Telugu Global
National

స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయ నిధులు

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు సంచీల కొద్దీ పెరుగుతూ మూలుగుతున్నాయి. 2020 నాటికి ఈ బ్యాంకుల్లో 20 వేల 700 కోట్ల సొమ్ము ఉండగా వరుసగా రెండో ఏడాది కూడా ‘వృద్ది’ అయ్యాయి. 2021 లో ఇవి 30 వేల 500 కోట్ల రూపాయలకు పెరిగాయట. ఇది ఒక్క సంవత్సరంలోనే 14 శాతం అధికమని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ నిధుల్లో బడా బాబులకు, సంస్ధలకు చెందిన సొమ్ము ఉన్నట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ డేటా వెల్లడించింది. […]

Swiss-bank-Indian-Funds
X

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు సంచీల కొద్దీ పెరుగుతూ మూలుగుతున్నాయి. 2020 నాటికి ఈ బ్యాంకుల్లో 20 వేల 700 కోట్ల సొమ్ము ఉండగా వరుసగా రెండో ఏడాది కూడా ‘వృద్ది’ అయ్యాయి. 2021 లో ఇవి 30 వేల 500 కోట్ల రూపాయలకు పెరిగాయట. ఇది ఒక్క సంవత్సరంలోనే 14 శాతం అధికమని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ నిధుల్లో బడా బాబులకు, సంస్ధలకు చెందిన సొమ్ము ఉన్నట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ డేటా వెల్లడించింది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు సెక్యూరిటీల ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో పెడుతున్న డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయట. అలాగే కస్టమర్ డిపాజిట్లు సైతం కొండెక్కి కూచున్నాయని ఈ డేటా గురువారం వెల్లడించింది. 2006 లో భారతీయ నిధులు స్విస్ ఫ్రాంకుల లెక్కల ప్రకారం దాదాపు 6.5 బిలియన్ ఫ్రాంకులు కాగా ఆ తరువాత హెచ్చు తగ్గులతో స్విస్ బ్యాంకుల్లో కాస్త ‘మాంద్యం’ లాంటి పరిస్థితి ఏర్పడింది.

2011, 2013, 2017, సంవత్సరాల్లో ఈ నిధులు తగ్గినట్టు డేటా పేర్కొంది. కానీ మళ్ళీ 2020 నుంచి కుబేరులు దాచుకున్న సొమ్ము పెరుగుతూ వచ్చింది. 2019 లో ఓ మాదిరిగా ఉన్నప్పటికీ ఆ తరువాత నుంచి కస్టమర్ డిపాజిట్లతో బాటు అన్ని కేటగిరీల్లో డబ్బులు కోట్లకొద్దీ జమ అవుతూ వచ్చాయి. కొంతమంది ఇండియన్లు, ఎన్నారైలు ఇతరులు మూడో దేశ ‘ఎంటిటీ’తో దాచుకున్న సొమ్ములు ఇందులో లేవని, ప్రస్తుతమున్న నిధులే ఇంతమేరకు ఉన్నాయని స్విట్జర్లాండ్ లోని ఈ బ్యాంకు వర్గాలు తెలిపాయి. అయితే భారతీయులు దాచుకున్న ఈ సొమ్మంతా బ్లాక్ మనీగా పరిగణించజాలమని, పన్నుల ఎగవేత, ఫ్రాడ్ వంటివాటిపై భారత ప్రభుత్వం జరుపుతున్న పోరాటానికి తాము మద్దతునిస్తామని స్విస్ బ్యాంకులు హామీ ఇచ్చాయి. 2018 నుంచి స్విట్జర్లాండ్, ఇండియా మధ్య ఆదాయపు పన్ను వంటి విషయాల్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలు ఉన్నాయి. దీనికింద ఆ ఏడాది నుంచి భారతీయుల సొమ్ము తాలూకు వివరాలను మొదటిసారిగా 2019 లో భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలియజేస్తూ వచ్చారు. ఇది ప్రతి సంవత్సరం అమలవుతోంది. ఇలాగే ఆర్ధిక సంబంధమైన అంశాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలను సమర్పించిన అనంతరం సంబంధిత భారతీయుల అకౌంట్ల తాలూకు వివరాలను స్విట్జర్లాండ్ .. భారత ప్రభుత్వంతో షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి వందల కేసులకు సంబంధించి సమాచారాన్ని ఉభయ దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి.

ఏమైనా.. స్విస్ బ్యాంకుల్లో ఫారిన్ క్లయింట్ మనీ విషయానికి వచ్చేసరికి బ్రిటన్ టాప్ ప్లేస్ లో ఉండగా అమెరికా, వెస్ట్ ఇండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, హాంకాంగ్, లుక్సెంబర్గ్, బహమాస్, నెదర్లాండ్స్, సైప్రస్, కే మెన్ దీవులు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండియా 44 వ స్థానంలో ఉన్నట్టు ఈ డేటా స్పష్టం చేసింది. బ్రిక్స్ దేశాల విషయానికి వచ్చేసరికి ఇండియా… రష్యా, చైనా దేశాల కన్నా దిగువ స్థాయికి, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలతో పోలిస్తే ఎగువ స్థాయికి ఉన్నట్టు తేలింది. భారతీయుల నల్ల డబ్బు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎప్పటికప్పుడు స్విస్ ప్రభుత్వం నుంచి వివరాలను సేకరిస్తోంది. కానీ ఇలా ఎన్నారైలు, మనవాళ్ళు బ్లాక్ మనీ దాచుకున్నట్టు చెబుతున్న దాఖలాలు ఈ డేటాలో లేవని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొంది.

First Published:  17 Jun 2022 4:32 AM IST
Next Story