Telugu Global
National

ఒక దేశం – ఒకే పార్టీ !!

‘ఒక దేశం – ఒకే పార్టీ‘ అన్న నినాదం మోడీ, అమిత్ షా ‘మన్ కీ బాత్’ గా నిర్వచించవచ్చు. అంటే వాళ్ళ మనసులోని మాట. అమెరికా వంటి దేశాల్లోనూ ఒక దేశం, ఒకే పార్టీ అనే ఆలోచన ఎవరికీ రాదు. అది ఆచరణలోనూ సాధ్యం కాదు. కానీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనతలు, తప్పిదాల వల్ల కావచ్చు, ఏ విషయాన్నయినా ‘బుల్డోజ్’ చేయగల నైపుణ్యం సొంతం చేసుకోవడం కావచ్చు.. బీజేపీ కుతంత్రాలు క్లిక్ అవుతున్నాయి. ఆ […]

One-nation-one-party
X

ఒక దేశం – ఒకే పార్టీ‘ అన్న నినాదం మోడీ, అమిత్ షా ‘మన్ కీ బాత్’ గా నిర్వచించవచ్చు. అంటే వాళ్ళ మనసులోని మాట. అమెరికా వంటి దేశాల్లోనూ ఒక దేశం, ఒకే పార్టీ అనే ఆలోచన ఎవరికీ రాదు. అది ఆచరణలోనూ సాధ్యం కాదు. కానీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనతలు, తప్పిదాల వల్ల కావచ్చు, ఏ విషయాన్నయినా ‘బుల్డోజ్’ చేయగల నైపుణ్యం సొంతం చేసుకోవడం కావచ్చు.. బీజేపీ కుతంత్రాలు క్లిక్ అవుతున్నాయి. ఆ పార్టీ నాయకత్వం పోకడలే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తన వల్ల ప్రయోజనాలు పొందినవారే తనను కాపాడగలరన్న ధీమా మోడీకి ఉండడమే ఈ ‘కాన్సెప్ట్’కు వెన్నెముక. అంటే ఆర్ధిక వనరులు. అవి ఎక్కడి నుంచి వస్తాయి?. ‘క్విడ్ ప్రో కో’ నుంచి వస్తాయి. క్విడ్ ప్రోకో అంటే ఏమిటి? మనం ఎవరికన్నా మేలు చేస్తే ఆ మేరకు వాళ్ళు మనకు మేలు చేయడమే. ఇదేమీ రాకెట్ సైన్సు కాదు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ప్రజాబలం అవసరం. మెజారిటీ ఎమ్మెల్యేలు అవసరం. అందుకు చాలా కసరత్తు, శ్రమ కావాలి. వ్యూహ, ప్రతి వ్యూహాలు రచించాలి. ప్రత్యర్థులను చిత్తు చేయాలి. వాళ్ళను బోల్తా కొట్టించాలి. కానీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేలను నయానా భయానా లొంగదీసుకోవడం, లోబరచుకోవడం, దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించడం.. వీటన్నింటికీ కావలసిన ఇంధనం ఒక్క్కటే! అది డబ్బు. ఆ డబ్బు రంగు సహజంగా ‘నల్ల’ రంగులో ఉంటుంది. నల్ల డబ్బు ఎలా సమకూరుతుంది? ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ రేటు ఎంత..? ఒక ఎమ్మెల్యే గెలవడానికి కనీసం 20 నుంచి 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గెలిచాక రాజకీయ సమీకరణాలలో భాగంగా ‘ప్రభుత్వాలను’ అస్థిరపరచడానికి సదరు ఎమ్మెల్యేలను ఏ రేంజ్ లో కొనుగోలు చేయవలసి ఉంటుందో అంచనా వేయడమూ కష్టమే! 2014 నుంచి బీజేపీ వివిధ ‘నాన్ బీజేపీ పాలిత’రాష్ట్రాల్లో జరుపుతున్న ప్రభుత్వాల ‘నర మేధం’ వెనుక డబ్బు ప్రవాహం ఉంది.

మహారాష్ట్ర ఎపిసోడ్ నే పరిశీలిద్దాం.. శివసేన ఎమ్మెల్యేలలో చీలిక తీసుకురావడం నుంచి విమానాల్లో తరలింపు, స్టార్ హోటళ్లలో బస, రిసార్టులలో విశ్రాంతి, వినోదం, క్యాంపులు, ముంబయి నుంచి సూరత్ కు, అక్కడి నుంచి అసోంకు ‘గొర్రెల’మంద వలె ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య తరలించే దృశ్యాల వెనుక ‘ఆర్ధిక వనరుల’సమీకరణ, భారీ పంపిణీ కనిపిస్తున్నాయి. ఆయా వనరుల యజమాని ఎవరో, అతనికీ మోడీకి మధ్య సంబంధమేమిటో కనుగొనడం కష్టమేమి కాదు.

