Telugu Global
National

మహారాష్ట్రలో మరో ఆరుగురు శివసేన ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే గూటికి ?

మహారాష్ట్రలో శివసేన రెబెల్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే … సీఎం ఉధ్దవ్ థాక్రేకి చుక్కలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు కోరితే రాజీనామాకు సిధ్ధమని ప్రకటించిన థాక్రే …. రాత్రికి రాత్రి తన అధికారిక నివాసం వర్ష నుంచి పెట్టేబేడా సర్దుకుని కుటుంబంతో సహా బాంద్రాలోని తన మాతాశ్రీ ఇంటికి తరలి వెళ్లగా.. షిండే పని ఇంకా సులువైంది. ఆకర్ష.. ఆకర్ష అంటూ ఆయన మరింత మంది ఎమ్మెల్యేలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే తనవైపు దాదాపు 40 మంది […]

maharashtra-another-six
X

మహారాష్ట్రలో శివసేన రెబెల్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే … సీఎం ఉధ్దవ్ థాక్రేకి చుక్కలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు కోరితే రాజీనామాకు సిధ్ధమని ప్రకటించిన థాక్రే …. రాత్రికి రాత్రి తన అధికారిక నివాసం వర్ష నుంచి పెట్టేబేడా సర్దుకుని కుటుంబంతో సహా బాంద్రాలోని తన మాతాశ్రీ ఇంటికి తరలి వెళ్లగా.. షిండే పని ఇంకా సులువైంది. ఆకర్ష.. ఆకర్ష అంటూ ఆయన మరింత మంది ఎమ్మెల్యేలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే తనవైపు దాదాపు 40 మంది సభ్యులు ఉన్నారని చెప్పుకుంటున్న ఆయన..

తన బలాన్ని ఇంకా పెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. మంగేష్ కుదల్కర్ అనే ఎమ్మెల్యేతో బాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ రాత్రికి సూరత్ చేరుకుని..అక్కడినుంచి గౌహతి విమానమెక్కుతారని తెలుస్తోంది. సూరత్ లోని ఓ హోటల్ లో ఇప్పటికే 7 గదులు బుక్ చేశారని.. ముంబై నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయల్దేరారని, సూరత్ విమానాశ్రయం నుంచి వీరు ఈ ఉదయం ప్రైవేట్ జెట్ విమానంలో గౌహతి చేరుకున్నారని సమాచారం.

చంద్రకాంత్ పాటిల్, యోగేష్ కదమ్, మంజులా గవిట్, గులాబ్రో పాటిల్ అనే వీరికి అక్కడ మంచి స్వాగతమే లభించింది. ఇక-తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలపై సేన నేత సంజయ్ రౌత్ నిప్పులు కక్కారు. రాష్ట్రంలో వీరు రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారని, వీరి పిరికి చర్యను చరిత్ర గుర్తుంచుకుంటుందని ట్వీట్ చేశారు. అవసరమైతే అసెంబ్లీలో థాక్రే తన బలాన్ని నిరూపించుకుంటారని రౌత్ పేర్కొన్నారు. ‘ఇది ఓ పోరాటం.. మేం పోరాడి గెలుస్తాం.. ఇది బాలాసాహెబ్ శివసేన’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు.. గురువారం ఉదయం నుంచే బీజేపీ శిబిరంలో సమావేశాలు మొదలయ్యాయి. విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి బీజేపీ నేతలు చేరుకోవడం మొదలెట్టారు. కొందరు ఇండిపెండెంట్ సభ్యులు కూడా ఫడ్నవీస్ నివాసంలో కనిపించారు. ఫడ్నవీస్ ఈ సాయంత్రం గవర్నర్ ని కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తమను ఆహ్వానించాలని కోరే సూచనలున్నాయని అంటున్నారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించవచ్చునని తెలుస్తోంది. తనకు కొందరు ఇండిపెండెంట్లు, నాన్-బీజేపీ సభ్యుల సపోర్ట్ కూడా ఉందని ఆయన వివరించవచ్చని నిఘా వర్గాలు అంటున్నాయి..

కాంగ్రెస్ పార్టీతో దోస్తీ వద్దని, ఇది అసహజమని, తమ పార్టీ ప్రబోధిస్తున్న హిందుత్వ సిధ్ధాంతానికి ఇది ‘మ్యాచ్’ కాదని ఏక్ నాథ్ షిండే ఇప్పటికీ చెబుతున్నారు. అసలే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తల బొప్పి కట్టిన థాక్రేపై ఢిల్లీ బీజేపీ అధికారప్రతినిధి తేజేందర్ పాల్ బగ్గా మరో బాణం ప్రయోగించారు. థాక్రే తన అధికార నివాసం నుంచి బాంద్రా లోని తన పర్సనల్ ఇంటికి వెళ్తూ వందలాది శివసేన కార్యకర్తలను, ప్రజలను కలుసుకున్నారని, ఇది కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను అతిక్రమించడమేనని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

షిండేకి బంపరాఫర్ ! కానీ…

ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి బయటపడాలంటే రెబెల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సూచించారని, కానీ ఈ ఆఫర్ ని షిండే తిరస్కరించారని తెలుస్తోంది. అసలు ఈ రెండు పార్టీలకు శివసేన గుడ్ బై చెప్పాలని ఆయన డిమాండు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తన వర్గంలో మరింతమంది ఎమ్మెల్యేలు చేరుతారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First Published:  23 Jun 2022 6:30 AM IST
Next Story