Telugu Global
National

11 ఏళ్లు…101 టెస్టులు…8వేల పరుగులు..టెస్ట్ క్రికెట్లో విరాట..పర్వం!

భారత మాజీ కెప్టెన్, ఆధునిక పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 11 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేశాడు. మాస్టర్ సచిన్ వారసుడిగా 2011 జూన్ 20న టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసిన విరాట్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా, కెప్టెన్ గా భారత క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కించాడు. జమైకా నుంచి భారత్ వరకూ… పదకొండు సంవత్సరాల క్రితం వన్డే క్రికెట్లో సత్తా చాటుకోడం ద్వారా భారత టెస్టు జట్టులోకి అడుగుపెట్టిన 22 ఏళ్ల […]

virat-kohli-11-years-of-red-ball-cricket
X

భారత మాజీ కెప్టెన్, ఆధునిక పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 11 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేశాడు. మాస్టర్ సచిన్ వారసుడిగా 2011 జూన్ 20న టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసిన విరాట్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా, కెప్టెన్ గా భారత క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కించాడు.

జమైకా నుంచి భారత్ వరకూ…

పదకొండు సంవత్సరాల క్రితం వన్డే క్రికెట్లో సత్తా చాటుకోడం ద్వారా భారత టెస్టు జట్టులోకి అడుగుపెట్టిన 22 ఏళ్ల విరాట్ కొహ్లీ..జమైకాలోని కింగ్ స్టన్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 15 పరుగుల స్కోర్లకే అవుటైన విరాట్ ఆ తర్వాత నుంచి అలవోకగా, అత్యంత వేగంగా పరుగులు, శతకాలు సాధిస్తూ ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్ కే వెన్నెముకగా నిలిచిన విరాట్ కెప్టెన్ గానూ తనజట్టుకు పలు అపురూప, అరుదైన సిరీస్ విజయాలు అందించాడు.

12వ భారత క్రికెటర్ విరాట్

క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతి ఒక్క ఆటగాడు జీవితకాలంలో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్ ఆడినా, టెస్టు క్రికెటర్ గా పిలిపించుకొన్నా తన జీవితం ధన్యమైనట్లుగానే భావిస్తాడు. అయితే..ఒకటికాదు రెండు కాదు..ఏకంగా వంద టెస్టులు ఆడే అపూర్వ అవకాశం అతికొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. అలాంటి ఆటగాళ్ళ జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ వంద టెస్టులు ఆడిన భారత 12వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన 2022 సిరీస్ తొలి టెస్టు ద్వారా విరాట్ కొహ్లీ నూరు టెస్టులు ఆడిన మొనగాడిగా నిలిచాడు. తొమ్మిది దశాబ్దాల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సర్ సీకె నాయుడు, నారీ కాంట్రాక్టర్ , విజయ్ మర్చంట్ , మహ్మద్ అజారుద్దీన్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లకు దక్కని అదృష్టం కొహ్లీతో సహా మొత్తం 12 మంది భారత క్రికెటర్లకు మాత్రమే దక్కింది.

రికార్డుల మొనగాడు….

టెస్టు క్రికెట్లో 2011 నుంచి 2019 వరకూ విరాట్ కొహ్లీ హవా కొనసాగింది. ఆడిందే ఆటగా…కొట్టిందే షాటుగా చెలరేగిపోయాడు. విండీస్ తో తన అరంగేట్రం టెస్టు నుంచి సొంతగడ్డపై శ్రీలంకతో ముగిసిన 2022 సిరీస్ రెండో టెస్టు వరకూ 101 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 168 ఇన్నింగ్స్ లో 8వేల 043 పరుగులతో 49.95 సగటు నమోదు చేశాడు. ఇందులో 7 ద్విశతకాలతో సహా మొత్తం 27 సెంచరీలు, 28 అర్థశతకాలు సాధించాడు. 254 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు. మొత్తం 14వేల 300 బంతులు ఎదుర్కొని 896 బౌండ్రీలు, 24 సిక్సర్లతో 55. 68 స్ట్రయిక్ రేట్ సాధించాడు.

