పవన్ – ప్రకాశ్ రాజ్ కలయిక.. సినిమా ప్రారంభోత్సవంలో రాజకీయ చర్చ?
పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ కలసి నటించిన చాలా సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. బద్రి నుంచి మొదలు పెడితే.. నిన్నటి వకీల్ సాబ్ వరకు వీరిద్దరి జోడి ప్రేక్షకులకు అమితానందాన్ని ఇచ్చేదే. నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. వీరిద్దరూ తెరపై నువ్వా నేనా అన్నట్లు నటించేవాళ్లు. అయితే ఇద్దరికీ సినిమాల పట్లే కాకుండా రాజకీయాలపై కూడా అమితమైన ఆసక్తే.. పవన్ కల్యాణ్ ఏకంగా […]
పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ కలసి నటించిన చాలా సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. బద్రి నుంచి మొదలు పెడితే.. నిన్నటి వకీల్ సాబ్ వరకు వీరిద్దరి జోడి ప్రేక్షకులకు అమితానందాన్ని ఇచ్చేదే. నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. వీరిద్దరూ తెరపై నువ్వా నేనా అన్నట్లు నటించేవాళ్లు. అయితే ఇద్దరికీ సినిమాల పట్లే కాకుండా రాజకీయాలపై కూడా అమితమైన ఆసక్తే..
పవన్ కల్యాణ్ ఏకంగా ‘జనసేన పార్టీ’ పెట్టి ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బీజేపీ, చంద్రబాబుకు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ పవన్ తన రాజకీయ మనుగడను సాగిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కూడా రాజకీయాల్లోకి ఎప్పుడో అడుగుపెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన రాజకీయ ఐడియాలజీ అంతా వేరుగా ఉంటుంది. మోడీపై వ్యతిరేకత చూపిస్తూ.. ఫాసిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ, అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటారు.
వేర్వేరు ఐడియాలజీలు ఉన్న ప్రకాశ్ రాజ్ – పవన్ కల్యాణ్ తాజాగా ఒక సినిమా ప్రారంభోత్సవంలో కలవడం, ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. విశ్వక్‌సేన్, ఐశ్వర్య జంటగా అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో కలిసిన వీరిద్దరూ కాసేపు పక్కన కూర్చొని మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్న ప్రకాశ్ రాజ్, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనాని కలయికలో భవిష్యత్ రాజకీయాంశాలపై చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నుంచి కేసీఆర్ జాతీయ పార్టీ వరకు చర్చ జరిగిందని సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా వీరిద్దరి కలయిక సినిమా కోసమే అయినా.. అక్కడ కీలకమైన రాజకీయాంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.