తొండ ముదిరి ఊసరవెల్లి..! ‘ప్రజాతీర్పు’ను అపహాస్యం చేస్తున్న బీజేపీ
మహారాష్ట్ర తాజా రాజకీయ సంక్షోభం ఎలా ముగిసినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి బీజేపీ ఎంతగా తెగబడుతుందో స్పష్టం కానుంది. బీజేపీ తొండ ముదిరి ఊసరవెల్లిగా మారింది. కాంగ్రెస్ పార్టీని ప్రతినిత్యం దుమ్మెత్తి పొసే బీజేపీ.. కాంగ్రెస్ సంస్కృతినే అనుసరిస్తోంది. రాజకీయ ప్రత్యర్ధుల దెబ్బతీయడానికి కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో కొనసాగినంత కాలం బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. ప్రత్యర్దులపైకి సీబీఐ, ఈడీ, తదితర సంస్థలను ఉసిగొల్పొతోందని బీజేపీ నాయకులు నిప్పులుచెరుగుతూ ఉండేవాళ్లు. అందులో […]
మహారాష్ట్ర తాజా రాజకీయ సంక్షోభం ఎలా ముగిసినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి బీజేపీ ఎంతగా తెగబడుతుందో స్పష్టం కానుంది. బీజేపీ తొండ ముదిరి ఊసరవెల్లిగా మారింది. కాంగ్రెస్ పార్టీని ప్రతినిత్యం దుమ్మెత్తి పొసే బీజేపీ.. కాంగ్రెస్ సంస్కృతినే అనుసరిస్తోంది. రాజకీయ ప్రత్యర్ధుల దెబ్బతీయడానికి కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో కొనసాగినంత కాలం బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. ప్రత్యర్దులపైకి సీబీఐ, ఈడీ, తదితర సంస్థలను ఉసిగొల్పొతోందని బీజేపీ నాయకులు నిప్పులుచెరుగుతూ ఉండేవాళ్లు.
అందులో గుజరాత్ ముఖ్యమంత్రిగా నాటి మోడీ కూడా ముందు వరసలో ఉన్నారు. సీను రివర్స్ అయ్యింది కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వెళ్లింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ కూడా కాంగ్రెస్ దారిలోనే ప్రయాణిస్తుందనడానికి పలు ఉదంతాలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి దర్యాప్తు సంస్ధలను మోడీ ప్రభుత్వం ఉసిగొల్పుతోంది. అదే సమయంలో తమకు మద్దతుగా మారినవారు లేదా తమ పార్టీలో చేరినవారి విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తును తీరుతెన్నులు ఎంత బలహీనంగా ఉన్నాయో గమనిస్తున్నాం. టీడీపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి, ప్రస్తుత వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వంటి వారంతా ఇప్పుడు ‘పునీతులు’ అయిన జాబితాలో ఉన్నారు.
బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నదూకుడు తీరు కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ కనిపించలేదు. వివిధ రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు చేస్తున్న దాడులు, దర్యాప్తు చేస్తున్న విధానాలు కాంగ్రెస్ హయాంలో జరిగిన ఉదంతాలను ఎప్పుడో బీజేపీ ఓవర్ టేక్ చేసిపారేసింది. ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం, ప్రభుత్వాలను అస్ధిరపర్చి కూల్చేయటంలో బీజేపీ కొత్త రికార్డులను సృష్టిస్తుంది.
కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో ‘ప్రజాతీర్పు’ తారుమారు చేసి ప్రభుత్వాలను కూల్చి పారేసిన ‘విజయోత్సాహం’తో మిగతా రాష్ట్రాల్లోని నాన్ బీజేపీ ప్రభుత్వాల్ని కూల్చివేసే పనిలో బీజేపీ నాయకత్వం ఉంది. కర్నాటక ప్రజలు కాంగ్రెస్-జేడీఎస్ లకు అధికారం కట్టబెడితే ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది. రెండు పార్టీల్లోని ఎమ్మెల్యేల్లో కొందరిని లాగేసుకుంది. మధ్యప్రదేశ్ లో 28 మంది ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ కుట్రలు భగ్నమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోనూ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.
మహారాష్ట్రలోని ‘మహా వికాస్ ఆఘాడి’ అంటే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఆధ్వర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నలుగురు ఎమ్మెల్సీలు విజయం సాధించగలిగిన బలమున్న బీజేపీ తరఫున అయిదుగురు ఎమ్మెల్సీ ఎన్నిక కావడమే శివసేన ‘చీలిక’ కు పునాదులు పడ్డాయి. ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను లాగేసుకోవటం, ప్రభుత్వాలను కూల్చటం.. అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. ప్రజాస్వామ్య విలువల గురించి నీతులు చెబుతున్న మోడీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్ కు ఎన్ని అవలక్షణాలు వచ్చాయో గడచినా కేవలం ఎనిమిదేండ్లలో బీజేపీకి అంతకుమించిన అవలక్షణాలు వచ్చేశాయి.
1993 ముగిసే నాటికి దేశంలో 26 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. అందులో 15 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంటే ఒక రాష్ట్రంలో మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంది. ప్రస్తుతం చత్తీస్ గఢ్, రాజస్థాన్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారానికి పరిమితమయ్యింది. 2014 లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావటానికి ముందు, ఆ పార్టీ ఏడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, సిక్కిం, అసోం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురుతోంది.
మిగతా రాష్ట్రాల్లోనూ పాగా వేయాలన్నది బీజేపీ లక్ష్యం. బీజేపీ ఇందుకు రెండు ఫార్ములాలను పాటిస్తోంది. 1.ప్రజల్ని కులాలు, మతం పేరిట విడగొట్టి ఉన్మాదాన్ని రగిలించి ఓటర్లను తనవైపునకు లాక్కోవడం. 2. ప్రజలు నాన్ బీజేపీ పార్టీలను అధికారంలోకి తీసుకువస్తే ఆ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిష్టింపజేయడం. రెండవ ఫార్ములా సక్సెస్ కావడానికి కేంద్రంలో అధికారం, అర్ధబలం, అంగబలం, దర్యాప్తు సంస్థలు ప్రధాన వనరులు.