Telugu Global
National

అగ్నిపథ్ కేసుల్లో చిక్కుకుంటే పోలీస్ క్లియరెన్స్ ఉండదు.. ఎయిర్ చీఫ్ మార్షల్

అగ్నిపథ్ కేసుల్లో చిక్కుకున్న యువకులకు పోలీస్ క్లియరెన్స్ ఉండదని ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి హెచ్చరించారు. అంటే కేసుల్లో చిక్కినవారు సాయుధ దళాల్లో నియామకానికి అనర్హులని ఆయన పరోక్షంగా హెచ్చ‌రించారు. అసలు ఈ పథకంపై ఇంతటి నిరసన, యువకుల ఆగ్రహావేశాలను తాను ఊహించలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఇలా ఆందోళనలు చేస్తున్నారు.. కానీ రేపు వీళ్ళే ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలాంటి హింసాకాండను తాము ఖండిస్తున్నామని, ఇది […]

Air-Chief-Marshal-warn
X

అగ్నిపథ్ కేసుల్లో చిక్కుకున్న యువకులకు పోలీస్ క్లియరెన్స్ ఉండదని ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి హెచ్చరించారు. అంటే కేసుల్లో చిక్కినవారు సాయుధ దళాల్లో నియామకానికి అనర్హులని ఆయన పరోక్షంగా హెచ్చ‌రించారు. అసలు ఈ పథకంపై ఇంతటి నిరసన, యువకుల ఆగ్రహావేశాలను తాను ఊహించలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఇలా ఆందోళనలు చేస్తున్నారు.. కానీ రేపు వీళ్ళే ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలాంటి హింసాకాండను తాము ఖండిస్తున్నామని, ఇది అసలు పరిష్కారం కాదని చెప్పారు.

అభ్యర్థులకు సంబంధించి చివరి అంకం.. పోలీసు వెరిఫికేషన్ అని, అగ్నిపథ్ హింసాత్మక కేసుల్లో చిక్కుకున్నవారికి పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాదని చౌదరి పేర్కొన్నారు. అసలు ఈ పథకం చాలా మేలు చేసేదని, ఎవరికైనా దీనిపట్ల సందేహాలుంటే వారు దగ్గరలోని సైనిక కేంద్రాలు లేదా ఎయిర్ ఫోర్స్ లేక నేవీ సెంటర్లకు వెళ్లి వాటిని తీర్చుకోవచ్చని ఆయన సూచించారు.

వీరికి సరైన సమాచారం అందాల్సి ఉందని, ఈ పథకం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. అప్పుడే దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి సమగ్ర అవగాహన కలుగుతుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి స్పల్పకాలిక నియామకాల ప్రతిపాదన గత రెండేళ్లుగా ఆలోచనలో ఉందని, సాయుధ దళాల వయో పరిమితిని 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్లకు తగ్గించాలన్నదే దీని ఉద్దేశమని చౌదరి వివరించారు. నాలుగేళ్ల పాటు దేశానికి సేవ చేసిన వారు ఎంతో మోటివేషన్ తో వెళ్తారు.. క్రమశిక్షణ విలువలు, నైతికతను అలవరచుకుంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్మీ లేదా నేవీ లేక ఎయిర్ ఫోర్స్ లో చేరదలచిన వారి భయాలను, ఆందోళనను పోగొట్టేందుకు ప్రభుత్వం, రక్షణ శాఖలు ఎంతో ప్రయత్నిస్తున్నాయని ఆయన తెలిపారు.

ముఖ్యంగా వారి భవిష్యత్తుకు సంబంధించిన అభద్రతాభావం తొలగవలసి ఉందని చౌదరి అన్నారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే అవకాశాలు లేవని, అయితే అమలయ్యాక ఇందులో ఏవైనా మార్పులు చేయాలా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. దీన్నిపూర్తిగా అమలు చేయాలా లేక మరింత మెరుగుపరచాలా అన్నదాన్ని సమీక్షించాల్సిన అవసరం కలుగుతుందేమో చూడాలని ఆయన పేర్కొన్నారు.

అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టే ఎంపిక, నియామకాల ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభమవుతుందని ఈ సంస్థ తెలిపింది. ఈ ఏడాదికిగానూ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఈ నూతన విధానం కింద ఎక్కువ మంది యువకులకు మంచి అవకాశం లభిస్తుందని చౌదరి చెప్పారు.

First Published:  18 Jun 2022 11:03 AM IST
Next Story