‘పాడ్ కార్స్’ అంటే ఏంటి..? హైదరాబాద్ కు ఎప్పుడొస్తాయి..??
లోకల్ ట్రాన్స్ పోర్ట్ కోసం సిటీ బస్ సర్వీస్ లు, ఎంఎంటీఎస్ రైళ్లు అన్ని నగరాల్లోనూ ఉంటాయి. మెట్రో రైళ్లు ఉన్న అతి కొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఒకటి. ఇప్పుడు భాగ్య నగరానికి ‘పాడ్ కార్స్’ అనేవి ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే హైదరాబాద్ లో ‘పాడ్ కార్స్’, ‘రైల్డ్ టాక్సీస్’ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈమేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ […]
లోకల్ ట్రాన్స్ పోర్ట్ కోసం సిటీ బస్ సర్వీస్ లు, ఎంఎంటీఎస్ రైళ్లు అన్ని నగరాల్లోనూ ఉంటాయి. మెట్రో రైళ్లు ఉన్న అతి కొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఒకటి. ఇప్పుడు భాగ్య నగరానికి ‘పాడ్ కార్స్’ అనేవి ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే హైదరాబాద్ లో ‘పాడ్ కార్స్’, ‘రైల్డ్ టాక్సీస్’ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈమేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి ఓ ప్రతిపాదన అందించారు.
పాడ్ కార్స్ అంటే..?
పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్).. అంటే నగర ప్రాంతాల్లో ప్రయాణికులు ఒకచోటనుంచి మరో చోటకు సులభంగా, వేగంగా ప్రయాణించే విధానం. ఇందులో భాగంగా ‘పాడ్ కార్స్’ లేదా ‘రైల్డ్ టాక్సీస్’ ని ఉపయోగిస్తారు. వివిధ మెట్రో స్టేషన్ల నుంచి బస్ స్టాండ్ లకు, లేదా విమానాశ్రయాలకు ఇవి వేగంగా ప్రయాణికుల్ని చేరవేస్తుంటాయి. రోప్ వే లలో వినియోగించే కారు తరహాలో ఓ చిన్న వాహనం ఉంటుంది. ఇందులో ముగ్గురు నుంచి ఆరుగురు వరకు ప్రయాణించే వీలుంటుంది. ప్రపంచ దేశాల్లో ‘పాడ్ కార్స్’ విధానం బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ తరహా రవాణా సౌకర్యాన్ని హైదరాబాద్ వాసులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారు. సమగ్ర ప్రణాళిక రూపొందించి కేంద్రానికి అందించారు.
మనదేశంలో ఎక్కడెక్కడ..?
మనదేశంలో ఇప్పడి వరకు ఈ ‘పాడ్ కార్స్’ సౌకర్యం ఎక్కడా లేదు. బెంగళూరు, అమృత్ సర్ లో ఈ ప్రతిపాదనలు వచ్చినా ముందుకు కదల్లేదు. ప్రస్తుతం ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం పేరిట వసంత్ కుంజ్ ప్రాంతంలో ‘పాడ్ కార్స్’ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఢిల్లీ తర్వాత ఈ తరహా ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ఉన్న నగరంగా హైదరాబాద్ కి పేరొస్తుంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలతో హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలవారికీ ఆశ్రయమిస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోతోంది. మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలన్నా, కంపెనీలకు ఆహ్వానం పలకాలన్నా.. ఇలాంటి అధునాతన వ్యవస్థల అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనికి కేంద్రం సహాయ సహకారాలు అవసరం.
ఉన్నతస్థాయి కమిటీతో ప్రణాళిక..
కేంద్ర రోడ్లు, హైవేల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ కారిడార్ ను రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఆర్‌టీఎస్ పట్ల తెలంగాణ ప్రభుత్వ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు కేటీఆర్. రాష్ట్ర అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు.. 10 కి.మీ పొడవున పీఆర్‌టీఎస్ కారిడార్ ను ప్రతిపాదిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రతిపాదిత కారిడార్ మెట్రో స్టేషన్లు అయిన అసెంబ్లీ, ప్యారడైజ్, ఖైరతాబాద్ స్టేషన్లతో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్లుగా ఉన్న జేమ్స్ స్ట్రీట్, ఖైరతాబాద్ స్టేషన్లను అనుసంధానం చేస్తుందని ఆయన వివరించారు. ఈ కారిడార్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కోసం ఇప్పటికే ఇండియన్ పోర్ట్ రైల్, రోప్ వే కార్పొ రేషన్ లిమిటెడ్ లకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.