సంక్షోభ పరిష్కర్తగా కేటీఆర్..!
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున పార్టీలో సంక్షోభ పరిష్కర్తగా కేటీఆర్ అవతరించారు. ఆయన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య తలెత్తిన సమస్యలు, అభిప్రాయ భేదాలను పరిష్కారించడంలో తలమునకలయి ఉన్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. టీఆర్ఎస్ పాత నాయకులు, […]
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున పార్టీలో సంక్షోభ పరిష్కర్తగా కేటీఆర్ అవతరించారు. ఆయన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య తలెత్తిన సమస్యలు, అభిప్రాయ భేదాలను పరిష్కారించడంలో తలమునకలయి ఉన్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. టీఆర్ఎస్ పాత నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల అసమ్మతి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని అసంతృప్త అధికారపార్టీ నాయకులను తమ ‘శిబిరానికి’ తరలించేందుకు కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఆయా ప్రతిపక్షాల బలహీనతను బట్టబయలు చేస్తుంది.
పలు చోట్ల బీజేపీకి సమర్థులైన అభ్యర్థులు లేకపోవడం ఇందుకు కారణం. అలాగే కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ అసమ్మతి నాయకులెవరో అన్వేషించి రాయబారం పంపుతోంది. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు, తుమ్మల, పొంగులేటి వంటి వారికి వల విసిరింది. ఈ సమాచారం అందిన వెంటనే కేటీఆర్ రంగంలో దిగారు. ప్రతిపక్షాలు ఊహిస్తున్నట్టుగా అధికార పార్టీలో కొనసాగుతున్న నాయకులు అంత త్వరగా టిఆర్ఎస్ ను, కేసీఆర్ ను వీడే పరిస్థితులు లేవు. వాళ్లంతా ఆచితూచీ అడుగేస్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా కేసీఆర్ తన ‘మ్యాజిక్కు’ తో దాన్ని ‘ఓవర్ టేక్’ చేయగలరనే నమ్మకమూ ఒక కారణం. టీఆర్ఎస్ మరలా అధికారంలోకి వచ్చే నాటికి తాము ఆ పార్టీలో లేకపోతే రాజకీయంగా నష్టమేమిటో వారికి తెలియనిది కాదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్న మాట నిజమే! ఆ సమస్యలు తక్షణం పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగవచ్చని కేటీఆర్ కు సమాచారం అందింది. కొన్నినెలల కిందట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు. అదే రోజు ఆయన వ్యూహాత్మకంగా ఖమ్మం వెళ్లి ‘అసమ్మతి’ నాయకులుగా ‘ప్రచారంలో’ ఉన్న టీఆర్ఎస్ నాయకులతో సమావేశం నడిపి సంచలనం సృష్టించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం హాట్ టాపిక్ కావడం సహజం. ఈ సన్నివేశం రాజకీయంగా చర్చకు దారి తీయడం అంతే సహజం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకలో టీఆర్ఎస్ గ్రూపు తగాదాలు బహిర్గతమైన కొద్దిరోజులకే జూపల్లి కృష్ణారావు సమావేశం జరపడం ఆసక్తిని కలిగించింది.
జూపల్లి కృష్ణారావు దమ్మపేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి రెండు గంటల పాటు ముచ్చటించారు. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, ‘అసంతృప్తి జీవులు’గా పేరుపొందిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు తదితరులు కూడా ఉన్నారు. కానీ ఈ సమావేశాలకు రాజకీయ ప్రాధాన్యం లేదని ‘అసమ్మతి’ నాయకులు ప్రకటించినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
దీంతో ‘ఆపరేషన్ అసమ్మతి’ని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. అందులో భాగంగానే ఇటీవల తన ఖమ్మం జిల్లా పర్యటనలోనూ అసంతృప్త నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండకపోయినా తనకు సరైన అవకాశాలు దక్కడంలేదనో, తనకు ప్రాధాన్యం లభించడం లేదనో, తనను గుర్తించడం లేదనో మాజీ ఎంపీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందువల్ల కేటీఆర్ తుమ్మల, పొంగులేటి సేవలు పార్టీకి అవసరమని, వారిని పార్టీ వదులుకోదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చారు.
ఖమ్మంలో బీజేపీకి స్వతహాగా బలం లేదు. నాయకత్వం, క్యాడర్ కొరత ఉంది. కనుక వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారి కోసం గాలం వేస్తున్నారు. తాను బీజేపీ, కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల్లోకి పోవడం లేదనో, అటువంటి ఆలోచన లేదనో పొంగులేటి స్పష్టం చేయకుండా టిఆర్ఎస్ పై ‘ఒత్తిడి’ చేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అందుకు భిన్నంగా తాను టీఆర్ఎస్ ను విడిచిపెట్టేది లేదని మాజీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పలు మార్లు కేసీఆర్, కేటీఆర్ పట్ల తన విధేయతను ప్రకటిస్తూ వస్తున్నారు. తుమ్మలకు తన రాజకీయ భవిష్యత్తు పట్ల స్పష్టత ఉంది. తాను రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్డ్ అవుదామనుకున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించి, మంత్రి పదవినిచ్చిన కృతజ్ఞతను తుమ్మల వివిధ సందర్భాల్లో వెల్లడిస్తూనే ఉన్నారు.
