Telugu Global
National

అగ్నిపథ్ పై ఫ్యాక్ట్ షీట్.. ‘అగ్నివీరులూ ! తాయిలాలున్నాయి’ !

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వెల్లువెత్తిన నిరసనలు, యువకుల ఆందోళనతో కదిలిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. రాత్రికి రాత్రే ఫ్యాక్ట్ షీట్ రూపొందించింది. ఈ స్కీం పట్ల ప్రజలకు, యువతకు ఉన్నవన్నీ అపోహలేనని, అయినా వారి నిరసనలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త మార్గదర్శకాలు, ‘బుజ్జగింపు’ చర్యలతో ముందుకు వస్తున్నామని ప్రకటించింది. ముఖ్యంగా సైన్యంలో నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 21 ఏళ్ళ నుంచి 23 ఏళ్లకు పెంచింది. గత రెండేళ్లలో సాయుధ దళాల్లో […]

agnipath-scheme-has-its-reasons-and-
X

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వెల్లువెత్తిన నిరసనలు, యువకుల ఆందోళనతో కదిలిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. రాత్రికి రాత్రే ఫ్యాక్ట్ షీట్ రూపొందించింది. ఈ స్కీం పట్ల ప్రజలకు, యువతకు ఉన్నవన్నీ అపోహలేనని, అయినా వారి నిరసనలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త మార్గదర్శకాలు, ‘బుజ్జగింపు’ చర్యలతో ముందుకు వస్తున్నామని ప్రకటించింది. ముఖ్యంగా సైన్యంలో నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 21 ఏళ్ళ నుంచి 23 ఏళ్లకు పెంచింది.

గత రెండేళ్లలో సాయుధ దళాల్లో నియామకాలు చేపట్టని విషయం నిజమేనని, అయితే ఈ ఒక్కసారి వయోపరిమితికి సంబంధించి నిబంధనను మాఫీ చేస్తూ దీన్ని 23 ఏళ్లకు పెంచుతున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం వల్ల తమ భవిష్యత్తుకు భద్రత ఉండదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అలాగే తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయన్న భావన కూడా సరికాదని స్పష్టం చేశాయి. “ఈ పథకాన్ని పురస్కరించుకుని సాయుధ దళాల్లో చేరేవారికి ఆర్థిక ప్యాకేజీ, బ్యాంక్ రుణాలవంటి సదుపాయాలుంటాయి.. ఇందుకు బ్యాంక్ లోన్ స్కీం అన్నది కూడా వర్తింపజేయాలని నిర్ణయించుకున్నాం.. తమ చదువును ఇంకా కొనసాగించుకోదలిచిన వారికి 12 వ తరగతికి సమానమైన సర్టిఫికెట్ ను ఇవ్వడం, అలాగే ఉద్యోగాల్లో చేరదలిచేవారికి కేంద్ర సాయుధ దళాల్లో లేదా రాష్ట్ర పోలీసు శాఖల్లో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది“ అని వివరించాయి.

ఇతర రంగాల్లో కూడా అగ్నివీరులకు పలు అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అందువల్ల మీ అవకాశాలు తగ్గిపోతాయన్న భయం అనవసరం అని చెబుతోంది. పైగా ఈ పథకంలో మీరు చేరితే సైన్యంలో ఛాన్సులు ఎన్నో ఉంటాయని, ప్రస్తుతం పాటిస్తున్న రిక్రూట్మెంట్ తో పోలిస్తే ఇవి మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. రెజిమెంటల్ సిస్టంలో ఎలాంటి మార్పులూ ఉండవు.. ఉత్తమ ప్రతిభ కనబరచిన అగ్నివీరులను ఎంపిక చేసి వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ఈ కారణంగా మీకున్న అపోహలను తొలగించుకోండి అని ఈ ఫ్యాక్ట్ షీట్ లో భరోసా ఇచ్చారు.

అయితే ఈ ఫ్యాక్ట్ షీట్ అనధికారికమే !

ఈ పథకం కింద సైన్యంలో చేరిన మొదటి సంవత్సరానికి గాను రిక్రూట్ అయిన అగ్నివీరులు సాయుధ దళాల్లో కేవలం 3 శాతం మాత్రమే ఉంటారని, నాలుగేళ్ల తరువాత వీరి పర్ఫామెన్స్ ని పరీక్షించడమే గాక సూపర్ వైజర్ స్థాయిలో ప్రమోషన్ల వంటివాటికి ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంకా ఇలాగే ఈ పథకం మీద ఉన్న వేర్వేరు అభిప్రాయాలను కొట్టివేసేందుకు సర్కార్ యత్నించింది. దీనికి నిరసనగా బీహార్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో యువకులు, విద్యార్థులు పెద్దఎత్తున హింసాత్మక ఆందోళనలకు దిగారు. నిజానికి ప్రస్తుతం జవాన్ల జీతాలు, అలవెన్సులకు, పెన్షన్ బిల్లులకు భారీ ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరపవలసి వస్తోంది. అలాగే ఆయుధాల కొనుగోలుకు కూడా సొమ్మును వెచ్చించాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి పథకాన్ని అమలు చేసిన పక్షంలో ప్రభుత్వ ఖజానాపై ఈ భారాన్ని తగ్గించవచ్చునన్నది మోడీ సర్కార్ ఇన్నర్ థాట్ ! ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో పుచ్చుకున్నట్టే ఇదీనూ ! అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ర్యాడికల్ సంస్కరణలకు పూనుకోవడం మంచిదే అయినా ఇది రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయమే అన్నది విశ్లేషకుల అంచనా. ఈ సంస్కరణలు సాయుధ దళాల క్యారక్టర్, సైన్యం పోకడలపై ప్రతికూల ప్రభావం చూపినా చూపవచ్చునని వారు విశ్లేషిస్తున్నారు. ఏ విధంగా చూసినా ఒకటిన్నర ఏళ్లలో దేశంలో పది లక్షలమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇప్పుడు కొత్తగా ఈ అగ్నివీరులకు తాయిలాలు అన్నది 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది నిర్వివాదాంశం !!!

First Published:  16 Jun 2022 10:28 PM GMT
Next Story