మాదే అసలైన శివసేన.. ఏక్‌నాథ్ షిండే
ఇక మాదే అసలైన శివసేన అని రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే ప్రకటించుకున్నారు. షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా ఆయనను తమ నేతగా స్పష్టంచేశారు. వీరు తమకు తాము కొత్తగా చీఫ్ విప్ ను నియమించుకున్నారు. ఉద్ధవ్ థాక్రే సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు ఇక తమ నాయకుడు షిండే అంటూ రాష్ట్ర గవర్నర్ కు, డిప్యూటీ స్పీకర్ కు లేఖలు పంపారు. శివసేన లెజిస్లేచర్ పార్టీ నేత కూడా […]
ఇక మాదే అసలైన శివసేన అని రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే ప్రకటించుకున్నారు. షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా ఆయనను తమ నేతగా స్పష్టంచేశారు. వీరు తమకు తాము కొత్తగా చీఫ్ విప్ ను నియమించుకున్నారు. ఉద్ధవ్ థాక్రే సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు ఇక తమ నాయకుడు షిండే అంటూ రాష్ట్ర గవర్నర్ కు, డిప్యూటీ స్పీకర్ కు లేఖలు పంపారు. శివసేన లెజిస్లేచర్ పార్టీ నేత కూడా షిండే అని వీరొక తీర్మానంలో ప్రకటించారు.
ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ ముఖ్ వంటి మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, తాము ఎంతో అసంతృప్తితో ఉన్నామని ఇందులో తెలిపారు. ఈ తీర్మానంపై 34 మంది సంతకాలు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ వంటి సిద్ధాంత వ్యతిరేక పార్టీల కేడర్ల నుంచి తాము రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా వేధింపులను ఎదుర్కొంటున్నామని వీరు ఆరోపించారు. అధికారం కోసం ఇలాంటి పార్టీలతో చేతులు కలపడంవల్ల శివసేన ఐడియాలజీపై రాజీ పడినట్టవుతోందన్నారు.
2019 లో కాంగ్రెస్, ఎన్సీపీలతో అంటకాగిన ఫలితంగా ఓటర్లపై ప్రతికూల ప్రభావం పడిందని, అయినా పార్టీ నాయకత్వం దీన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. చీఫ్ విప్ సునీల్ ప్రభు స్థానంలో తాము భారత్ గొగావలేని నియమించుకున్నామని వెల్లడించారు. ఇక ఎన్సీపీ రేపు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు లేవని ఒక మంత్రి తెలిపారు. తమకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఏక్ నాథ్ షిండే ప్రకటనను కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కొట్టిపారేశారు. ఇందుకు ఆధారాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.