మమతకు రాజనాథ్ ఫోన్.. ఏకగ్రీవం చేద్దామంటూ ప్రతిపాదన?
రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార ఎన్డీయేకు పూర్తి మెజార్టీ లేకపోవడం, ప్రతిపక్షాలన్నీ కలసి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఐక్యత కుదరక పోవడంతో రాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారింది. విపక్షాలను ఏకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అసలు ఆ కూటమికి రాష్ట్రపతి అభ్యర్థి దొరకడమే కష్టంగా మారింది. కీలకమైన పార్టీలు కూడా మమత మాటను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు అధికార ఎన్టీయే కూడా […]
రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార ఎన్డీయేకు పూర్తి మెజార్టీ లేకపోవడం, ప్రతిపక్షాలన్నీ కలసి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఐక్యత కుదరక పోవడంతో రాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారింది. విపక్షాలను ఏకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అసలు ఆ కూటమికి రాష్ట్రపతి అభ్యర్థి దొరకడమే కష్టంగా మారింది. కీలకమైన పార్టీలు కూడా మమత మాటను పెద్దగా పట్టించుకోవడం లేదు.
మరోవైపు అధికార ఎన్టీయే కూడా రాష్ట్రపతి ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నది. గెలుస్తామనే ధీమా ఉన్నా.. ఎక్కడో కాస్త సంకోచిస్తున్నది. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తుండటంతో ఆ బాధ్యతను సీనియర్ బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. ఎలాగైన సరే ఎలాంటి పోటీ లేకుండా తమ అభ్యర్థిని ఏకగ్రీవం చేయించుకునేందుకు అయన విపక్ష నేతలతో ఫోన్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.
విపక్షాలు తమ అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే, బుధవారం రాజ్‌నాథ్ స్వయంగా కాంగ్రెస్, టీఎంసీ ముఖ్యులకు ఫోన్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కూడా ఆయన కాల్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని ఆయన కోరినట్లు తెలుస్తున్నది. అయితే, రాజ్‌నాథ్ ప్రతిపాదనకు అటువైపు నుంచి సమాధానం రానట్లు తెలిసింది.
సోనియా గాంధీ అనారోగ్యంతో ఉన్నారని.. ఆమె కోలుకున్న తర్వాత మీరు చెప్పిన సమాచారాన్ని చేరవేస్తానని రాజ్‌నాథ్‌కు మల్లిఖార్జున్ ఖర్గే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మమత బెనర్జీ కూడా ఈ విషయంపై నోరు మెదపలేదని.. తర్వాత చెబుతానని మాట దాటవేసినట్లు తెలుస్తున్నది.
ఏదేమైనా, రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేద్దామనుకున్న రాజ్‌నాథ్ సింగ్ ప్రయత్నాలు అంతగా ఫలించేలా కనపడటం లేదు. విపక్షాలు సహకరించకుంటే.. బీజేపీ మరో వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.