Telugu Global
National

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి అసలు కారణం సంజయ్ రౌత్.. ఎలాగో తెలుసా?

ఎంతటి రాజకీయ ఉద్దండుడికి అయినా ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉంటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పని చేయాలంటే అది కత్తి మీద సామే. ఎన్టీఆర్ అంతటి చరిష్మా ఉన్న నాయకుడే.. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఏమీ చేయలేక మిన్నకుండిపోయాడు. దేశ రాజకీయాలను తీసుకుంటే సంకీర్ణ ప్రభుత్వాలు అనేవి అధికారం దాహం కోసం ఏర్పడ్డవే తప్ప… ప్రజల ఆంకాంక్షలను తీర్చడానికి ఏ మాత్రం కాదని అర్థం అవుతోంది. ప్రస్తుతం […]

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి అసలు కారణం సంజయ్ రౌత్.. ఎలాగో తెలుసా?
X

ఎంతటి రాజకీయ ఉద్దండుడికి అయినా ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉంటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పని చేయాలంటే అది కత్తి మీద సామే. ఎన్టీఆర్ అంతటి చరిష్మా ఉన్న నాయకుడే.. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఏమీ చేయలేక మిన్నకుండిపోయాడు. దేశ రాజకీయాలను తీసుకుంటే సంకీర్ణ ప్రభుత్వాలు అనేవి అధికారం దాహం కోసం ఏర్పడ్డవే తప్ప… ప్రజల ఆంకాంక్షలను తీర్చడానికి ఏ మాత్రం కాదని అర్థం అవుతోంది.

ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ ఆటలు దేశ ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. శివసేన ప్రభుత్వం పడిపోతుంటే, ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి దూరం కాబోతుంటే చాలా మంది అయ్యో పాపం అంటున్నారు. కానీ ఇది శివసేన స్వయంగా తీసుకున్న గొయ్యే అని ఆ పార్టీలో ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు. ప్రస్తుత తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేపై శివసేన పార్టీలో కూడా పెద్దగా వ్యతిరేకత లేదు. అటు పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా అధికార మార్పిడిపై పెద్దగా విముఖత కూడా చూపడం లేదని తెలుస్తున్నది. ఇందుకు కారణం ఉద్దవ్ ఠాక్రే సీఎం అయిన తీరే.

మహారాష్ట్రలో బాల్ ఠాక్రే ఉన్నంత కాలం శివసేనకు తిరుగులేకుండా పోయింది. బీజేపీతో కలసి గతంలో శివసేన అధికారం చేపట్టింది. కానీ ఏనాడూ బాల్ ఠాక్రే సీఎం కుర్చీ ఎక్కాలని భావించలేదు. కానీ గత ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవిని ఆశించారు. బీజేపీ అందుకు ససేమిరా అన్నది. దీంతో ఎన్నికల ముందు పొత్తును వీడి కాంగ్రెస్, ఎన్సీపీ‌తో కలసి మహావికాస్ అగాడి(ఎంవీఏ) పేరుతో అధికారం చేపట్టారు. ఉద్దవ్ సీఎం పదవిని చేపట్టగా.. మిగిలిన కీలక పదవులు ఎన్సీపీ చేతిలోకి వెళ్లిపోయాయి. అయితే అప్పుడే శివసేన పార్టీలో అసంతృప్తి మొదలైంది.

శివసేన పూర్తిగా హిందుత్వ పునాదులపై ఏర్పడిన పార్టీ. ఆ పార్టీ కార్యకర్తలు కూడా అదే విషయం బహిరంగంగా చెప్తుంటారు. కానీ, ఎంవీఏలో భాగస్వామ్యం అయ్యాక సీఎం ఉద్దవ్ ఠాక్రే ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించారని కార్యకర్తలు భావిస్తున్నారు. పైగా పార్టీ, ప్రభుత్వంలో సంజయ్ రౌత్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జీర్ణించుకోలేక పోయారు. ఎంవీఏ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన సంజయ్.. ఆ తర్వాత షాడో సీఎంలాగా పని చేశారు. పార్టీకి చెందిన ‘సామ్నా’ పత్రిక ఎడిటర్‌గా తన భావజాలాన్ని, తన అభిప్రాయాలనే శివసేన అభిప్రాయాలుగా చెలామని చేస్తున్నట్లు చాలా మంది ఎమ్మెల్యేలు భావించారు.

