Telugu Global
National

వింబుల్డన్ బరిలో బ్లాక్ థండర్! జోకోకు టాప్ సీడింగ్, సెరెనాకు వైల్డ్ కార్డ్

లండన్ వేదికగా మరి కొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే 2022 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పలు విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కారణంగా రష్యాకు చెందిన ప్రపంచ రెండోర్యాంక్ ఆటగాడు డేనియల్ మెద్వదేవ్ పై నిషేధం, జర్మన్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ గాయంతో టోర్నీకి దూరం కావడంతో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ టాప్ సీడెడ్ ప్లేయర్ గా పురుషుల సింగిల్స్ సమరానికి సిద్ధమయ్యాడు. జూన్ 27 నుంచి జులై 10వరకూ.. గ్రాండ్ స్లామ్ […]

129
X

లండన్ వేదికగా మరి కొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే 2022 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పలు విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కారణంగా రష్యాకు చెందిన ప్రపంచ రెండోర్యాంక్ ఆటగాడు డేనియల్ మెద్వదేవ్ పై నిషేధం, జర్మన్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ గాయంతో టోర్నీకి దూరం కావడంతో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ టాప్ సీడెడ్ ప్లేయర్ గా పురుషుల సింగిల్స్ సమరానికి సిద్ధమయ్యాడు.

జూన్ 27 నుంచి జులై 10వరకూ..

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలలో అత్యంత ప్రతిష్టాత్మక, పురాతన టోర్నీగా పేరుపొందిన వింబుల్డన్ 2022 సీజన్ పోరు జూన్ 27 నుంచి జులై 10 వరకూ లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ గ్రాస్ కోర్టులు వేదికగా జరుగనున్నాయి. రష్యాకు చెందిన డేనియల్ మెద్వదేవ్, ప్రపంచ 8వ ర్యాంకర్ యాండ్రీ రుబులేవ్, అనస్తాసియా పెల్యుచెంకోలాంటి ప్లేయర్లపై వింబుల్డన్ నిర్వాహక సంఘం నిషేధం విధించడం విమర్శలకు దారితీసింది. క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టడం ఏంటంటూ వింబుల్డన్ నిర్వాహక సంఘాన్ని తప్పుపడుతున్నారు.

ర్యాంకింగ్స్ ఆధారంగానే సీడింగ్స్…

1877 నుంచి ఆల్ ఇంగ్లండ్ క్లబ్ పచ్చిక కోర్టుల్లో జరుగుతూ వస్తున్న వింబుల్డన్ కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొంటూ వస్తోంది. 2019 వరకూ గ్రాస్ కోర్టుల్లో ప్రతిభా ఆధారంగానే సీడింగ్స్ ఇచ్చే సాంప్రదాయం ఉండేది. అయితే 2021 నుంచి ఏటీపీ, డబ్లుటిఏ ర్యాంకింగ్స్ ఆధారంగానే సీడింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. 1985లో బోరిస్ బెకర్, 2001లో గోరన్ ఇవానీసేవిచ్ ..ఆన్ సీడెడ్ గా బరిలో నిలిచి టైటిల్ నెగ్గిన మొనగాళ్లుగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుత సీజన్ టోర్నీ క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా మొత్తం 11 మంది ఆన్ సీడెడ్ క్రీడాకారులు మెయిన్ డ్రాకు అర్హత సంపాదించారు. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో 32 మంది అగ్రశ్రేణి క్రీడాకారులకు సీడింగ్స్ ప్రకటించారు.

అమెరికన్ బ్లాక్ థండర్ బ్యాక్…

23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్, అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ ..ఏడాది విరామం తర్వాత 40 సంవత్సరాల వయసులో తిరిగి టెన్నిస్ బరిలో నిలిచింది. కాలిగాయంతో గత ఏడాదిగా ఆటకు దూరమైన సెరెనా తిరిగి వింబుల్డన్ ద్వారా తన అదృష్టం పరీక్షించుకోనుంది.

వింబుల్డన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా సెరెనాకు నిర్వాహక సంఘం ప్రవేశం కల్పించింది. చివరిసారిగా 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెరెనా తన కెరియర్ లో అత్యధికంగా వింబుల్డన్ టైటిల్సే సాధించడం విశేషం. మరో టైటిల్ నెగ్గితే మార్గారెట్ కోర్టు పేరుతో ఉన్న 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును సెరెనా సమం చేయగలుగుతుంది. 2016లో తన చివరి వింబుల్డన్ ట్రోఫీ అందుకొన్న సెరెనా ఇప్పటి వరకూ ఏడుసార్లు వింబుల్డన్ క్వీన్ గా నిలిచింది. 2017లో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత సెరెనా ఆటలో వెనుకబడిపోయింది. మరి..40 సంవత్సరాల లేటు వయసులో సెరెనా ఎలా రాణించగలదన్నది టెన్నిస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

First Published:  22 Jun 2022 4:53 AM IST
Next Story