Telugu Global
National

ఏక్‌నాథ్ షిండేపై వేటు.. మహారాష్ట్రలో పొలిటికల్ ఎత్తులు-జిత్తులు

మహారాష్ట్రలో మంత్రి ఏక్‌నాథ్ షిండే రేపిన చిచ్ఛు పెను రాజకీయ సంక్షోభానికి దారి తీస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రకటించినప్పటి నుంచి సుమారు 26 మంది ఎమ్మెల్యేలను రాత్రికి రాత్రి గుజరాత్ సూరత్ లోని ఓ రిసార్టుకు తరలించిన ఈ శివసేన నేతపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. రాష్ట్ర అసెంబ్లీలో శివ‌సేన లెజిస్లేటివ్ గ్రూప్ నేత పదవి నుంచి ఆయన్ను తొలగించింది. ఒకవిధంగా తిరుగుబాటు లేవనెత్తిన షిండే.. రెబల్ నాయకుడిగా మారిపోయారు. తాజాగా మరో మంత్రి […]

ఏక్‌నాథ్ షిండేపై వేటు.. మహారాష్ట్రలో పొలిటికల్ ఎత్తులు-జిత్తులు
X

మహారాష్ట్రలో మంత్రి ఏక్‌నాథ్ షిండే రేపిన చిచ్ఛు పెను రాజకీయ సంక్షోభానికి దారి తీస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రకటించినప్పటి నుంచి సుమారు 26 మంది ఎమ్మెల్యేలను రాత్రికి రాత్రి గుజరాత్ సూరత్ లోని ఓ రిసార్టుకు తరలించిన ఈ శివసేన నేతపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. రాష్ట్ర అసెంబ్లీలో శివ‌సేన లెజిస్లేటివ్ గ్రూప్ నేత పదవి నుంచి ఆయన్ను తొలగించింది. ఒకవిధంగా తిరుగుబాటు లేవనెత్తిన షిండే.. రెబల్ నాయకుడిగా మారిపోయారు.

తాజాగా మరో మంత్రి జాడ కూడా తెలియకుండా పోయింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి దాదా భూసే ఎక్కడున్నారో తెలియడంలేదు. బహుశా ఆయన రెబల్ క్యాంప్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అన్నట్టు ఈయన కూడా ఏక్‌నాథ్ షిండే సన్నిహితుడే. మరో 9మంది ఎమ్మెల్యేలు కూడా సూరత్ లో షిండే శిబిరాన్ని విజిట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నగరంలోని లే మెరిడియన్ హోటల్.. క్రమంగా శివసేన ఎమ్మెల్యేలు, నాయకులతో నిండిపోతోంది.

ఈ పరిణామాలతో ఖంగుతింటున్న సీఎం ఉద్ధవ్ థాక్రే సన్నిహిత వర్గాలు ఇద్దరు మెసెంజర్లను సూరత్ కి పంపి.. ఏక్‌నాథ్ షిండేను బుజ్జగించే యత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్ధ‌వ్‌కి అత్యంత‌ సన్నిహితులైన మిలింద్ నర్వేకర్, ఎంపీ రాజన్ విచారే సూరత్ వెళ్లనున్నట్టు సమాచారం. ఇక తన భర్త, శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ గత రాత్రి నుంచి కనిపించడం లేదని, ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లో ఉందని ఆయన భార్య ప్రాంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి కాంగ్రెస్, బీజేపీ
మహారాష్ట్రలో చకచకా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం దృష్ట్యా తమ ఏఐసీసీ అబ్జర్వర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ని ముంబైకి పంపింది. అక్కడి తాజా పరిణామాలను ఆయన మదింపు చేసి ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి తెలియజేస్తారని భావిస్తున్నారు.

బీజేపీ సైతం తక్కువ తినలేదు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కూటే సూరత్ లో శివసేన ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ కి చేరుకున్నారు. రెబల్స్ అందరినీ ఈ పార్టీ అహ్మదాబాద్ కి తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేయవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం ఫడ్నవీస్ ఆధ్వర్యాన ప్రభుత్వం ఏర్పడాలని శివేంద్రరాజే భోసాలే వంటి బీజేపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరోవైపు బీజేపీని మిత్ర పక్షంగా చేసుకోవాలని ఏక్‌నాథ్ షిండే.. సీఎం ఉద్ధవ్ థాక్రేని కోరవచ్చునట.

First Published:  21 Jun 2022 2:06 PM IST
Next Story