టీఆర్ఎస్ లో అసంతృప్త నాయకుల విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారినట్టు కనిపిస్తుంది. ఇదివరకు కనిపించని కొన్ని దృశ్యాలు తాజాగా ప్రత్యక్షమవుతున్నాయి. ‘పార్టీలో ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు లేదా ఇష్టంలేని వాళ్లు పోతే పోతారు’ అనే ధోరణిలో మార్పు వస్తోంది. పార్టీ నుంచి ఎవరినీ వెలుపలికి వెళ్లనివ్వకుండా నిలిపివేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. పార్టీ పాత పంథాను మార్చుకున్నట్లు కూడా కేటీఆర్ కార్యాచరణ ద్వారా అర్ధమవుతుంది. వివిధ కారణాలతో అసంతృప్తితో రగిలిపోతున్న పలువురు నాయకులను బుజ్జగించే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెత్తికెత్తుకున్నారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చినా, రాకపోయినా కాంగ్రెస్, బీజేపీ దూకుడుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసమ్మతి నాయకులెవరూ పార్టీ వీడకుండా ఉండేందుకు కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తాజా ఘటనలు నిదర్శనం. టీఆర్ఎస్ అసంతృప్త నాయకులతో మంతనాలు జరుపుతూ ఉన్నారు. అంతర్గత విభేదాలను చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లడం చర్చకు దారి తీసింది. కేటీఆర్ కొల్లాపూర్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ‘పాజిటివ్’ సంకేతాలు పంపించారు. 2018 లో కాంగ్రెస్ టికెట్‌పై కొల్లాపూర్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిన నాటి నుంచే కొల్లాపూర్ ప్రాంతంలో గట్టి పట్టు, ప్రజాదరణ, ఫాలోయింగ్ ఉన్న జూపల్లి కృష్ణారావుతో ఎమ్మెల్యేకు పొసగడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు జూపల్లి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారతారని, బీజేపీలో చేరుతారని కొద్ది రోజులు, కాంగ్రెస్ లో చేరతారని కొద్ది రోజులు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి వలె జూపల్లి కృష్ణారావు కూడా స్పష్టత ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.
2023 లో జరగనున్న ‘మూడో టర్మ్’ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం, ప్రతి ఓటు కేసీఆర్ కు ముఖ్యమే. కనుక టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో కొల్లాపూర్ పార్టీ పరిస్థితి, గ్రూప్ రాజకీయాలపై చర్చించారు. ఇదివరకు సీఎం కేసీఆర్ సభకు గైర్హాజరైన జూపల్లి జూన్ 18న కేటీఆర్ పర్యటనకు కూడా దూరంగా ఉన్నారు. అయితే కేటీఆర్ చొరవతీసుకొని జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. జూపల్లికి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డికి మధ్య విభేధాల నేపథ్యంలో జూపల్లి పార్టీని వీడకుండా నిలువరించేందుకు ప్రయత్నించారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం గడిచినా రెండు దశాబ్దాల్లో ఎంతో మంది నాయకులు పార్టీని వదలి వెళ్లిపోయినా బుజ్జగింపుల యత్నాలు జరగడం టిఆర్ఎస్ లో అరుదైన సన్నివేశాలు. కాగా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నాయకుల బలాబలాలపై ప్రశాంత్ కిషోర్ బృందం ఇచ్చిన సర్వే నివేదికల ఆధారంగా కేటీఆర్ తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పలు నియోజక వర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఇమేజ్ దెబ్బతిన్నదని, ప్రజాదరణ కోల్పోయారని పీ.కే. బృందం నివేదికలు ఇచ్చినందున తక్షణం కాయకల్ప చికిత్స జరపాలని కేటీఆర్ ను కేసీఆర్ పురమాయించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇతర జిల్లాల్లోని అసంతృప్త నాయకులనూ కేటీఆర్ కలుసుకునే అవకాశాలున్నాయి. ప్రజల్లో టిఆర్ఎస్ కార్యకర్తల్లో అభిమానం కోల్పోయిన ఎమ్మెల్యేల జాబితాలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పేరు కూడా ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం ఉంది. అలాగే అక్కడ జూపల్లి కృష్ణారావుపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతున్నట్టు కూడా ఆ వర్గాలంటున్నాయి.
కేటీఆర్ భేటీ తర్వాత జూపల్లి శాంతించినట్టు సమాచారం అందుతుంది. పార్టీ వీడాలన్న ఆలోచనలను తాత్కాలికంగా విరమించుకున్నారని జూపల్లి మద్దతుదారులు చెబుతున్నారు.