టెస్టు కెప్టెన్ గా రికార్డుల హోరు…

2015లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలు అందుకొన్న కొహ్లీ నాయకత్వంలో భారతజట్టు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా, ఐసీసీ టెస్టు లీగ్ రన్నరప్ గా నిలిచింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాగడ్డపై ఓడించి టెస్టు సిరీస్ నెగ్గాలన్న చిరకాల స్వప్నం సైతం కొహ్లీ కెప్టెన్సీలోనే నెరవేరింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన మొదటి నలుగురు ఆటగాళ్ల జాబితాలో విరాట్ కొహ్లీ 4వ స్థానంలో నిలిచాడు. భారత సారధిగా కొహ్లీ ఏడు డబుల్ సెంచరీలు సాధించడం ఓ ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది. మాస్టర్ సచిన్, బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్ చెరో ఆరు డబుల్ సెంచరీలు చొప్పున సాధించగా…ఈ ఇద్దరి మొనగాళ్ల రికార్డును విరాట్ కొహ్లీ తెరమరుగు చేశాడు.

టెస్టు క్రికెట్లో అత్యంతవేగంగా 7వేల పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డు విరాట్ కొహ్లీ పేరుతోనే ఉంది. విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ గా ఇప్పటి వరకూ సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న రికార్డును విరాట్ అధిగమించాడు.విదేశీ సిరీస్ ల్లో ఏకంగా 1, 731 పరుగులతో విరాట్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. విరాట్ కేవలం 19 టెస్టుల్లోనే 1731 పరుగులు నమోదు చేశాడు. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వెయ్యి పరుగులు సాధించిన 13వ భారత క్రికెటర్ ఘనతను సైతం విరాట్ సొంతం చేసుకొన్నాడు.

150కి పైగా స్కోర్ల ప్రపంచ రికార్డు…

టెస్ట్ క్రికెట్లో కెప్టెన్ గా విరాట్ కొహ్లీ 150కి పైగా స్కోర్లను తొమ్మిదిసార్లు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ డోనాల్డ్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న ఎనిమిది 150 స్కోర్ల రికార్డును కొహ్లీ అధిగమించాడు. తొమ్మిదిసార్లు 150కి పైగా స్కోర్లు సాధించిన తొలి కెప్టెన్ ఘనత సైతం విరాట్ కొహ్లీకి మాత్రమే దక్కుతుంది. అయితే..11 సంవత్సరాల తన టెస్టు కెరియర్ మొదటి 9 సంవత్సరాల కాలంలో ఓ వెలుగువెలిగిన విరాట్ గత రెండేళ్లుగా వెలవెల పోతున్నాడు. స్థాయికి తగ్గట్టుగా ఆడటంలో విఫలమవుతున్నాడు. 2019 నవంబర్ తర్వాత నుంచి టెస్టు శతకం విరాట్ ను వెక్కిరిస్తూ వస్తోంది.

ఇంగ్లండ్ తో జులై 2 నుంచి జరిగే 2022 సిరీస్ ఆఖరి టెస్టు మ్యాచ్ విరాట్ సత్తాకు అసలు సిసలు పరీక్ష కానుంది. మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న అత్యధిక టెస్టులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డులను విరాట్ అధిగమించాలంటే మరో దశాబ్దకాలం టెస్టు క్రికెటర్ గా కొనసాగుతూ నిలకడగా రాణించక తప్పదు. మరి….మూడుఫార్మాట్ల మొనగాడు విరాట్ కొహ్లీకి టెస్టు క్రికెట్లో మరో దశాబ్దకాలం పాటు కొనసాగే సత్తా , పట్టుదల, అంకితభావం ఉన్నాయా? రానున్నకాలమే చెప్పాలి.! కొహ్లీ…మాస్టర్ సచిన్ లా 22 సంవత్సరాలపాటు తన కెరియర్ ను కొనసాగించగలిగితే 150కి పైగా శతకాలు బాదినా ఆశ్చర్యపోనక్కరలేదు.

First Published:  21 Jun 2022 5:48 AM IST
Next Story