Telugu Global
National

ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ ఈవీ కార్.. ఒక్క చార్జింగ్‌తో 1000 కిలోమీటర్లు

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికి తోడు వాయు కాలుష్యం కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వెహికిల్స్ (ఈవీ) వల్ల వాయు కాలుష్యమే కాకుండా శబ్దకాలుష్యం తగ్గిపోతుండటం.. ఇంధనానికి చేయాల్సిన ఖర్చు కూడా లేక‌పోవ‌డంతో అనేక మంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఒక వేళ అకస్మాతుగా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగిపోతే పరిస్థితి ఏంటి? వినియోగదారుడు వాటిని భరించగలడా? విద్యుత్ […]

Lightyear-launch-world’s-first-solar-eV-car
X

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికి తోడు వాయు కాలుష్యం కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వెహికిల్స్ (ఈవీ) వల్ల వాయు కాలుష్యమే కాకుండా శబ్దకాలుష్యం తగ్గిపోతుండటం.. ఇంధనానికి చేయాల్సిన ఖర్చు కూడా లేక‌పోవ‌డంతో అనేక మంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఒక వేళ అకస్మాతుగా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగిపోతే పరిస్థితి ఏంటి? వినియోగదారుడు వాటిని భరించగలడా? విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో, చార్జింగ్ ఫెసిలిటీ లేని ప్రదేశాలకు ఈ వాహనాలను నడిపించుకొని పోగలమా అని అందరిలో అనేక సందేహాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇంజనీర్లకు సోలార్ ఎలక్ట్రానిక్ వెహికిల్ ఆలోచన వచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని దేశాల్లో ఈ వాహనాలు నడుస్తున్నాయి. అయితే కమర్షియల్‌గా ఎప్పుడు విడుదల అవుతాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌కు చెందిన ఈవీ స్టార్టప్ ‘లైట్ ఇయర్’ అనే సంస్థ శుభవార్త చెప్పింది. ఈ ఏడాదిలోనే ఈవీలను వినియోగిస్తున్న వారికి ఉపశమనం లభించేలా ఒక వెహికిల్ విడుదల చేస్తున్నట్లు చెప్పింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ కారును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

ఇది సాదాసీదా కారులాగా ఉండబోదని.. అన్ని కార్లలాగే అద్భుతమైన ఫీచర్లన్నీ కలిగి ఉంటుందని సదరు సంస్థ పేర్కొంది. ‘లైట్ ఇయర్ జీరో’ అనే బ్రాండ్ నేమ్‌తో వస్తోన్న ఈ కారు పవర్ ట్రెయిన్ సోలార్, ఎలక్ట్రిక్ పవర్ టెక్నాలజీని ఉపయోగించి పరుగెడుతుందని వివరించారు. ఈ కారు రెండు రకాలైన విద్యుత్‌ సోర్స్‌లను వాడుకోవడం వల్ల.. ఒకసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుందని కంపెనీ చెప్తోంది.

ఈవీ కార్లను ప్రతీ నిత్యం చార్జింగ్ పెడుతుండాలి. లేకపోతే బ్యాటరీలు పనికిరాకుండా పోతాయి. అయితే ఈ కారును ఏడు నెలల పాటు చార్జింగ్ పెట్టకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ఆరు బయట వదిలేసినా.. నిరంతరం దానికి కనీసం చార్జింగ్ అవుతుంది కాబట్టి బ్యాటరీలు పాడయ్యే అవకాశమే లేదు. అసలు ఎండే లేని ప్రాంతాల్లో 70 కిలోమీటర్ల వరకు ఈ కారు నడుస్తుంది. ఆ తర్వాత ఈవీల మాదిరి డైరెక్ట్ చార్జింగ్ పెట్టుకోవాల్సిందే. అయితే ఎండ ఉన్న సమయంలో మాత్రం ఎన్ని కిలోమీటర్లు అయినా ప్రయాణించే వీలుంటుంది.

ప్రస్తుతానికి ఈ కారు యూరోప్ మార్కెట్లోకి మాత్రమే అందుబాటులోకి తీసుకొని రానున్నారు. ఇన్ని ఫీచర్లున్న ఈ కారు ధర కూడా కాస్త ఎక్కువే. ఇండియన్ కరెన్సీలో రూ. 2.05 కోట్లుగా నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్‌లో తొలి సోలార్ కార్లు యూరోప్ మార్కెట్లో విడుదల కానున్నాయి. తొలి బ్యాచ్‌లో కేవలం 950 కార్లను మాత్రమే విడుదల చేయనున్నారు.

First Published:  18 Jun 2022 10:12 AM IST
Next Story