కాగా దేశవ్యాప్తంగా ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రజల ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినప్పుడే పలువురు మేధావులు, వామపక్ష పండితులు అనుమానించారు. రహదారులు, రైల్వేస్టేషన్లు, విద్యుత్లైన్లు, టెలికాం టవర్లు, చమురు పైప్లైన్లు, బొగ్గు, మైనింగ్ ప్రాజెక్టులు, గోదాములు, విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగంలోని హోటళ్లు, క్రీడా మైదానాలు తదితర సంస్థలు, కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలు నిర్వహించనున్నాయి. విమానాశ్రయాలు, విశాఖ ఉక్కు కర్మాగారం సహా ప్రభుత్వ రంగ సంస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వదిలించుకుంటుంది. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించి నిధులు సమీకరిస్తున్నారు. మంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గౌహతి, తిరువనంతపురం ఎయిర్ పోర్టులను 50ఏళ్ల పాటు నిర్వహించడానికి గౌతమ్ అదానీ సంస్థ‌కు కట్టబెట్టారు. ఆయా విమానాశ్రయాల డిజైన్, అభివృద్ధి, ఆధునీకీకరణ, విస్తరణ, పునర్మిర్మాణం మొదలైన పనులను అదానీ గ్రూపు చేస్తుంది. మరో 50 ఏళ్ల లోపు కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారతాయో తెలియదు. అది వేరే చర్చ.

దశాబ్దాల కిందట నిర్మితమై, విస్తరించిన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్యానించేవాళ్లు బీజేపీ లేదా హిందుత్వవాదుల దృష్టిలో నిస్సందేహంగా ‘మావోయిస్టులు’ లేదా ‘దేశ ద్రోహులు’ లేదా ‘అర్బన్ నక్సల్స్’ కాగలరు. ప్రభుత్వ ఆస్తులను హస్తగతం చేసుకున్నవాళ్లు వాటి నుంచి లాభాలను పిండుకోకుండా ఊరుకుంటారా? ఈ వ్యవహారాలపై ”పద్ధతి ప్రకారం లూటీ, చట్టబద్ధమైన దోపిడీకి ఆస్కారం కలుగుతోంది” అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

కాగా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అదానీకి చెందిన ప్రైవేట్ విమానాల్లోనే మోడీ ప్రయాణించడం, 2014లో అదానీ విమానంలోనే ఢిల్లీ చేరుకుని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలామందికి తెలియని విషయాలు. అదానీ అంటే ప్రధాని మోడీకి ఎందుకు ప్రేమో, ఎందుకు వాత్సల్యమో, ఆయనకు ఎందుకంత ప్రోత్సాహం ఇస్తున్నారో చెప్పడానికి ఇవి సాక్ష్యాలు. అదానీ ఒక గుజరాతీ వ్యాపారి. ఒక మధ్యతరగతి జౌళి వ్యాపారుల కుటుంబంలో జన్మించిన అదానీ తన సోదరుల చిన్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. 2001లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదానీ దశ తిరిగింది. మోడీ ప్రోత్సాహంతో అదానీ ఊహించని ఎత్తుకు ఎదిగారు. 'మోదీ గుజరాత్ నమూనా', 'వైబ్రెంట్ గుజరాత్' బహుళ ప్రాచుర్యం పొందడానికి, అదానీ పారిశ్రామికవేత్తగా ఆకాశానికి ఎదగడానికి మధ్య ‘అనుబంధం’ మాటల్లో చెప్పలేనిది.

అదానీ గ్రూపు గుజరాత్, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలలో 11 ఓడరేవులను స్వాధీనం చేసుకుంది. ఒకే ఒక్క సంస్థకు రెండు కంటే ఎక్కువ విమానాశ్రయాలను హస్తగతం చేయకూడదని ‘నీతి ఆయోగ్’ చెప్పిన నీతులను కేంద్రప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 1980లో ‘కమోడిటీస్’ ట్రేడర్‌గా వ్యాపారం ప్రారంభించిన అదానీ ఈ ఏడేళ్ల కాలంలో చైనా కోటీశ్వరుడు జాన్ షాంషియాన్ తర్వాత ఆసియాలోనే రెండవ సంపన్నుడిగా ఎదగడం వెనుక ఎవరి హస్తం ఉన్నదో రహస్యం కాదు.

