Telugu Global
International

హెలీకాఫ్టర్లలో వచ్చారు.. దిగారు.. టెర్రరిస్టును ఎత్తుకెళ్లారు

”విలన్ ఎక్కడో దాక్కొని ఉంటాడు.. హీరో హెలీకాఫ్టర్‌లో సరిగ్గా విలన్ ఉండే ఇంటి మీదే దిగేసి.. నాలుగు తన్నులు తన్ని.. హెలీకాఫ్టర్‌లో ఎత్తుకపోతాడు”.. ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం. హాలీవుడ్ సినిమాల్లో యూఎస్ ఆర్మీ చేసే అద్భుతమైన పోరాటాలు చూసి.. నిజంగా అలా జరుగుతాయా అనుకుంటాం. బిన్ లాడెన్‌ను పట్టుకున్నప్పుడు ఇలాంటి కథనాలే వచ్చాయి. కానీ ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యులెవరూ లేరు. కానీ తాజాగా జరిగిన ఒక కిడ్నాప్ మాత్రం, హాలీవుడ్ సినిమా స్క్రీన్ లాగానే ఉన్నది. […]

military-operation-northern-Syria11
X

”విలన్ ఎక్కడో దాక్కొని ఉంటాడు.. హీరో హెలీకాఫ్టర్‌లో సరిగ్గా విలన్ ఉండే ఇంటి మీదే దిగేసి.. నాలుగు తన్నులు తన్ని.. హెలీకాఫ్టర్‌లో ఎత్తుకపోతాడు”.. ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం. హాలీవుడ్ సినిమాల్లో యూఎస్ ఆర్మీ చేసే అద్భుతమైన పోరాటాలు చూసి.. నిజంగా అలా జరుగుతాయా అనుకుంటాం. బిన్ లాడెన్‌ను పట్టుకున్నప్పుడు ఇలాంటి కథనాలే వచ్చాయి. కానీ ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యులెవరూ లేరు. కానీ తాజాగా జరిగిన ఒక కిడ్నాప్ మాత్రం, హాలీవుడ్ సినిమా స్క్రీన్ లాగానే ఉన్నది.

అది వాయువ్య సిరియాలో ఉన్న అల్ హుమైరా ప్రాంతం. అక్కడ ఎక్కువగా టర్కిష్ సపోర్ట్ ఉన్న రెబెల్స్, నాన్-ఐసిస్ జీహాదీ గ్రూపులు ఎక్కువగా పని చేస్తూ ఉంటాయి. ఎవరు టెర్రరిస్టో.. ఎవరు సాధారణ పౌరుడో గుర్తించడం చాలా కష్టం. అందుకే యూఎస్ సంకీర్ణ దళాలు సాధారణంగా అక్కడ దాడులకు దిగవు. అంతే కాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి సపోర్ట్ ఉండదు కాబట్టి ఇలాంటి కిడ్నాపులు కూడా చేయదు. అయితే ఒక కచ్చితమైన సమాచారం అందడంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది.

గతంలో సిరియాలోని రఖా పట్టణంలో ఐసిస్ లీడర్‌గా ఉంటూ.. ప్రస్తుతం దాయిష్‌లో టాప్ లీడర్‌గా ఉన్న హనీ అహ్మద్ అల్-కుర్దీ ఒక ఇంట్లో నక్కి ఉన్నట్లు తెలిసింది. ఇరాక్, సిరియాల్లో జీహాదీ గ్రూప్‌లతో యుద్దం చేస్తున్న సంకీర్ణ దళ సైనికులు రెండు ఆర్మీ హెలీకాఫ్టర్లలో బయలుదేరారు. గురువారం పొద్దుగుంకుతున్న సమయంలో అలెప్పో ప్రాంతంలోని అల్ హుమైరా గ్రామం వైపు వేగంగా దూసుకొని పోయారు. ఒక ఇంటి సమీపంలో దిగి కేవలం ఏడే నిమిషాల్లో అక్కడి నుంచి హనీ అహ్మద్‌ను ఎత్తుకెళ్లారు.

హెలీకాఫ్టర్లు రావడం, హనీ అహ్మద్ ఉన్న ఇంటి వద్ద దిగడం, అతడిని పట్టుకెళ్లిపోవడం చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు కూడా చూశారు. తాము ఎత్తుకొచ్చింది ఎవరిననే విషయాన్ని యూఎస్ ఆర్మీ వెల్లడించలేదు. అయితే యుద్దవార్తలను కవర్ చేస్తున్న ఏఎఫ్‌పీ బృందం మాత్రం అతడు హనీ అహ్మద్ అని స్పష్టం చేసింది.

హనీ అహ్మద్ ఒక బాంబ్ ఎక్స్‌పర్ట్. అతి వేగంగా, చాకచక్యంగా బాంబులు తయారు చేయడమే కాకుండా వాటిని వాడటంలో ఇతరులకు శిక్షణ ఇవ్వగలడు. రెబెల్ గ్రూప్స్, జీహాదీ గ్రూపులకు ఇతడే బాంబులు సరఫరా చేస్తున్నట్లు యూఎస్ ఆర్మీ చెప్తోంది. అలా బాంబుల నిష్ణాతుడిగా పేరు తెచ్చుకొని ఏకంగా దాయిష్ టాప్ లీడర్‌గా మారిపోయాడు. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కూడా అక్కడ కిడ్నాప్ జరిగినట్లు స్పష్టం చేసింది. టర్కీ-సిరియా బార్డర్‌కు ఈ ఆపరేషన్ జరిగిన విలేజ్ కేవలం రెండున్నర మైళ్ల దూరం మాత్రమే ఉన్నట్లు తెలిపింది.

ఇక ఎంతో చాకచక్యంగా జరిపిన ఈ ఆపరేషన్‌లో సాధారణ పౌరులు ఎవరూ గాయపడలేదని తెలిసింది. అలెప్పోలో నివసించే మహ్మద్ యూసుఫ్ ఈ ఘటనకు సాక్షిగా ఉన్నాడు. గ్రామస్థులు ఎవరూ గాయపడలేదు. కేవలం ఏడు నిమిషాల్లో తమ పని చేసుకొని ఆర్మీ వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఇతర మహిళలు.. ఆర్మీ ఎత్తుకెళ్లిన వ్యక్తి పేరు ఫవాజ్ అని తనతో చెప్పినట్లు మహ్మద్ తెలిపాడు. ఆ ఇంట్లో నలుగురు పురుషులు, ఆరుగురు మహిళలు నివసిస్తున్నట్లు తెలిసింది.

First Published:  17 Jun 2022 4:54 AM IST
Next Story