Telugu Global
National

‘ప్రవక్తను అవమానిస్తారా? కాబూల్ లో గురుద్వారాపై దాడికి మాదే బాధ్యత’..ఐసిస్

కాబూల్ లోని గురుద్వారాలో నిన్న జరిగిన దాడికి తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించుకుంది. ఓ భారతీయ రాజకీయ నేత మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగా ఈ దాడి చేశామని పేర్కొంది. ప్రవక్తను అవమానపరిచే విధంగా ఆ వ్యాఖ్యలున్నాయని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ అనే ఈ సంస్థ ఆరోపించింది. అబూ మహమ్మద్ అల్-తజికి ఈ దాడికి సూత్రధారి అని, ఈ ఎటాక్ సుమారు 3 గంటలపాటు సాగిందని ఈ సంస్థ నేడు ఓ ప్రకటనలో […]

Isis-Gurudwar-attack
X

కాబూల్ లోని గురుద్వారాలో నిన్న జరిగిన దాడికి తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించుకుంది. ఓ భారతీయ రాజకీయ నేత మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగా ఈ దాడి చేశామని పేర్కొంది. ప్రవక్తను అవమానపరిచే విధంగా ఆ వ్యాఖ్యలున్నాయని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ అనే ఈ సంస్థ ఆరోపించింది. అబూ మహమ్మద్ అల్-తజికి ఈ దాడికి సూత్రధారి అని, ఈ ఎటాక్ సుమారు 3 గంటలపాటు సాగిందని ఈ సంస్థ నేడు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో తాము సబ్ మెషిన్ గన్లను, చేతి బాంబులను, 4 ఐఈడీలను, ఓ కార్ బాంబును కూడా వాడామని, ఈ ఘటనలో దాదాపు 50 మంది హిందూ సిక్కులు, తాలిబన్ సభ్యులు మరణించారని వెల్లడించింది.

అయితే ఈ దాడిలో ఓ సిక్కు, ముస్లిం సెక్యూరిటీ గార్డు చనిపోయారని, ఏడుగురు గాయపడ్డారని వార్తలందాయి. నిన్నటి ఘటనలో కార్తె పర్వాన్ గురుద్వారా గేటు బయట ఒకసారి పేలుడు జరగగా..కొద్దిసేపటికే గురుద్వారా లోపల మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కొన్ని షాపులు తగులబడ్డాయి. ఏమైనా ఈ పేలుళ్ల ధాటికి పెద్దఎత్తున పొగలు కమ్ముకోగా కొద్దిసేపు భీకర వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. అయితే గురుద్వారా నుంచి పవిత్ర గురు గ్రంథ సాహిబ్ ని భద్రంగా బయటకు తీసుకురాగలిగారు.

ఆఫ్ఘ‌నిస్తాన్ లో సిక్కులతో పాటు మైనారిటీలను ఐసిస్ తన టార్గెట్లుగా చేసుకుంటోంది. గత ఏడాది అక్టోబరులో 15 నుంచి 20 మంది టెర్రరిస్టులు ఇదే గురుద్వారాలో చొరబడి గార్డులను కట్టివేసి భయోత్పాతం సృష్టించారు. 2020 మార్చిలో శ్రీ గురు హరి రాయ్ సాహిబ్ గురుద్వారాలో జరిగిన హింసాకాండలో 27 మంది సిక్కులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు.

కాబూల్ లోని గురుద్వారాలో తాజాగా జరిగిన దాడి నేపథ్యంలో ఆఫ్ఘన్ లోని 100 మందికిపైగా సిక్కులు, హిందువులకు ఈ-వీసాలను మంజూరు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గురుద్వారాలో టెర్రరిస్టులు, తాలిబన్ ఫైటర్లు కొన్ని గంటలపాటు కాల్పులకు తెగబడ్డారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిలో తాలిబన్ దళాలు ముగ్గురు దుండగులను కాల్చి చంపినట్టు తెలిసిందని పేర్కొంది. ఎటాక్ జరిగినప్పుడు సుమారు 30 మంది ఈ ప్రార్థనామందిరంలో ఉన్నారట. ఈ దాడిని ప్రధాని మోడీ ఖండిస్తూ.. గురుద్వారాలోని భక్తుల రక్షణ కోసం తాను ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇది టెర్రరిస్టుల పిరికి చర్య అని ఆయన పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఈ ఎటాక్ ని తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు.

First Published:  19 Jun 2022 2:49 AM GMT
Next Story