Telugu Global
National

‘అగ్నిపథ్’ రేపిన అగ్ని.. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెల్లుబికిన నిరసనలు

దేశంలోని యువతను సాయుధ దళాల్లోకి తీసుకునేందుకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్‘ పథకాన్ని కేంద్రం ప్రకటించి రెండు రోజులైనా అయిందో, లేదో అప్పుడే దీనికి నిరసనలు, ఆందోళనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వందలాది యువకులు.. తాము ఈ పథకం మేరకు సైన్యంలో చేరినా నాలుగేళ్ల తరువాత తమ గతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమ జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, ఇతర ప్రయోజనాల గురించిన ప్రస్తావన ఈ పథకంలో ప్రస్తావించలేదని మండిపడుతున్నారు. నాలుగేళ్ల అనంతరం కేవలం 25 శాతం మందిని మాత్రమే తిరిగి […]

youth-Bihar-Rajasthan-protest-Agneepath
X

దేశంలోని యువతను సాయుధ దళాల్లోకి తీసుకునేందుకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్‘ పథకాన్ని కేంద్రం ప్రకటించి రెండు రోజులైనా అయిందో, లేదో అప్పుడే దీనికి నిరసనలు, ఆందోళనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వందలాది యువకులు.. తాము ఈ పథకం మేరకు సైన్యంలో చేరినా నాలుగేళ్ల తరువాత తమ గతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమ జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, ఇతర ప్రయోజనాల గురించిన ప్రస్తావన ఈ పథకంలో ప్రస్తావించలేదని మండిపడుతున్నారు. నాలుగేళ్ల అనంతరం కేవలం 25 శాతం మందిని మాత్రమే తిరిగి ఈ పథకం కింద తీసుకుంటారని కూడా ఈ స్కీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

దీనికి నిరసనగా బీహార్ లోని చాప్రాలో కొందరు యువకులు, విద్యార్థులు వాహనాల టైర్లను తగులబెట్టారు. ఓ బస్సుపై దాడి చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. రెండేళ్ల తరువాత సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇప్పుడు ఈ పథకాన్ని ప్రకటించి దీన్ని కేవలం నాలుగేళ్లకు పరిమితం చేసిందని వారు ఆరోపిస్తున్నారు.

సైన్యంలో నియామకం కోసం తామెన్నో ప్రయత్నాలు చేశామని, ఇప్పుడు నాలుగేళ్ల కాలానికి శిక్షణ ఇచ్చి ఆ తరువాత పొమ్మంటే తమ పరిస్థితి ఏమిటని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. ఈ పథకానికి సర్కార్ కొన్ని మార్పులు చేయాలని, తమ జాబ్ సెక్యూరిటీకి హామీ ఇవ్వాలని కోరాడు. తాము రోడ్లలోకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తామని మరో విద్యార్ధి హెచ్చరించాడు. బక్సర్ జిల్లాలో 100 మందికి పైగా యువకులు, విద్యార్థులు రైల్వే స్టేషన్ లోకి దూసుకువచ్చి రైలు పట్టాలపై బైఠాయించారు. పాట్నాకు వెళ్లే జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ ను సుమారు అరగంట సేపు నిలిపేశారు. అగ్నిపథ్ పథకానికి నిరసనగా వారు నినాదాలు చేశారు.

వీరి ఆందోళన ఎంత ఉధృతమైందంటే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆందోళనకారులు పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ పై రాళ్ళు విసిరారని కూడా తెలిసింది. ముజఫర్ పూర్ టౌన్ లో ఓ గుంపు రోడ్లపైకి వచ్చి వాహనాల టైర్లను తగులబెట్టారు. జవాన్ల నియామకానికి జరుగుతున్న టెస్టులను అడ్డుకోవడానికి కొందరు యత్నించినట్టు తెలుస్తోంది. నవాడా, జెహానాబాద్, ముంగేర్ జిల్లాల్లో కూడా ఇలా ఆందోళనలు కొనసాగాయి. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

రాజస్థాన్ లో కూడా ..

రాజస్థాన్ లోని జైపూర్ లో 150 మందికి పైగా నిరసనకారులు అజ్మీర్-ఢిల్లీ హైవేపై రాస్తారోకో చేశారు. గతంలో మాదిరే సైన్యంలో నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేసినట్టు ఓ అధికారి చెప్పారు. వీరి ఆందోళన చాలాసేపు కొనసాగిందని, చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో రాస్తారోకో విరమించారని, 10 మందిని అరెస్టు చేశారని ఆయన తెలిపారు.

First Published:  16 Jun 2022 6:56 AM IST
Next Story