‘నాలుగేళ్లు కాదు.. పూర్తికాలమివ్వండి’ – అరవింద్ కేజ్రీవాల్
దేశానికి సేవ చేయగోరుతున్న యువతకు నాలుగేళ్ల కాలం కాకుండా వారు తమ జీవితమంతా సేవ చేసేట్టు చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. దీనిపై యువత ఆగ్రహంతో ఉందని, ఇది కాంట్రాక్ట్ జాబ్ లా వారు భావిస్తున్నారని, వీరి కలలను నాలుగేళ్ల కాలానికి పరిమితం చేయడం సబబు కాదన్నారు. యువకులు, విద్యార్థుల డిమాండ్ సరైనదేనని ఆయన సమర్థించారు. ఈ పథకానికి నిరసనగా బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో […]
దేశానికి సేవ చేయగోరుతున్న యువతకు నాలుగేళ్ల కాలం కాకుండా వారు తమ జీవితమంతా సేవ చేసేట్టు చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. దీనిపై యువత ఆగ్రహంతో ఉందని, ఇది కాంట్రాక్ట్ జాబ్ లా వారు భావిస్తున్నారని, వీరి కలలను నాలుగేళ్ల కాలానికి పరిమితం చేయడం సబబు కాదన్నారు. యువకులు, విద్యార్థుల డిమాండ్ సరైనదేనని ఆయన సమర్థించారు. ఈ పథకానికి నిరసనగా బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రేగిన హింసాత్మక ఘటనలు చూస్తే దీన్ని దేశంలో ప్రతిచోటా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోందన్నారు.
మన దేశ సైనిక సత్తా మనకు గర్వ కారణమని, మన యువత తమ జీవిత కాలమంతా దేశానికి సేవ చేయదలుచుకుంటున్నారని ఆయన ట్వీట్ చేశారు. వారి కలలను నాలుగేళ్లకు కట్టడి చేయకండి అని సూచించారు. వయస్సు కాస్త ఎక్కువగా ఉన్నవారికి కూడా అవకాశమివ్వాలని, గత రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు జరగలేదని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఈ దేశ నిరుద్యోగ యువకుల గళం వినండి .. ఇప్పటికైనా మించిపోయింది లేదు అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి ట్వీటించారు. కొత్త పథకం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గురువారం యువకులు, విద్యార్థులు ఔటర్ ఢిల్లీ లోని నంగ్లోయి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైఠాయించారు. హర్యానా లోని జింద్ నుంచి ఓల్డ్ ఢిల్లీకి వెళ్తున్న రైలును వారు నిలిపివేశారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు స్పల్పంగా లాఠీచార్జి చేశారు.
అగ్నిపథ్ స్కీం ఈ దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని, అసలు ఇది సమగ్రంగా లేదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వంటివారు కూడా దీన్ని తప్పు పట్టారు. సైన్యంలోని పలువురు మాజీ అధికారులు సైతం ఈ పథకం పట్ల పెదవి విరిచారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ళ వయస్సువారిని ఈ పథకం కింద నాలుగేళ్ల కాలానికి గాను నియమించి వారికి నెలకు 30 వేల నుంచి 40 వేల రూపాయల వేతనమివ్వాలని నిర్దేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్లాన్ వల్ల జవాన్లకు చెల్లించే భారీ వేతనాలు, పెన్షన్ బిల్లుల భారం ప్రభుత్వ ఖజానాకు తగ్గుతుంది. పైగా ఆయుధాల కొనుగోలుకుగాను మిగిలిన నిధులను వినియోగించే అవకాశం కలుగుతుంది.