కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం ఉందా..?
”యుద్ధంలో ఎటువైపు ఉంటామో తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. యుద్ధంలో ఎటు వైపు ఉంటామో తేల్చుకోవడానికి యుద్ధం మన అనుభవం లోకి రావాలి” అని ఒక తత్వవేత్త అన్నాడు. ఎన్నికలు కూడా యుద్ధమే కనుక యుద్ధానికి బయలుదేరేముందే అసలు మన శత్రువు ఎవరో నిర్ధారించుకోవలసి ఉంది. శత్రువును నిర్ధారించుకోకుండా, అతని బలాబలాలను అంచనా వేయకుండా వెళితే ఓటమి ఎలాగూ తప్పదు. అంతకన్నా ఎక్కువగా పరాభవమూ తప్పదు. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో, ఎందుకు యుద్ధానికి దిగారో […]
”యుద్ధంలో ఎటువైపు ఉంటామో తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. యుద్ధంలో ఎటు వైపు ఉంటామో తేల్చుకోవడానికి యుద్ధం మన అనుభవం లోకి రావాలి” అని ఒక తత్వవేత్త అన్నాడు. ఎన్నికలు కూడా యుద్ధమే కనుక యుద్ధానికి బయలుదేరేముందే అసలు మన శత్రువు ఎవరో నిర్ధారించుకోవలసి ఉంది.
శత్రువును నిర్ధారించుకోకుండా, అతని బలాబలాలను అంచనా వేయకుండా వెళితే ఓటమి ఎలాగూ తప్పదు. అంతకన్నా ఎక్కువగా పరాభవమూ తప్పదు. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో, ఎందుకు యుద్ధానికి దిగారో స్పష్టత అవసరం. ఎవరు తెరచాటు మిత్రులో, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారో.. దాన్ని బట్టి కూడా ప్రజాభిప్రాయం మారవచ్చు.
తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం ఎవరు? కాంగ్రెస్ పార్టీయా లేదా బీజేపీనా అన్నది తేలడం లేదు. ఆ రెండు జాతీయ పార్టీల దగ్గర కేసీఆర్ కు ‘ప్రత్యామ్నాయ రోడ్ మ్యాప్’ లేదు. పోనీ ఇప్పుడు లేకపోయినా ఎన్నికల నాటికి అటువంటి రోడ్ మ్యాప్ ఒకటి తయారవ్వడం అనుమానమే! కేసీఆర్ కు ఇదే సానుకూల అంశం. ”ఈ రాష్ట్రాన్ని బాగుచేయడం ఎవరి తరం కాదు, కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.
కనుక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నాకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తే తిరస్కరిస్తా!” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి అన్నారు. వయోభారంతో.. రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనతో ఆయన ఈ మాటలని ఉంటే దాని చర్చ వేరు. కానీ తెలంగాణను బాగుచేయడం ఇక ఎవరి తరమూ కాదనడం వల్ల కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టడం అవసరమా! అనే ఆలోచనలో ప్రజలు పడిపోతున్నారు. జానారెడ్డి కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణను ‘మరమ్మతులు’ చేయజాలదు.
కాంగ్రెస్, బీజేపీ సహా షర్మిల పార్టీ, బహుజనసమాజ్ పార్టీ వంటి పార్టీలన్నింటికీ ఉమ్మడి శత్రువు కేసీఆర్.ఆయనను ఓడించడానికి 2018 లో ప్రజాకూటమి పేరిట జరిగిన ‘మహా ప్రయోగం’ ఎంత దారుణంగా విఫలమయ్యిందో అందరికీ తెలుసు. కనుక అలాంటి ప్రయోగాలు సాధ్యం కాదు. అలాంటి ప్రయోగాలు చేయాలనుకున్నా ఆ మేరకు భావసారూప్య రాజకీయ పక్షాలుగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక ‘అవశేషం’గా మారిపోయినందున ఆ పార్టీ గురించి చర్చ లేదు. ఇక మిగిలిన పార్టీలలో కాంగ్రెస్ తన సంప్రదాయ ఓట్లతో, పార్టీ క్యాడర్ తో, కిందిస్థాయి నాయకత్వంతో బలంగానే ఉంది.
బీజేపీకి కాంగ్రెస్‌లా పోలింగ్ బూత్ స్థాయిలో నిర్మాణం లేదు. బీజేపీకి ఈ పరిస్థితి ప్రతికూల అంశం. ప్రధాని మోడీ జనాకర్షణ, హిందుత్వ వాదంతో కాంగ్రెస్, టిఆర్ఎస్ లను బైపాస్ చేసి అధికారంలోకి రావాలనుకుంటుంది బీజేపీ. అలాగే బీజేపీకి కూడా కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో క్యాడర్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యకర్తలు ఉన్న మాట నిజమే! అయితే అధికార పార్టీని ఢీ కొనే సత్తా ఉన్న అభ్యర్థుల కొరత బీజేపీని వెంటాడుతున్నది.అభ్యర్థుల కొరత అనేది పెద్ద సమస్య కానే కాదని, ప్రజల్లోంచే సమర్థ నాయకులు పుట్టుకొస్తారన్నది బండి సంజయ్, ఈటల రాజేందర్ థియరీ!
కాగా, జాతీయ స్థాయిలో ఉన్నట్టుగా రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ‘కొత్త కుంపటి’ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నట్టు కొందరు నాయకులతో తన ఆలోచనలు పంచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమే. అయితే మరో ప్రాంతీయ పార్టీకి ‘స్కోప్’ చాలా తక్కువ. కనుక విశ్వేశ్వరరెడ్డి ఆలోచనలు ఆచరణలో వర్కవుట్ కావు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొనడానికి కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి.
