అగ్నిపథ్ పేరుతో బీజేపీ కుట్ర.. మమతాబెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు
ఇండియన్ ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. అగ్నివీర్ పేరుతో సైన్యంలో బీజేపీ క్యాడర్‌ను సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అగ్నిపథ్ పేరుతో రిక్రూట్ చేసుకుని వారికి తుపాకీ శిక్షణ ఇస్తారని ఆమె అన్నారు. `సైనిక వ్యవస్థను గౌరవిస్తాను కానీ, ఈ ప్రకటన సైన్యం చేయలేదు. కేంద్ర హోం శాఖ చేసింది. అందుకే దీనిపై అనుమానాలు […]
ఇండియన్ ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. అగ్నివీర్ పేరుతో సైన్యంలో బీజేపీ క్యాడర్‌ను సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అగ్నిపథ్ పేరుతో రిక్రూట్ చేసుకుని వారికి తుపాకీ శిక్షణ ఇస్తారని ఆమె అన్నారు. 'సైనిక వ్యవస్థను గౌరవిస్తాను కానీ, ఈ ప్రకటన సైన్యం చేయలేదు. కేంద్ర హోం శాఖ చేసింది. అందుకే దీనిపై అనుమానాలు ఉన్నాయి. ఈ పథకం వెనక బీజేపీ కుట్ర దాగి ఉందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి' అని అన్నారు.
బీజేపీ నిప్పుతో చెలగాటం ఆడుతుందని మమతా బెనర్జీ అన్నారు. 'ఒక సమస్యను అణిచివేసేందుకు మరో అంశాన్ని లేవనెత్తుతున్నారు. బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోంది. బీజేపీ రెచ్చగొట్టిన తర్వాత కూడా మైనారిటీ సోదర సోదరీమణులు నిరసన వ్యక్తం చేయకపోవడం బీజేపీలో ఉత్కంఠ రేపుతోంది. అందుకే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది' అని మమతా బెనర్జీ మండిపడ్డారు.
కాగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమత ప్రకటనను బీజేపీ తప్పు బట్టింది. ఆ పార్టీ నేత సువేందు అధికారి నేతృత్వంలో ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బీజేపీనే కాదు ఆర్మీని కూడా అవమానిస్తున్నారని సువేందు అధికారి అన్నారు. వెంటనే ఆమె తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.