Telugu Global
NEWS

జూపల్లి ఇంటికి కేటీఆర్.. అంతా ఓకేనా ఇక

పాలమూరు జిల్లాకు చెందిన కీలక నేత జూపల్లి కృష్ణారావు ఇంటికి ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా జూపల్లి తన సొంత పార్టీ టీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లు ఉన్నారు. తెలంగాణలో కీలకమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి, గతంలో అధికార పార్టీలో మంత్రిగా కూడా పని చేశారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి జూపల్లి హాజరు కాకపోవడతో ఆయన పార్టీని వీడుతున్నారనే వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ అసంతృప్త నేతలైన […]

KTR-visited-Jupally-Krishna-Rao-house
X

పాలమూరు జిల్లాకు చెందిన కీలక నేత జూపల్లి కృష్ణారావు ఇంటికి ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా జూపల్లి తన సొంత పార్టీ టీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లు ఉన్నారు. తెలంగాణలో కీలకమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి, గతంలో అధికార పార్టీలో మంత్రిగా కూడా పని చేశారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి జూపల్లి హాజరు కాకపోవడతో ఆయన పార్టీని వీడుతున్నారనే వార్తలు వచ్చాయి.

టీఆర్ఎస్ అసంతృప్త నేతలైన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కూడా జూపల్లి భేటీ కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరో వైపు పాలమూరులో కీలక నేతలు వేరే పార్టీల్లో బలమైన లీడర్లుగా ఎదిగారు. కొడంగల్‌కు చెందిన రేవంత్ రెడ్డి ఏకంగా టీపీసీసీ ప్రెసిడెంట్‌గా మారగా.. ఇక గద్వాల్‌కు చెందిన డీకే అరుణ బీజేపీ పార్టీలో కీలకమైన పొజిషన్‌లో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. మొదటి నుంచి తమ పార్టీతో పనిచేసి అసంతృప్తితో ఉన్న నేతలను దగ్గర చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవాలని నిర్ణయించుకోవడంతో.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యతను కేటీఆర్ భుజానికి ఎత్తున్నారు. కేటీఆర్ ఇవాళ జూపల్లి ఇంటికి వెళ్లింది కూడా మంత్రి హోదాలో కాకుండా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలోనే అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కేటీఆర్‌తో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. జూపల్లితో స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే హర్ష ఆధిపత్యం కారణంగానే జూపల్లి టీఆర్ఎస్‌ను వీడాలనే ఆలోచనకు వచ్చినట్లు కేటీఆర్ తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ సమస్యను తానే తీరుస్తానని.. పార్టీలో వర్గపోరు మంచిది కాదని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది.

జూపల్లికి జాతీయ పార్టీలో మంచి హోదా లభిస్తుందని.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తగినంత ప్రాధాన్యత లభించేలా చూస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ హోదాలో కేటీఆర్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏదేమైనా పాలమూరులో కీలకనేతను ఏకంగా కేటీఆర్ బుజ్జగించడానికి రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

First Published:  19 Jun 2022 11:52 PM GMT
Next Story