మోదీ గారూ, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
చిన్నదో, పెద్దదో ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇంటి లోపల ఉండే సౌకర్యాల విషయం ఎలాగైనా ఉండనీ, ఇంటికి రక్షణగా ఉండే తలుపులు, కిటికీలు, వాటికి బిగించే గ్రిల్స్, గొళ్లాల విషయంలో ఎవరూ కాంప్రమైజ్ కారు, కాకూడదు. దేశం సంగతి కూడా అంతే. దేశం లోపల అభివృద్ధి, సౌకర్యాల మాట ఎలా ఉన్నా.. దేశ సమగ్రత, భద్రతకు సంబంధించిన రక్షణ విషయంలో, సైనిక వ్యవస్థ విషయంలో ఏ దేశమైనా ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు.. కాకూడదు. మార్పు సహజం. అన్ని […]
చిన్నదో, పెద్దదో ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇంటి లోపల ఉండే సౌకర్యాల విషయం ఎలాగైనా ఉండనీ, ఇంటికి రక్షణగా ఉండే తలుపులు, కిటికీలు, వాటికి బిగించే గ్రిల్స్, గొళ్లాల విషయంలో ఎవరూ కాంప్రమైజ్ కారు, కాకూడదు.
దేశం సంగతి కూడా అంతే. దేశం లోపల అభివృద్ధి, సౌకర్యాల మాట ఎలా ఉన్నా.. దేశ సమగ్రత, భద్రతకు సంబంధించిన రక్షణ విషయంలో, సైనిక వ్యవస్థ విషయంలో ఏ దేశమైనా ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు.. కాకూడదు.
మార్పు సహజం. అన్ని రంగాల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. సైన్యంలో సిబ్బంది భర్తీ విషయంలో కూడా మార్పులు చేయడం పెద్దగా ఆక్షేపణీయం ఏమీ కాదు. కానీ, ప్రవేశపెట్టే మార్పులు, సైన్యం ప్రాథమిక స్వభావాన్ని పలుచన చేసే విధంగా, సైనిక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉండకూడదు.
సైన్యం అంటేనే క్రమశిక్షణకు, అంకిత భావానికి మారుపేరు. నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయనో, లైఫ్ కులాసాగా గడిపేయచ్చనో ఎవ్వరూ సైన్యం లో చేరరు. సైన్యంలో చేరడం అంటే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండటం, జీవితాన్ని దేశ రక్షణకు అంకితం చేయటం.
ఇంతటి నిబద్ధత తో పనిచేయాల్సిన సైన్యంలో అగ్నిపథ్ లాంటి పథకం ద్వారా మొత్తం సైనిక వ్యవస్థ మూలాలు దెబ్బతినే అవకాశం ఉంది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసున్న యువతను సైన్యంలో భర్తీ చేసుకొని, వారికి నాలుగేళ్ల కాలపరిమితి విధించడం వల్ల వారిలో అంకిత భావాన్ని పెంపొందింపచేయడం అస్సలు సాధ్యం కాదు. ఈ స్కీం ద్వారా సైన్యం లో నియమితులయ్యే యువకులు కేవలం నాలుగేళ్లలో సైన్యంతో మమేకంకాగలుగుతారా అన్నదే అతి పెద్ద సందేహం.
అగ్నిపథ్ కింద భర్తీ చేసిన వాళ్ళలో 25 శాతం మంది సైన్యంలో కొనసాగుతారు, మిగతా 75 శాతం మంది సైన్యాన్ని వీడి, తమ తమ బతుకుదెరువుల్ని చూసుకోవాలి అనడం అయోమయానికి దారితీయడంపాటు, కచ్చితంగా ఆ యువకుల్లో ఒక రకమైన అభద్రతా భావానికి, అనర్థం కలుగచేసే పోటీతత్వానికి దారితీస్తుంది. ఇవన్నీ సైనిక సిబ్బంది ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అంశాలే. కొన్ని దశాబ్దాల తరబడి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించుకున్న పటిష్టమైన వ్యవస్థకు అగ్నిపథ్ అగ్గి రాజేసింది. భారత దేశ రక్షణ వ్యవస్థ తన సంప్రదాయ స్వభావం కోల్పోయే పెనుప్రమాదం పొంచి ఉంది.
కేవలం భారత సైన్యానికి ఇచ్చే జీతభత్యాలు, పెన్షన్ల వ్యయం తక్కువ చేయడానికి ఈ పథకం అమలులోకి తీసుకురావడం దిక్కుమాలిన ఆలోచన. దేశ భద్రతను ఫణంగా పెట్టి, ఖర్చును ఆదా చేయాలని చూడటం అవివేకం కాక మరేమిటి?
దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి అగ్నిపథ్ పథకం ఉపయోగపడుతుంది అన్న వాదనలో కూడా నిజం లేదు. యువతకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యం అయితే దానికి “స్కిల్ ఇండియా” లాంటి పథకాలున్నాయి. వాటిని పటిష్టంగా అమలు చేసి యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేయొచ్చు.
సైన్యంలో కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టే అగ్నిపథ్ స్కీమ్ వల్ల మొత్తం దేశ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. అటు చైనా, ఇటు పాకిస్తాన్ లాంటి గుంట నక్కలు సరిహద్దు దేశాలుగా ఉన్న భారత దేశం, అగ్నిపథ్ లాంటి అనాలోచిత పథకాల ద్వారా తన సైనిక వ్యవస్థను బలహీన పరుచుకోవడం ఆత్మహత్యా సదృశం.
ఇంత చిన్న లాజిక్ ను ప్రధాని మోదీ గారెందుకు మిస్సయ్యారో అర్థం కావట్లేదు!