మంత్రిగా, క్రికెటర్ గా మనోజ్ తివారీ అరుదైన ఘనత
దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్రప్రభుత్వానికి క్రీడామంత్రిత్వశాఖలు, వాటికి ప్రత్యేకంగా మంత్రులు ఉండటం మనకు తెలుసు. క్రీడామంత్రులంతా క్రీడాకారులై ఉండాలన్న రూలేమీలేదు. పైగా వారికి క్రీడల గురించి కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం కూడాలేదని దేశంలోని చాలామంది క్రీడామంత్రులను చూస్తేనే తెలుస్తుంది. అయితే.. క్రీడామంత్రి అంటే ఎలా ఉండాలి?..క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా యువతకు ఎలా ఆదర్శంగా ఉండవచ్చనో..బెంగాల్ క్రికెటర్ కమ్ క్రీడామంత్రి మనోజ్ తివారీ చాటి చెప్పాడు. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వంలో క్రీడామంత్రిగా […]
దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్రప్రభుత్వానికి క్రీడామంత్రిత్వశాఖలు, వాటికి ప్రత్యేకంగా మంత్రులు ఉండటం మనకు తెలుసు. క్రీడామంత్రులంతా క్రీడాకారులై ఉండాలన్న రూలేమీలేదు. పైగా వారికి క్రీడల గురించి కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం కూడాలేదని దేశంలోని చాలామంది క్రీడామంత్రులను చూస్తేనే తెలుస్తుంది. అయితే.. క్రీడామంత్రి అంటే ఎలా ఉండాలి?..క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా యువతకు ఎలా ఆదర్శంగా ఉండవచ్చనో..బెంగాల్ క్రికెటర్ కమ్ క్రీడామంత్రి మనోజ్ తివారీ చాటి చెప్పాడు. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వంలో క్రీడామంత్రిగా ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తన రాష్ట్ర రంజీట్రోఫీ జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉంటూ..శతకాలు బాదుతూ..క్రీడామంత్రి అంటే మనోజ్ తివారీ మాత్రమే అనుకొనేలా చేశాడు.
వారేవ్వా! మనోజ్ తివారీ
క్రికెట్,పాలిటిక్స్.. ఒకదానికొకటి పొంతనలేని రంగాలు. అయితే కాలం మారింది. క్రికెటర్లు రాజకీయనాయకులుగా రాణించడం సంగతి అటుంచి..రాజకీయనాయకులు , వారి వారసులు మాత్రం క్రికెట్ వ్యవహారాలలో దూరిపోయి మరీ చక్రం తిప్పేస్తున్నారు. భారత్ , పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్( కరీబియన్ ద్వీపాలు ), జింబాబ్వే, దక్షిణాఫ్రికా..ఇలా ఏ దేశాన్ని చూసినా క్రికెటర్లు తమ రిటైర్మెంట్ తరువాత రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినవారే. అయితే.. ఇటు మంత్రులగాను..అటు క్రికెటర్లుగాను జమిలిగా విధులు నిర్వర్తిస్తూ రాణించినవారిలో..బంగ్లాదేశ్ మాజీ ఫాస్ట్ బౌలర్ ముషరఫే మొర్తాజా, భారత్ కమ్ బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రమే ప్రముఖంగా కనిపిస్తారు.
అప్పుడు మొర్తాజా.. ఇప్పుడు మనోజ్ తివారీ..
బంగ్లాదేశ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్, మాజీ కెప్టెన్ ముషరఫే మొర్తాజా..జాతీయ అవామీలీగ్ పార్టీ అభ్యర్థిగా జాతీయ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు..ఎంపీగా ఉంటూనే బంగ్లాదేశ్ జాతీయజట్టులో సభ్యుడిగా కొనసాగడం ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగాడు. మరోవైపు..బంగ్లాదేశ్ కు సరిహద్దు రాష్ట్ర్రంగా ఉన్న బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ శాసనసభకు ఎన్నికయ్యాడు. శాసనసభ్యుడిగా మాత్రమే కాదు..బెంగాల్ క్రీడాశాఖమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. అయినా..క్రికెటర్ గా తన కెరియర్ కొనసాగించాలని నిర్ణయించాడు. 2021-22 రంజీ సీజన్లో బెంగాల్ జట్టులో చోటు సంపాదించడమే కాదు..క్వార్టర్ ఫైనల్లో సెంచరీ సాధించడం ద్వారా తనజట్టు సెమీఫైనల్స్ చేరడంలో తనవంతుపాత్ర నిర్వర్తించాడు. సెమీఫైనల్లో సైతం మధ్యప్రదేశ్ తో జరిగిన సమరంలో మరో శతకంతో జట్టును ఆదుకొన్నాడు.
మంత్రిగా, క్రికెటర్ గా మనోజ్ అరుదైన రికార్డు..
దశాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్ లో ఓ రాష్ట్ర్రప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ..ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శతకం బాదిన, వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా మనోజ్ తివారీ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. జార్ఖండ్ తో ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మనోజ్ తివారి సూపర్ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారి తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. మొత్తం 152 బంతులు ఎదుర్కొని 14 బౌండ్రీలు, ఒక సిక్సర్‌తో శతకం పూర్తి చేశాడు. మొత్తంమీద మనోజ్ తివారి 185 బంతుల్లో 19 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 136 పరుగులు సాధించాడు.
సెమీఫైనల్లోనూ అదేజోరు..
ఫైనల్లో చోటు కోసం మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సైతం మనోజ్ తివారీ సెంచరీతో తనజట్టు పరువు దక్కించాడు. ఒక దశలో 197 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన బెంగాల్ ను సీనియర్ ఆటగాడు, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (211 బంతుల్లో 12 ఫోర్లతో 102), బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (209 బంతుల్లో 12 ఫోర్లతో 116) శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చి బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే ఒకరి వెనుక ఒకరుగా ఇద్దరూ అవుట్ కావడంతో కీలక తొలి ఇన్నింగ్స్ సాధించకుండానే బెంగాల్ ఆలౌటయ్యింది. మనోజ్ తివారీకి భారత్ తరపున 12 వన్డేలు, 3 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ పంజాబ్ జట్ల తరపున 40 మ్యాచ్ లు ఆడి 856 పరుగులు సాధించిన రికార్డు ఉంది.
బెంగాల్ కు మరోసారి రంజీట్రోఫీ అందించడమే తన లక్ష్యమని ప్రకటించిన 35 సంవత్సరాల మనోజ్ తివారీ కల నెరవేరుతుందో ..లేదో మరి.!