లులు 5వేల నుంచి 8వేల వరకు రావడమే.

అది కూడా 15 రోజులకే. మూడు వారాల క్రితం యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లా ఉమార్‌పూర్ గ్రామంలో మీటర్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 15 రోజులకే బిల్లులు పంపించారు. ఒక్కో రైతుకు 5వేల నుంచి 8వేల వరకు బిల్లు రావడం కంగుతిన్నారు. ఈ స్థాయికి బిల్లు రావడం ఏమిటని రైతులు స్థానిక విద్యుత్ అధికారులను నిలదీసినా వారి నుంచి సమాధానం లేదు.

ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడిలా భారీ బిల్లును చేతిలో పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ”రూ. 5200 రూపాయలు బిల్లు వస్తే ఎలా కట్టాలి?. ఇంత బిల్లు మేమెక్కడ కట్టగలం?. గతంలో తక్కువ మొత్తాన్ని బిల్లుగా చెల్లించే వారం. ఇప్పుడు కూడా ఆ మాత్రమైతే చెల్లించగం. ఇంత భారీ బిల్లు వస్తే మేం వ్యవసాయం ఎక్కడ చేయగలం?” అని రైతు శోభరామ్‌ ప్రశ్నించారు.

”మేం మా మీటర్లను తొలగించేశాం. తీసుకెళ్లి పవర్‌ స్టేషన్ వద్ద పడేశాం. అసాధారణ స్థాయిలో బిల్లు రావడమే ఇందుకు కారణం” అని ఉమార్‌పూర్‌కే చెందిన రైతు దేశ్‌పాల్ సింగ్ స్పష్టం చేశారు.

కళ్ల ముందే ఇలా రూ. 5వేల నుంచి 8వేల వరకు బిల్లు వచ్చినట్టు రైతులు చూపెడుతున్నా… కేంద్రమంత్రి సంజీవ్ బాల్వన్ మాత్రం…మీటర్లు ఏర్పాటు చేస్తోంది బిల్లుల కోసం కాదంటూ మాట్లాడారు. కేవలం ఒక్కో బోరు బావి ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుందో తెలుసుకునేందుకు మాత్రమే వాటిని ఏర్పాటు చేశామంటూ చెప్పుకొచ్చారు. వ్యవసాయ మోటార్లకు ఇప్పుడు మీటర్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఉచిత విద్యుత్‌ను కూడా మరో గ్యాస్ సబ్సిడీలాగా మార్చేస్తారేమో అన్న ఆందోళన ఇప్పటికే ఉచిత విద్యుత్ అమలవుతున్న రాష్ట్రాల రైతుల్లో ఉంది.

First Published:  24 Jun 2022 2:47 AM IST
Next Story