దేశంలో పలు సంస్థల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, డాటా సెంటర్లు అదానీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థల బారిన పడ్డవాళ్ళు, బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినవారు అదానీకి తమ కంపెనీలను సమర్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నట్టు గతంలో కథనాలు వెలువడ్డాయి. అబూదాబీ, కెనడాకు చెందిన సంస్థలతో జీవీకే ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని ఎయిర్ పోర్టుల నిర్వహణను అదానీకి అప్పజెప్పవలసిన పరిస్థితికి కారణాలేమిటి? కొందరు ముఖ్యమంత్రులు కూడా అదానీని తమ రాష్ట్రంలో విస్తరించేందుకు తోడ్పడడం వెనుక వారిపై బిగుసుకున్న కేసులే కారణం. కేంద్రమంత్రివర్గంలో పదవులు కావాలనుకున్నవారు అదానీ ఆశీస్సులు పొందిన సందర్భాలనూ కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

2013 వరకు అదానీ ఆస్తులు గుజరాత్ కే పరిమితం. కానీ ప్రస్తుతం దేశంలో 260 నగరాలకు పైగా అదానీ గ్రూపు విస్తరించింది. 2013లో అదానీ గ్రూపునకు 44 ప్రాజెక్టులు ఉండేవి. 2018 నాటికి ఈ ప్రాజెక్టుల సంఖ్య 92కు చేరింది. బొగ్గు మైనింగ్, ట్రేడింగ్, రేవులు, షిప్పింగ్, రైల్వే, థర్మల్ విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ ఉత్పాదన, పంపిణీ, వ్యవసాయోత్పత్తులు, వంటనూనెలు, ప్రజారవాణా, రియల్ ఎస్టేట్, శీతలీకరణ కేంద్రాలు, గోదాములు, రక్షణ రంగం.. తదితర అనేక రంగాల్లో విస్తరించినట్లు అదానీ గ్రూప్ వెబ్ సైట్ లో కనబడ్తున్నాయి. కోవిడ్ సమయంలో అనేక కంపెనీలు మూతపడ్డాయి. కానీ అదానీ గ్రూపునకు మాత్రం నిధులు కుప్పలు తెప్పలుగా వచ్చిప‌డ్డాయి.

మోడీ ప్రధానమంత్రి హోదాలో విదేశాలకు నిరంతరం పర్యటిస్తుంటారు. ఆయనతో పాటు పారిశ్రామిక, వ్యాపార, ప్రతినిధివర్గాల్లో అత్యధికులు అంబానీ, అదానీ గ్రూపులకు చెందినవారే ఉండడం కాకతాళీయం కానేకాదు. అనేక దేశాల్లో అదానీ గ్రూపు ఒప్పందాలు కుదుర్చుకోవడం రహస్యం కాదు. దేశంలో ఒక కుటుంబం దేశ రాజకీయాలను శాసిస్తోందని కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు అదానీ అనే వ్యక్తి, కొందరు వ్యాపారులు దేశ ఆర్థికవ్యవస్థను, రాజకీయాలను శాసిస్తున్నారు. ‘మోదీ ప్రధాని అయిన తర్వాత ముంబాయి ఢిల్లీకి తరలి వచ్చింద’ని ఢిల్లీ రాజకీయ సర్కిళ్లలో ఒక ప్రచారం ఉంది. పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన దుష్పరిణామాలను మోడీ సమర్ధంగా తట్టుకోగలిగారు. రాజకీయంగా ఆయనకు నష్టమూ వాటిల్లలేదు.

కనుక మోడీ, అమిత్ షా ఎలాంటి ‘కుటిల’ నిర్ణయాలు తీసుకున్నా, అదానీ – అంబానీలకు ప్రయోజనం కలిగించేందుకు గాను ‘దేశ ప్రయోజనాల’ను సైతం పణంగా పెట్టే ధోరణిని ‘దేశ భక్తులై’న విశ్వహిందూ పరిషత్‌, ఆర్ఎస్ఎస్, బ‌జరంగ్ దళ్ వంటి సంస్థలకు ఎట్లా ఆమోదయోగ్యంగా ఉన్నదో అంతుపట్టదు.

First Published:  22 Jun 2022 12:04 PM IST
Next Story