Telugu Global
National

మరో పదేళ్లలో సైన్యంలో సగం మంది అగ్నివీరులే.. దేశ భద్రత ఇక గాల్లో దీపమే..!

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ ద్వారా కాంట్రాక్ట్ సైనికుల నియామకానికి తెరలేపిన సంగతి తెలిసిందే. అగ్నివీరులుగా పిలిచే వీళ్లు 4 ఏళ్లు మాత్రమే సర్వీసులో ఉంటారు. ఈ ఏడాది 46,0000 మంది అగ్నివీరులను రిక్రూట్ చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఏడేళ్ల తర్వాత ఏడాదికి 1.20 లక్షల మందిని నియమించుకుంటారు. పదేళ్ల తర్వాత ఏడాదికి 1.60 లక్షల మంది అగ్నివీరుల నియామకం ఉంటుంది. ఇకపై త్రివిద దళాల్లో అధికారులు తప్ప మిగిలిన వాళ్లందరూ కేవలం అగ్నిపథ్ స్కీమ్ […]

Army-Vice-Chief-Baggavalli-Somasekhara-Raju
X

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ ద్వారా కాంట్రాక్ట్ సైనికుల నియామకానికి తెరలేపిన సంగతి తెలిసిందే. అగ్నివీరులుగా పిలిచే వీళ్లు 4 ఏళ్లు మాత్రమే సర్వీసులో ఉంటారు. ఈ ఏడాది 46,0000 మంది అగ్నివీరులను రిక్రూట్ చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఏడేళ్ల తర్వాత ఏడాదికి 1.20 లక్షల మందిని నియమించుకుంటారు. పదేళ్ల తర్వాత ఏడాదికి 1.60 లక్షల మంది అగ్నివీరుల నియామకం ఉంటుంది. ఇకపై త్రివిద దళాల్లో అధికారులు తప్ప మిగిలిన వాళ్లందరూ కేవలం అగ్నిపథ్ స్కీమ్ ద్వారానే రిక్రూట్ అవుతారు. దీంతో 2030-2032 నాటికి సైన్యంలో 50 శాతం మంది అగ్నివీరులే ఉంటారని ఆర్మీ వైస్ చీఫ్ బగ్గవల్లి సోమశేఖర రాజు వెల్లడించారు. అంటే 12 లక్షల మంది సైనికులుంటే.. అందులో 6 లక్షల మంది అగ్నివీరులే ఉంటారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో ఈ ఏడాది 3000 మంది అగ్నివీరులను నియమించుకోనున్నట్లు ఆయన వివరించారు. అయితే రాబోయే రోజుల్లో నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అగ్నివీరుల్లో కేవలం 25 శాతం మందినే మరో 15 ఏళ్ల పాటు ఫుల్ టైం బేసిస్ మీద తీసుకుంటామన్నారు. మిగిలిన 75 శాతం మంది ఉద్యోగాలు వదిలి పోవల్సిందేనని బీఎస్ రాజు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆర్మీలో సగటు సైనికుడి వయసు 32 ఏళ్లుగా ఉన్నది. దీన్ని 24 నుంచి 26 ఏళ్లకు తగ్గించడమే ఈ అగ్నిపథ్ స్కీం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ అగ్నివీరులకు తొలి ఏడాది రూ. 4.76 లక్షల ప్యాకేజీ ఇస్తారు. ఇందులో జీతంగా అందేది రూ. 21 వేలు మాత్రమే. రూ. 9 వేలు అగ్నివీర్ జీతం నుంచి కట్ చేసి అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు జమ చేస్తారు. అంతే మొత్తం ప్రభుత్వం కూడా ఆ ఫండ్‌కు జమ చేస్తుంది. నాలుగో ఏడాది రూ. 40 వేల జీతానికి గాను రూ. 28 వేలు చేతికి వస్తాయి. రూ. 12వేల కార్పస్ ఫండ్‌కు జమ అవుతాయి. నాలుగేళ్ల తర్వాత దిగిపోయే ముందు కార్పస్ ఫండ్‌లో జమ అయిన రూ. 11.71 లక్షలను సదరు సైనికుడికి అందిస్తారు. ఇక ఆ తర్వాత ఎలాంటి పెన్షన్లు, స్కీములు అతడికి వర్తించవు. కానీ సైన్యంలో నాలుగేళ్లు పని చేసినట్లు సర్టిఫికెట్ మాత్రం ఇస్తారు.

మరి భద్రత సంగతి?

సైన్యంలో చేరాలంటే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు రాసి పాసైతే చాలదు. ఆ తర్వాత కఠోర శిక్షణ కూడా ఉంటుంది. జనరల్ డ్యూటీ జవాను అయితే 9 నెలలు, టెక్నికల్ సోల్జర్ అయితే 5 నెలల శిక్షణ ఉంటుంది. ఆయా రెజిమెంట్లలో చేరిన తర్వాత మరో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో 25 కేజీల ఫుల్ గేర్ ధరించి 10, 20, 30, 40 కిలోమీటర్ల స్పీడ్ వాక్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కఠిన శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్లు స్పెషల్ ఫోర్సెస్‌లో చేరతారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలన్నా అలాంటి శిక్షణే ఉంటుంది. ఇలాంటి సుశిక్షుతులైన సైనికులే దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తుంటారు.

కానీ అగ్నివీరులు సైన్యంలో ఉండేది నాలుగేళ్లు మాత్రమే. ఆ నాలుగేళ్లలోనే ఆరు నెలలు శిక్షణ ఉంటుంది. ఆరు నెలల శిక్షణ సమయంలో యుద్దం చేయడానికి సిద్దమవుతారా అంటే అనుమానమే. 10 ఏళ్ల తర్వాత సగం మంది అగ్నివీరులే ఉంటే.. అదే సమయంలో చైనా, పాకిస్తాన్ నుంచి యుద్ద ముప్పు ముంచుకొస్తే దేశం పరిస్థితి ఏంటని రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్ చేసుకుంటారు. వారికి సునిశితమైన శిక్షణ ఇస్తారు. కానీ ఫ్రంట్ లైన్‌లో పోరాడే సైనికులు ఎలాంటి యుద్ద శిక్షణ లేకుండా ఉంటే ఇక దేశానికి ఏం భద్రత ఉంటుంది.

సైన్యంలో 6 లక్షల మంది శిక్షణ, అనుభవం లేని సైనికులే ఉంటే ఆ దేశ భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హిమాలయా పర్వతాలు, గల్వాన్ లోయ వంటి భయంకరమైన ప్రాంతాల్లో ఈ అగ్నివీరులు కఠినమైన సేవలు అందించగలరా అనేది అనుమానమే. మరోవైపు నాలుగేళ్ల తర్వాత ఈ 46 వేల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారు. సరైన ఉద్యోగాలు దొరకక పోతే సంఘవిద్రోహ శక్తులుగా మారితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఈ విషయంపై ఆర్మీ వైస్ చీఫ్ బీఎస్ రాజు స్పందిస్తూ.. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయడం అనేది ఉండదు. అయితే ఏవైనా లోటుపాట్లు ఉంటే రాబోయే రోజుల్లో సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. బయటకు వెళ్లిన వాళ్లు సంఘవిద్రోహ శక్తులుగా మారతారనే అపోహ మాత్రమేనని.. వారికి అనేక సంస్థలు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

First Published:  16 Jun 2022 11:10 AM IST
Next Story