కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. మేం జైలుకెళ్లం..
వాళ్లంతా పెరోల్ పై బయటకొచ్చిన ఖైదీలు. పెరోల్ కాలం పూర్తయింది. తిరిగి జైలుకి రావాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో సరెండర్ కావాలంటూ నోటీసులిచ్చింది. కానీ వారు ససేమిరా అంటున్నారు. దానికి వారు చెబుతున్న కారణం వింటే షాకవ్వాల్సిందే. అవును, ఏ కారణంతో తమకు పెరోల్ ఇచ్చారో, అదే కారణంతో ఇప్పుడు జైలుకెళ్లకుండా తప్పించుకోవాలనుకుంటున్నారు ఖైదీలు. దీనికోసం ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా కాలంలో.. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న దశలో.. దేశంలోని వివిధ […]
వాళ్లంతా పెరోల్ పై బయటకొచ్చిన ఖైదీలు. పెరోల్ కాలం పూర్తయింది. తిరిగి జైలుకి రావాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో సరెండర్ కావాలంటూ నోటీసులిచ్చింది. కానీ వారు ససేమిరా అంటున్నారు. దానికి వారు చెబుతున్న కారణం వింటే షాకవ్వాల్సిందే. అవును, ఏ కారణంతో తమకు పెరోల్ ఇచ్చారో, అదే కారణంతో ఇప్పుడు జైలుకెళ్లకుండా తప్పించుకోవాలనుకుంటున్నారు ఖైదీలు. దీనికోసం ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కరోనా కాలంలో..
కరోనా కేసులు ఉధృతంగా ఉన్న దశలో.. దేశంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విషయంలో సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో ఆలోచించింది. జైళ్లలో సరైన వైద్య సదుపాయం ఉండని పరిస్థితుల్లో ఖైదీలు, జైలు సిబ్బంది కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి పెరోల్ ఇవ్వాలని ఆదేశించింది. దీనికోసం హైపవర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం 2020 మే 8న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం హత్య కేసుల్లో దోషులుగా ఉన్న 49మంది ఖైదీలకు అత్యవసర పెరోల్ మంజూరైంది. ఇలా నాసిక్, ఔరంగాబాద్, అమరావతి, కొల్హాపూర్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలయ్యారు.
పెరోల్ టైమ్ పూర్తయింది. తిరిగి వారంతా జైలుకెళ్లాల్సిన టైమ్ వచ్చింది. అయితే ఇప్పుడు వారు మొండికేస్తున్నారు. మేం జైళ్లకు తిరిగి రాబోమని చెబుతున్నారు. కారణంగా కరోనా పరిస్థితుల్నే చూపెడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతోందని, అందుకే తాము జైలుకి తిరిగి వెళ్లలేమని చెబుతున్నారు. జైలుకి తిరిగి వెళ్తే తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు సమీపిస్తున్నందున, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలంటూ వారి తరపున లాయర్ కోరారు. ఖైదీల పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.