Telugu Global
National

ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా.. ఎవరీ ద్రౌప‌ది ముర్ము..?

వచ్చేనెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకురంగం సిద్ధమైపోయింది. ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఖరారయ్యారు. దేశ అత్యున్నత పదవికి ముర్ము ఎన్నికైన పక్షంలో ఇండియాకు మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి అవుతారు. అలాగే దేశ రాష్ట్రపతిగా రెండో మహిళ అవుతారు. ఎవరీ ద్రౌపది ముర్ము..? జార్ఖండ్ మాజీ గవర్నర్, ఒడిశాకు చెందిన మాజీ మంత్రి కూడా అయిన ఈమె.. ఒడిశాలోని వెనుకబడిన జిల్లా మయూర్ భంజ్ సమీప గ్రామంలో ఓ పేద గిరిజన […]

Droupadi-Murmu-vs-Yashwant-Sinha
X

వచ్చేనెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకురంగం సిద్ధమైపోయింది. ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఖరారయ్యారు. దేశ అత్యున్నత పదవికి ముర్ము ఎన్నికైన పక్షంలో ఇండియాకు మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి అవుతారు. అలాగే దేశ రాష్ట్రపతిగా రెండో మహిళ అవుతారు. ఎవరీ ద్రౌపది ముర్ము..? జార్ఖండ్ మాజీ గవర్నర్, ఒడిశాకు చెందిన మాజీ మంత్రి కూడా అయిన ఈమె.. ఒడిశాలోని వెనుకబడిన జిల్లా మయూర్ భంజ్ సమీప గ్రామంలో ఓ పేద గిరిజన కుటుంబంలో జన్మించారు. దుర్భర పరిస్థితుల్లో స్టడీస్ పూర్తి చేశారు. 1958 జూన్ 20న జ‌న్మించిన ముర్ము భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కళాశాలలో బీఏ చదివి.. రాయ్ రంగాపూర్ లోని శ్రీఅరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కొంతకాలంపాటు అధ్యాపకురాలిగా పనిచేశారు. రాయ్ రంగాపూర్ ఎన్ఏసీ వైస్ చైర్మన్ గా ముర్ము రాజకీయ కెరీర్ ప్రారంభమైంది.

2000-2004 మధ్య రాయ్ రంగాపూర్ నుంచే రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఈమె మంత్రిగా చాలా శాఖలను నిర్వహించారు. తిరిగి 2004-2009 మధ్య కూడా ఈమెను ఎమ్మెల్యే పదవి వరించింది. 2007 లో ద్రౌపది ముర్మును ఉత్తమ శాసన సభ్యురాలిగా ఒడిశా అసెంబ్లీ సత్కరించింది. 2010-2013 మధ్య సంవత్సరాల్లో మయూర్ భంజ్ (వెస్ట్) బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, 2013 నుంచి 2015 వరకు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆమె వ్యవహరించారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్ పదవిలో కొనసాగారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ .. బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఎంపిక తమ రాష్ట్రానికి గర్వ కారణమన్నారు. ముర్ము రాష్ట్రపతి కావడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎలెక్టోరల్ కాలేజీలో 10.86 లక్షల ఓట్ల విలువ కలిగిన బీజేపీ సునాయాసంగా ఆమెను గెలిపించుకోగలదని అంచనా. మెజారిటీకి సుమారు 2 శాతం ఓట్లు తగ్గినప్పటికీ.. ప్రధాని మోడీ ప్రభుత్వానికి ఇదేమంత కష్టం కాదన్నది విశ్లేషకుల భావన.

బీజేడీ, వైసీపీ వంటి పార్టీల మద్దతుతో ఎన్డీయే.. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్ కు పంపవచ్చు.. అసలు ఎవరూ ఊహించనట్టుగా ఈమెను బీజేపీ ఎంపిక చేయడం వెనుక రాజకీయ కారణాలు లేకపోలేదని అంటున్నారు. గుజరాత్ లో జరిగే ఎన్నికల్లో ఈ ఎంపిక బీజేపీకి అనుకూలించవచ్చు.. పైగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ వంటి జిల్లాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. సో.. గిరిజన ఓటర్లంతా కమలానికే జై కొట్టవచ్ఛు కూడా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోలిస్తే.. ఒక మహిళ అన్న సానుభూతితో పాటు ఆదివాసీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ముర్ముకి గల రాజకీయ అనుభవం కూడా తోడై.. ఈమెను అత్యున్నత పదవిలో నిలబెట్టవచ్చంటున్నారు.

అపార అనుభవం గల రాజకీయ వేత్త యశ్వంత్ సిన్హా

అపార అనుభవం గల రాజకీయవేత్త 84 ఏళ్ళ యశ్వంత్ సిన్హా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు బీజేపీ నేతగా కొనసాగిన సిన్హా 1990-91 లో నాటి పీఎం చంద్రశేఖర్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా, మళ్ళీ 1998-2002 మధ్య కాలంలో నాటి పీఎం ఏ.బీ. వాజ్ పేయి సర్కార్ హయాంలో ఇదే పదవిలో పని చేశారు. 2002 జూలై నుంచి 2004 మధ్య విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించారు. బీజేపీ తనను చిన్నచూపు చూస్తోందన్న కారణంతో ఆయన 2018లో ఈ పార్టీని వీడారు. 2021 మార్చి 13 న తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు.

బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించగలదన్న నమ్మకంతో తాను టీఎంసీలో చేరినట్టు ఆయన నాడు చెప్పుకున్నారు. ప్రజాస్వామ్యం పట్ల మోడీ ప్రభుత్వానికి విశ్వాసం లేదని కూడా ఆయన ఆరోపించారు. కాగా విస్తృత దేశ రాజకీయ ప్రయోజనాల కోసం.. తాను తృణమూల్ కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నట్టు యశ్వంత్ సిన్హా నిన్న ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసేందుకు వరుసగా పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ రేసు నుంచి తప్పుకోవడంతో ప్రతిపక్షాలు చివరకు తమ ఉమ్మడి అభ్యర్థిగా సిన్హాను ప్రకటించాయి. ఏమైనా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని బీజేపీ తమ ఎన్డీయే అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చన్న తెలుగు రాష్ట్రాల ఆశలు అడియాసలే అయ్యాయి.

First Published:  22 Jun 2022 12:30 PM IST
Next Story