Telugu Global
NEWS

‘సికిందరాబాద్ లో హింసకు రైల్వే పోలీసులే కారణం’

సికిందరాబాద్ స్టేషన్ లో విధ్వంసానికి రైల్వే పోలీసులే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. అగ్నిపథ్ పథకం తమ జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపిస్తున్న ఆందోళన కారులు తమకు రెండేళ్ళ క్రితమే ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టులు నిర్వహించారని రెండేళ్ళుగా రాత పరీక్షలకోసం ఎదిరిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాము ఒక గంటపాటు రైల్వే స్టేషన్ లో నిరసన తెలపడానికి వచ్చామని అయితే శాంతియుత నిరసన తెలుపుతున్న తమపై రైల్వే పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. […]

సికిందరాబాద్
X

సికిందరాబాద్ స్టేషన్ లో విధ్వంసానికి రైల్వే పోలీసులే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. అగ్నిపథ్ పథకం తమ జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపిస్తున్న ఆందోళన కారులు తమకు రెండేళ్ళ క్రితమే ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టులు నిర్వహించారని రెండేళ్ళుగా రాత పరీక్షలకోసం ఎదిరిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తాము ఒక గంటపాటు రైల్వే స్టేషన్ లో నిరసన తెలపడానికి వచ్చామని అయితే శాంతియుత నిరసన తెలుపుతున్న తమపై రైల్వే పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్నవారిని రైల్వే పోలీసులు తరిమి తరిమి కొట్టడంతో ఎదురుతిరగాల్సి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. అప్పటికే పోలీసులతో దెబ్బలు తిని ఆవేశంగా ఉన్న ఆందోళనకారులకు తోడు మరిన్ని వందల మంది వచ్చిచేరడంతో ఆగ్రహ‍ం కట్టలు తెంచుకుని హింసాత్మక రూపం తీసుకుందని నిరసనకారులు అంటున్నారు.

తమ శాంతియుత నిరసనను రైల్వే పోలీసులు అడ్డుకొని తమపై లాఠీచార్జ్ చేయక పోతే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేదే కాదని వారంటున్నారు.

అయితే ఈ రోజు నిరసన ప్రదర్శన జరపడానికి ఆర్మీ అభ్యర్థులందరూ మూడురోజులుగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాట్సప్ ల ద్వారా ఒకరికొకరు సందేశాలు ఇచ్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆందోళనకారుల ఫోన్లపై కేంద్ర ఇంటలీజన్స్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.

First Published:  17 Jun 2022 10:22 AM IST
Next Story