రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినికి దక్కని ఊరట
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులు నళిని శ్రీహరన్, రవిచంద్రన్ లకు మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట లభించలేదు. తమను విడుదల చేయాలంటూ వీరు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం లేకుండానే తమను రిలీజ్ చేయాలన్న వీరి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదే కేసులో నిందితుడైన ఏ.జీ. పెరరివాలన్ ని సుప్రీంకోర్టు జైలు నుంచి గత మే 18 న విడుదల చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణం కింద తనకు గల ప్రత్యేకాధికారాలను […]
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులు నళిని శ్రీహరన్, రవిచంద్రన్ లకు మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట లభించలేదు. తమను విడుదల చేయాలంటూ వీరు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం లేకుండానే తమను రిలీజ్ చేయాలన్న వీరి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదే కేసులో నిందితుడైన ఏ.జీ. పెరరివాలన్ ని సుప్రీంకోర్టు జైలు నుంచి గత మే 18 న విడుదల చేసింది.
రాజ్యాంగంలోని 142 అధికరణం కింద తనకు గల ప్రత్యేకాధికారాలను ఉపయోగించి అత్యున్నత న్యాయస్థానం ఆయనను రిలీజ్ చేసింది. అలాగే ఈ అధికరణం కింద తమను కూడా జైలు నుంచి విడుదల చేయాలని నళిని, రవిచంద్రన్ ..కోర్టును కోరారు. కానీ తమకు సంబంధించి రాజ్యాంగంలోని 226 ఆర్టికల్ కింద ఆ విధమైన అధికారాలు లేవని చీఫ్ జస్టిస్ ఎం.ఎన్. భరోచీ, జస్టిస్ ఎన్. మాలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. వీరి పిటిషన్లను శుక్రవారం డిస్మిస్ చేసింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు నిందితులను ముందుగానే విడుదల చేయాలని ఇదివరకటి అన్నా డీఎంకే కేబినెట్ 2018 సెప్టెంబరులో అప్పటి గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కి సిఫారసు చేసింది. అయితే గవర్నర్ నుంచి సమాధానం లేకపోవడంతో నిందితులు.. తమను రిలీజ్ చేయాలనీ గవర్నర్ ను ఆదేశించవలసిందిగా కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కానీ హైకోర్టు వాటిని తోసిపుచ్చింది. ఆ తరువాత పెరారివాలన్ ని సుప్రీంకోర్టు విడుదల చేయడం తెలిసిందే, ప్రస్తుతం మురుగన్, శాంతన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, నళిని జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
మూడు దశాబ్దాల న్యాయపోరాటం తరువాత పెరారివలన్.. విడుదలయ్యాడు. తన కొడుకు రిలీజ్ కోసం ఆయన తల్లి అర్పుతం కూడా ఎడతెగని లీగల్ ఫైట్ చేసింది. ఇప్పుడు తమను కూడా విడుదల చేయాలన్న నళిని, రవిచంద్రన్ లకు కోర్టు నుంచి ఊరట లభించకపోవడంతో వారు మళ్ళీ జైలుపాలయ్యారు. కాగా పెరారివలన్ విడుదల నేపథ్యంలో మీ పిటిషన్ కూడా దానిపై ఆధారపడి ఉంటే మీరు సుప్రీంకోర్టుకెక్కవచ్చునని మద్రాస్ హైకోర్టు వీరికి స్పష్టం చేసింది.