Telugu Global
National

రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపులు.. అగ్నివీరులకు మరిన్ని రాయితీలు

అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తలెత్తిన ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలు, నిరసనలతో కేంద్రం దిగివస్తున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితిని ఎలాగైనా చల్లార్చి యువతను దారిలోకి తెచ్చుకునేందుకు పలు రాయితీలు ప్రకటించింది. అగ్నివీరులకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లోను, అస్సాం రైఫిల్స్ లోను 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. పైగా రెండు పారామిలిటరీ దళాల్లో వీరికి నిర్దేశిత వయోపరిమితి కన్నా మించి మూడేళ్ళ వయో సడలింపులు ఉంటాయని స్పష్టం చేసింది. […]

Capture
X

అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తలెత్తిన ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలు, నిరసనలతో కేంద్రం దిగివస్తున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితిని ఎలాగైనా చల్లార్చి యువతను దారిలోకి తెచ్చుకునేందుకు పలు రాయితీలు ప్రకటించింది. అగ్నివీరులకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లోను, అస్సాం రైఫిల్స్ లోను 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. పైగా రెండు పారామిలిటరీ దళాల్లో వీరికి నిర్దేశిత వయోపరిమితి కన్నా మించి మూడేళ్ళ వయో సడలింపులు ఉంటాయని స్పష్టం చేసింది. మొట్టమొదటి అగ్నివీరుల బ్యాచ్ కి అయిదేళ్ల సడలింపులు కల్పిస్తున్నట్టు పేర్కొంది.

మొదట 21 ఏళ్ళ పరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్టు ఇదివరకే ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మరికొంత వెసులుబాటునిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లో అగ్నివీరుల నియామకానికి ప్రాధాన్యతనిస్తామని హోం మంత్రి అమిత్ షా ఆల్రెడీ ప్రకటించారు. ప్రస్తుతం పారామిలిటరీ దళాల్లోని 5 విభాగాల్లో 73 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, శాస్త్ర సీమా బల్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఇన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లోను, అస్సాం రైఫిల్స్ లోను 73,219 పోస్టులు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు శాఖల్లో 18,124 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వివరించింది. హోం శాఖ కిందగల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లో అత్యధిక సంఖ్యలో జవాన్లు ఉన్నారు.

నేడు త్రివిధ దళాధిపతులతో రాజ్ నాథ్ సింగ్ భేటీ

అగ్నిపథ్ పథకంపై పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం త్రివిధ దళాధిపతులతో సమావేశమవుతున్నారు. ఈ పథకానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించనున్నారు. తెలంగాణ, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో సహా మరికొన్ని చోట్ల ఆర్మీ అభ్యర్థులు రైళ్లకు, బస్సులకు నిప్పు, పోలీసులపై రాళ్ల దాడులు వంటి ఘటనలకు పాల్పడ్డారు.

అగ్నిపథ్ స్కీంని ప్రకటించినప్పటి నుంచి ఈ నిరసనల కారణంగా రైల్వే శాఖ 234 రైళ్లను రద్దు చేసింది. రైల్వే, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. దాదాపు 340 రైళ్లు ఆందోళనకారుల దాడులకు గురయ్యాయి. ఈ పథకాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు, స్వయంగా బీజేపీలోనే కొన్ని వర్గాలు తప్పు పట్టాయి. అయితే బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటివారు ఇది యువతకు మేలు చేసేదేనని, వారి భవిష్యత్తుకు ముప్పు ఉండదని ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా ఈ పథకంలో మరికొన్ని మార్పులు చేస్తూ దీన్ని కేంద్రం ప్రకటించడం విశేషం.

First Published:  18 Jun 2022 6:04 AM IST
Next Story