అప్పటి నుంచే పార్టీలోని కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సంజయ్‌పై గుర్రుగా ఉన్నారు. శివసేన అభిప్రాయాల కంటే ఎన్సీపీ అధినేత శరత్ పవార్ మాటలనే ఎక్కువగా పట్టించుకుంటున్నారని పలుమార్లు ఉద్దవ్ ఠాక్రేకు కూడా పిర్యాదులు వెళ్లాయి. కానీ సంజయ్ మాయలో పడిన ఉద్దవ్ వాటిని పట్టించుకోలేదు. ఒకప్పుడు బాల్ ఠాక్రే ఎలా పార్టీని నడిపించారో.. అలా ఉద్దవ్ నడిపించలేకపోతున్నాడని కార్యకర్తలు కూడా భావించడం మొదలు పెట్టారు.

దీనికి తోడు పార్టీలో కీలక నాయకుడు, మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేను ఒక సమావేశంలో అందరి ముందు రౌత్ చులకనగా వ్యాఖ్యలు చేయడం అసలు గొడవకు కారణం అయ్యింది. ఏక్‌నాథ్ ఒకప్పుడు ముంబైలో ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. శివసేనలో చురుగ్గా ఉంటూ ఇవ్వాళ మంత్రి అయ్యాడు. తన పాత వృత్తిని బేస్ చేసుకొని ఏకంగా.. అనుభవం లేని, చేతకాని డ్రైవర్ ఏకనాథ్ అంటూ రౌత్ మాట్లాడటం అందరినీ ఇబ్బంది పెట్టింది.

మరోవైపు ముంబైని ఆనుకొని (దాదాపు అంతర్భాగం) ఉన్న థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో కూడా శివసేన పార్టీలో తీవ్రమైన చర్చజరిగింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమితో పని చేయాలని సంజయ్ రౌత్ తీర్మానించారు. కానీ ఒంటరిగా పోటీ చేద్దామని ఏక్‌నాథ్ పట్టుబట్టారు. 1997లో ఏక్‌నాథ్ తొలి సారిగా థానే మున్సిపల్ కార్పొరేటర్‌గానే గెలిచారు. ఆ తర్వాత కూడా థానే జిల్లాలో కీలక పదవులు చేపట్టారు. థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా.. జిల్లా మంత్రిగా ఆయనకు పట్టుంది. అలాంటి చోట వేరే పార్టీలతో కలసి పోటీ చేయాలని నిర్ణయించడంతో ఏక్‌నాత్ తన దారి వేరే అని నిర్ణయించుకున్నట్లు కార్యకర్తలు చెప్తున్నారు.

మరోవైపు మంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ శాఖ నుంచి ఎలాంటి ఫైళ్లు, బడ్జెట్ క్లియర్ కాకుండా సంజయ్ రౌత్ ఆంక్షలు విధించారు. ఒకవైపు రాజకీయంగా మరోవైపు ఆర్థికంగా ఆంక్షలు పెరిగిపోవడంతో ఏక్‌నాథ్ చివరకు పార్టీని చీల్చే వరకు వచ్చారు. బీజేపీ నుంచి కూడా ఆయనతో లోపాయికారి ఒప్పందం కుదరడంతోనే దూకుడుగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. సంజయ్ రౌత్ ఏకపక్ష వైఖరి కారణంగానే సజావుగా సాగుతున్న అధికారం విచ్చిన్నం అయ్యిందని ఎంవీఏ పక్షం భావిస్తున్నది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంతో పెద్దగా ప్రయోజనం లేదు. ఇంత జరిగినా సంజయ్ రౌత్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఏక్‌నాథ్ తన పంతం వీడటం లేదు. ఎటు తిరిగి ఎన్సీపీ, కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదు. బీజేపీకి మహారాష్ట్రలో అధికారం ఉన్నా, లేకపోయినా ఒకటే. చివరకు సంజయ్ రౌత్ – ఏక్ నాథ్ కారణంగా శివసేన, ఉద్దవ్ ఠాక్రేనే మునిగిపోయారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  23 Jun 2022 9:45 AM IST
Next Story