Telugu Global
National

అస్సోం వదిలి వెళ్లిపోండి.. ఏక్‌నాథ్ షిండేకు హెచ్చరిక

మహారాష్ట్ర శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రెబల్ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని అస్సోం రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో షిండే మ‌కాం వేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా రెబల్ ఎమ్మెల్యేల కోసమే 70 రూమ్స్ రూ. 56 లక్షలతో బుక్ చేశారు. దీంతో రాడిసన్ హోటల్ పరిసరాలు జర్నలిస్టులు, పోలీసులతో నిండిపోయాయి. అంతే కాకుండా శివసేన కార్యకర్తలు తమ నిరసన తెలియజేయడానికి నిత్యం ఆ హోటల్ వద్దకు వస్తుండటంతో పరిస్థితులు […]

Assam-PCC-president-Bora-warns- Eknath-Shinde-team
X

మహారాష్ట్ర శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రెబల్ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని అస్సోం రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో షిండే మ‌కాం వేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా రెబల్ ఎమ్మెల్యేల కోసమే 70 రూమ్స్ రూ. 56 లక్షలతో బుక్ చేశారు. దీంతో రాడిసన్ హోటల్ పరిసరాలు జర్నలిస్టులు, పోలీసులతో నిండిపోయాయి. అంతే కాకుండా శివసేన కార్యకర్తలు తమ నిరసన తెలియజేయడానికి నిత్యం ఆ హోటల్ వద్దకు వస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

ఈ క్రమంలో శివసేన ఎమ్మెల్యేలను అస్సోం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోర హెచ్చరించారు. మంత్రి ఏక్‌నాథ్, ఇతర ఎమ్మల్యేలు వెంటనే అస్సోం వదిలి వెళ్లిపోయాలని హుకుం జారీ చేశారు. ‘అస్సోం ప్రజలు నీతి, న్యాయం, ధర్మానికి కట్టుబడి ఉంటారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేల బేరసారాలు మాట్లాడటం వల్ల ప్రశాంత వాతావరణం కలుషితం అవుతోంది. అస్సోంలో ప్రజలు వరదల కారణంగా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే 107 మంది వరదల కారణంగా చనిపోయారు. 32 జిల్లాల్లోని 55 లక్షల మంది వరద ప్రభావాన్ని ఎదుర్కుంటున్నారు. వారికి సరైన ఆహారాన్ని కూడా అందించలేక పోతున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అస్సోం రాష్ట్రం ఉంటే.. ప్రభుత్వం మీకు రాచమర్యాదలు చేస్తూ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంచింది. మీ వల్ల ఇప్పుడు అస్సోంకు చెడ్డపేరు వస్తోంది. ఇది ఏ మాత్రం సరైనది, ఆమోదయోగ్యమైనది కాదు అని భూపేన్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్లే ఎమ్మెల్యేలకు గౌహతి ఒక స్వర్గధామం అనేలా చెడ్డపేరు తీసుకొచ్చారు. ఇది ఏ మాత్రం సహించబోమని అన్నారు.

అస్సోంలోని బీజేపీ ప్రభుత్వం మీ బేరసారాలకు సహకరించడం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటని.. వరద సహాయక చర్యల్లో ఉండాల్సిన సీఎం, ప్రభుత్వం మీకు సహకరిస్తోందని భూపేన్ ఆరోపించారు. ఇప్పటి వరకు చేసిన నష్టం చాలు.. వీలైనంత వెంటనే మా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శివసేన ఎమ్మెల్యేలు వెళ్లిపోవాలని లేకుండా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

First Published:  24 Jun 2022 8:55 AM IST
Next Story