వైసీపీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి రామరాజు
ఏపీలో అధికార వైసీపీకి ఇది కాస్త ఇబ్బంది కలిగించే వ్యవహారమే. రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు.. తన పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో వెయ్యిమంది కార్యకర్తలు కూడా పార్టీనుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరంతా టీడీపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నా.. అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడి తీవ్ర స్థాయిలో ఉన్న ఈ సమయంలో.. ఈ రాజీనామా వ్యవహారం వైసీపీలో కలకలం రేపింది. […]
ఏపీలో అధికార వైసీపీకి ఇది కాస్త ఇబ్బంది కలిగించే వ్యవహారమే. రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు.. తన పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో వెయ్యిమంది కార్యకర్తలు కూడా పార్టీనుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరంతా టీడీపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నా.. అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడి తీవ్ర స్థాయిలో ఉన్న ఈ సమయంలో.. ఈ రాజీనామా వ్యవహారం వైసీపీలో కలకలం రేపింది.
కారణం ఏంటి..?
రాజీనామా లేఖ ఇచ్చే సందర్భంలో.. రుద్రరాజు వెంకట రామరాజు పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజోలు నియోజకవర్గంలో జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి అధిక ప్రాధాన్యమిస్తున్నారని, సొంత పార్టీ వారిని అధిష్టానం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. కొత్తగా వచ్చినవారే అంత బాగా నచ్చితే, ఇక తమతో అవసరం ఏముందని ప్రశ్నిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు రామరాజు. రాజోలు వైసీపీలో జనసేన టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే రాపాక ఎంట్రీతో ముసలం మొదలైంది. స్థానిక నేతలు ఆయనతో సర్దుబాటు చేసుకోలేకపోయారు. రాపాక వర్గం, గత ఎన్నికల్లో ఆయనతో పోటీ పడిన బొంతు రాజేశ్వరరావు వర్గం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో కూడా ఇక్కడ వైసీపీ నాయకుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఈ ప్రాంతంలో వైసీపీకి మెజార్టీ స్థానాలు దక్కలేదు. ఈ క్రమంలో రుద్రరాజు రామరాజు కూడా జనసేన ఎమ్మెల్యేపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధిష్టానం మాత్రం రాపాకకే మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో రామరాజు బయటకు వచ్చేశారు.
మిగతా చోట్ల పరిస్థితి ఏంటి..?
టీడీపీ నుంచి నలుగురు, జనసేనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే.. వైసీపీ వైపు వచ్చేశారు. టీడీపీ నుంచి వచ్చిన కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్.. తో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక వైసీపీ నాయకులకు విభేదాలున్నాయి. ఇటీవల వాసుపల్లి కూడా కాస్త అలిగినా, ఆ తర్వాత చల్లబడ్డారు. వల్లభనేని వంశీ నియోజకవర్గం గన్నవరంలో కూడా విభేదాలు రచ్చకెక్కాయి. తాజాగా రాజోలులో ఏకంగా వ్యవహారం రాజీనామా వరకు వెళ్లింది. మిగతా చోట్ల నాయకుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రుద్రరాజు రామరాజు రాజీనామాతో అధికార పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని చెప్పలేం కానీ, ప్రతిపక్షాలకు మాత్రం విమర్శలకు ఇదో ఆయుధంగా మారుతుందనడంలో ఆశ్చర్యం లేదు.