Telugu Global
NEWS

సుబ్బారావు, వసీంలపై అనుమానం.. సుబ్బారావు అరెస్ట్‌

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై యువకుల దాడికి వెనుక ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల ప్రమేయంపై పోలీసులు ఒక అంచ‌నాకు వచ్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. యువకులు సంఘటితం కావడానికి అతడే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. యువకులను రెచ్చగొట్టేలా ఆవుల సుబ్బారావు కొన్ని వీడియోలలో ప్రసంగించారు. వాటిని పోలీసులు గుర్తించారు. సుబ్బారావుతో పాటు కరీంనగర్‌కు చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు […]

subba-rao-sec-railway-station-incident
X

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై యువకుల దాడికి వెనుక ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల ప్రమేయంపై పోలీసులు ఒక అంచ‌నాకు వచ్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. యువకులు సంఘటితం కావడానికి అతడే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

యువకులను రెచ్చగొట్టేలా ఆవుల సుబ్బారావు కొన్ని వీడియోలలో ప్రసంగించారు. వాటిని పోలీసులు గుర్తించారు. సుబ్బారావుతో పాటు కరీంనగర్‌కు చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్నిపథ్ వల్ల మీకు ఉద్యోగాలు రావు, ఇలాగైతే మీ పని అంతే అంటూ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టనట్టు వాట్సాప్ ఆధారాలను పోలీసులు గుర్తించారు.

ఆవులు సుబ్బారావు స్వయంగా హైదరాబాద్ చేరుకున్నట్టు వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టులు ఉన్నాయి. మిగిలిన అకాడమీల డైరెక్టర్లు కూడా వచ్చి ఆవుల సుబ్బారావుకు మద్దతు తెలిపాలని వాట్సాప్‌ గ్రూపుల్లో విజ్ఞప్తి చేశారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్‌, 17/6 పేరుతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.

ఈనేపథ్యంలో ఖమ్మంలో ఉన్న ఆవుల సుబ్బారావును గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దర్యాప్తులో రైల్వే పోలీసులకు సహకరించే క్రమంలోనే సుబ్బారావును నరసరావుపేట పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు చెబుతున్నారు. విధ్వంసం సమయంలో వీడియోల ఆధారంగా 30 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిలో 12 మంది నేరుగా పెట్రోల్ పోయడం, నిప్పు పెట్టడం వంటి చర్యలకు పాల్పడినట్టు గుర్తించారు.

వాట్సాప్‌ గ్రూపులో ఒక్క ఆడియో మేసేజ్‌పై పోలీసులు దృష్టిపెట్టారు. “అరేయ్‌ పెట్రోల్ తీసుకురానికి.. పెట్రోల్ బంక్‌ పోతున్నా. ఎవరైనా వస్తే రండి. ఎంతసేపు ఒర్లుతార్రా.. ఒర్లి ఒర్లి నోర్లు నొస్తయి. అందుకే గమ్మున పోయి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టేశామనుకో.. బయటకు పోతది న్యూస్. అంతేగానీ ఎంతసేపు ఒర్లినా, బ్యానర్లు చూపించినా, ఎంత మెత్తుకున్నా ఏమీ కాదు. గంట, రెండు గంటల్లో స్వాడ్‌ వస్తుంది. అందుకే పెట్రోల్ బంక్‌ పోయి పెట్రోల్‌ తెస్తే మొత్తం తగలబెట్టొచ్చు రెండు నిమిషాల్లా“’. అంటూ ఒక వ్యక్తి పిలుపునిచ్చిన ఆడియో వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్ అయింది. ఈ ఆడియోను షేర్‌ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వందల మందిని వాటిలో చేర్చి అందరూ సికింద్రాబాద్ వచ్చేలా, వచ్చిన వారికి వాటర్ బాటిళ్లు, మజ్జిగ, ఆహారం, బసను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ సెంటర్లే ఏర్పాటు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

First Published:  18 Jun 2022 6:25 AM IST
Next Story