Telugu Global
National

‘అగ్నిపథ్’ పోరాటంలోకి రైతు సంఘాలు… ఈ నెల 24న దేశవ్యాప్తనిరసనలు

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై నిరుద్యోగులు దేశవ్యాప్త నిరసనలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకు మద్దతుగా రైతు సంఘాలు రంగంలోకి దిగాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఉద్యమం చేసి విజయం సాధించిన సంయుక్త కిసాన్ మోర్చా (SKM) అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఈ నెల 24 న దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ తికాయత్ ఓ ప్రకటన విడుదల చేశారు. హర్యాణా లోని కర్నల్ […]

farmers protest
X

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై నిరుద్యోగులు దేశవ్యాప్త నిరసనలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకు మద్దతుగా రైతు సంఘాలు రంగంలోకి దిగాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఉద్యమం చేసి విజయం సాధించిన సంయుక్త కిసాన్ మోర్చా (SKM) అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఈ నెల 24 న దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ తికాయత్ ఓ ప్రకటన విడుదల చేశారు.

హర్యాణా లోని కర్నల్ లో జరిగిన SKM సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తికాయత్ తెలిపారు. శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనల్లో యువత, రాజకీయ పార్టీలు పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.

జూన్ 24న భారతదేశ వ్యాప్తంగా జిల్లా, తహసీల్ ప్రధాన కార్యాలయాలలో అగ్నిపథ్ కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించాలని SKM కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది.

మొదట తికాయత్ నాయకత్వంలోని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) ఈ నెల 30న నిరసనకు పిలుపునిచ్చింది. అయితే సంయుక్త కిసాన్ మోర్చాలోని భాగస్వామ్య పక్షాలన్నీ అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో తాము 30 వ తేదీ కార్యక్రమం రద్దు చేసుకొని 24వ తేదీనే అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గోనున్నట్టు తికాయత్ తెలిపారు.

మరో వైపు సంయుక్త కిసాన్ మోర్చా తన ప్రకటనలో మోదీ ప్రభుత్వంపై విరుచుకపడింది. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ తన విజయ యాత్రను ప్రారంభించారని, ఇప్పుడు ‘కొత్తగా ‘నో ర్యాంక్ నో పెన్షన్’ పథకాన్ని ప్రవేశపెట్టారని SKM మండిపడింది.

ఈ ప్రభుత్వం సైనిక వ్యతిరేక‌, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించిన SKM అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాలని యువతకు విజ్ఞప్తి చేసింది

‘జై జవాన్ జై కిసాన్’ నినాదం స్ఫూర్తిని నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నప్పుడు, ఈ పోరాటంలో జవాన్లతో భుజం భుజం కలిపి నిలబడటం రైతుల యొక్క కర్తవ్యం,” అని మోర్చా పేర్కొంది.

First Published:  20 Jun 2022 10:12 PM GMT
Next Story