‘పాజిటివ్ ఓటు’ రెండో టర్మ్ లో టీఆర్ఎస్ చుట్టూ’ వైఫై” లా ఉన్నందున అధికార పక్షానికి ఆశాజనకమైన ఫలితాలు లభించాయి. అయితే ఈ సారి 2023లో మూడో టర్మ్ లో ‘పాజిటివ్ ఓటు’ కేసీఆర్ కు అంతగా ఉండకపోవచ్చు. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఏర్పడడం సహజమే! కానీ ఆ ‘వ్యతిరేకత’ తీవ్రతపై రాజకీయ పరిశీలకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ సారి టీఆర్ఎస్ మూడో స్థానానికి వెళ్లిపోతుందంటూ కేసీఆర్ వ్యతిరేకులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. మొదటి, రెండవ స్థానాల్లోకి రానున్నది ఎవరో చెప్పడం లేదు.
వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలిచి హ్యాట్రిక్ సాధించగలమన్నది కేసీఆర్ ధీమా. అందుకు తగిన సానుకూల వాతావరణం కోసం టిఆర్ఎస్ అధ్యక్షుడు భారీ వ్యూహరచన చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తో తరచూ సమావేశాలు జరుగుతున్నాయి. సర్వేలపై వడపోత సాగుతోంది. మూడో టర్మ్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మాత్రమే ఓట్లు రాలకపోవచ్చు. సెంటిమెంటును మరలా ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అది ఏ రూపంలో ఉంటుందో తెలియదు. ఇప్పుడాయన జాతీయ రాజకీయరంగంపై తన ముద్ర వేసే పనిలో ఉన్నారు. ఒకటీ, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన రూపు రేఖలపై స్పష్టత రానుంది.
ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కేసీఆర్ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన, తిరుగులేని, ఎదురులేని నాయకుడు.పైగా అధికార పక్షంలో అంతర్గత కుమ్ములాటలు లేవు. అసంతృప్తి భగభగలు లేవు. ఎక్కడైనా అసమ్మతి చిన్నగా ‘తుంపర’ వలె మొదలయినా ఎప్పటికప్పుడు దాన్ని మొగ్గలోనే తుంచివేస్తున్నారు. పార్టీలో ఎవరు ఏమి చేస్తున్నారో, ఎవరు ఏమి మాట్లాడుతున్నారో కేసీఆర్ కు తెలుసు. ఆ మేరకు ఆయనకు అంతర్గత సమాచార వ్యవస్థ ఉంది.
ఇదిలా ఉండగా ‘ప్రతి పైసాలో ప్రజలకు వాటా దక్కాలి. పాలనలో ప్రజలకు భాగస్వామ్యం ఇవ్వాలి’ అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పలుమార్లు చెబుతూ వస్తున్నారు. ఆయన మాటలు ఆకర్షణీయంగా ఉండవచ్చు. బుద్ధిజీవులను తక్షణం ఆకట్టుకోవచ్చు. అయితే సాధారణ ఓటర్లను ‘కేసీఆర్ కు వ్యతిరేకంగా’నిర్మించడానికి ఇలాంటి ప్రసంగాలు పనికిరావు. అయితే కేసీఆర్ పాలనకు ప్రత్యామ్నాయ విధానాలతో కూడిన ‘బ్లూ ప్రింట్’ ప్రొఫెసర్ కోదండరాం దగ్గర కానీ, ప్రతిపక్క్షాల దగ్గర కానీ లేదు. కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా ఓడిపోయినా, ప్రజలు జనసమితిని ఎన్నికల పోరాటంలో ఆమోదించకపోయినా, ఆయన ఇంకా రాజకీయ విన్యాసాలు చేస్తూనే ఉన్నారు.
తన ఎజెండాలోనే లోపాలు, వ్యూహాత్మక తప్పిదాలు ఉన్నాయేమో ఈ ప్రొఫెసర్ సమీక్షించుకోవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరిఉంటే కోదండరాం ఇమేజ్ మరోవిధంగా ఉండేదేమో! ఇక రాహుల్ గాంధీ పాల్గొన్న వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు 2023 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో భాగంగా భావించవచ్చు.ఇలాంటి కసరత్తు బీజేపీలో జరగడం లేదు. ప్రధాని మోడీని, హిందుత్వ వాదాన్ని మాత్రమే బీజేపీ నమ్ముకోవడం ఇందుకు ప్రధాన కారణం. ఇంతకన్నా బీజేపీ దగ్గర ఆయుధాలేమీ లేవు.
“తెలంగాణలో పార్టీలు లేవు. కేసీఆర్ పక్షం, కేసీఆర్ వ్యతిరేక పక్షం.. రెండే ఉన్నాయి”అని పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టక ముందే రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఇందులో ఆయన రాజకీయ పరిణతి కనిపిస్తుంది. కేసీఆర్ వ్యతిరేక శిబిరంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కోదండరాం, షర్మిల, ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు. లెఫ్ట్ పార్టీల వైఖరి ఇంకా స్పష్టం కావలసి ఉంది.
అయితే కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది టీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొన్నినెలలుగా ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని హుజురాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ సహకరించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర మంత్రులు, నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీ సైద్ధాంతికంగా భిన్నధృవాలు అయినప్పటికీ కేసీఆర్ ను గద్దె దింపడానికి ఆ రెండు జాతీయ పార్టీల మధ్య రహస్య ‘ఒడంబడిక’ కుదిరే అవకాశాలపై కొన్ని విశ్లేషణలున్నాయి. అవి నిరాధారమే కావచ్చు కానీ ‘కేసీఆర్ ను ఓడించాలన్న’ ప్రాతిపదికను తోసిపుచ్చలేం.