Telugu Global
National

‘నేనెరుగ..నేనెరుగ.. అంతా మోతీలాల్ వోరాకే ఎరుక’.. రాహుల్ గాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో తనను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముప్పుతిప్పలు పెడుతున్నట్టే కనిపిస్తోంది. ఈ కేసులో వారు ఆయనను వరుసగా మూడు రోజులు ప్రశ్నించాక.. మళ్ళీ నాలుగోసారి శుక్రవారం కూడా విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలు నిర్వహించిన లావాదేవీలన్నీ దివంగత పార్టీ నేత మోతీలాల్ వోరాకే తెలుసునని రాహుల్ గాంధీ వారికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సంస్థలు, కాంగ్రెస్ పార్టీ మధ్య డీల్, […]

Rahula-mothilal-ed
X

నేషనల్ హెరాల్డ్ కేసులో తనను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముప్పుతిప్పలు పెడుతున్నట్టే కనిపిస్తోంది. ఈ కేసులో వారు ఆయనను వరుసగా మూడు రోజులు ప్రశ్నించాక.. మళ్ళీ నాలుగోసారి శుక్రవారం కూడా విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలు నిర్వహించిన లావాదేవీలన్నీ దివంగత పార్టీ నేత మోతీలాల్ వోరాకే తెలుసునని రాహుల్ గాంధీ వారికి చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ సంస్థలు, కాంగ్రెస్ పార్టీ మధ్య డీల్, సంబంధిత అంశాల్లో అవకతవకలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ లావాదేవీల గురించి తనకేమీ తెలియదని, అంతా మోతీలాల్ చూసుకునేవారని రాహుల్ చెప్పినట్టు సమాచారం. నాటి రుణాలు, ఎకామడేషన్ ఎంట్రీలు తదితరాలకు సంబంధించి వ్యక్తిగతంగా నాకేమీ తెలియదు.. వాటికి వోరాదే బాధ్యత అని ఆయన అన్నింటినీ వోరా పైనే తోసేశారట. గాంధీ కుటుంబమే యంగ్ ఇండియా లావాదేవీలను పర్యవేక్షిస్తూ వచ్చేదని, ఆదాయపు పన్ను శాఖ నివేదికను పురస్కరించుకుని ఈడీ వీటిపై నజర్ పెట్టిందని తెలుస్తోంది. అయితే రాహుల్ చెప్పిన విషయాలు లీక్ కావడంపై స్పందించిన కాంగ్రెస్ నేత ప్రణవ్ ఝా.. ఇది జ్యూడిషియల్ తరహాలో ఉందని, అందువల్ల క్రిమినల్ నేరమే అవుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై మరింతగా వివరించేందుకు నిరాకరించారు.

అటు.. ఈ నెల 17 న తాము మళ్ళీరాహుల్ ని విచారిస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. యంగ్ ఇండియా సంస్థలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 76 శాతం, పార్టీ నేతలైన మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండేజ్ లకు మిగతా 12 శాతం చొప్పున వాటా ఉందని లోగడ వార్తలు వచ్చాయి. అయితే వోరా 2020 డిసెంబరులో, ఫెర్నాండెజ్ 2021 సెప్టెంబరులో మరణించారు.

ఈ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నందుకు నిరసనగా గురువారం కూడా దేశంలో అనేక చోట్ల కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, గౌహతి, చండీగఢ్ వంటి అనేక నగరాల్లో వీరి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పలు చోట్ల వాహనాల టైర్లను తగులబెట్టారు. పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదాలు జరిగాయి. నేతలను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.

హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో పార్టీ కార్యాలయం నుంచి రాజ్ భవన్ వరకు వెళ్తున్న వీరిని ఖాకీలు మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళన ఫలితంగా పలు చోట్ల గంటలతరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తమ నేతపై అక్రమ కేసులు పెట్టారని కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. నిరసన తెలపడం తమ హక్కని, న్యాయం కోసం తమ పార్టీ పోరాడుతుందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె. శివకుమార్ ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం బీజేపీ నేతలపై కేసులు పెట్టడం లేదని, మా పార్టీవారినే వేధిస్తోందని ఆయన ఆరోపించారు. గౌహతిలో బ్యారికేడ్లను ఛేదించుకుని వెళ్తున్న పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఇలా ఉండగా గురువారం పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి ఆధ్వర్యాన ఓ ప్రతినిధి బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకుని ఆయనకు ఓ మెమోరాండం సమర్పించింది. ఢిల్లీలో తమ పార్టీ ఎంపీలపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని, పార్టీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడి కార్యకర్తలను, సిబ్బందిని కొడుతున్నారని వారు ఇందులో ఆరోపించారు.

First Published:  16 Jun 2022 2:43 AM GMT
Next Story