Telugu Global
National

దీదీ ఢిల్లీ సమావేశం… 8 మంది సీఎంలను పిలిస్తే ఒక్కరూ రాలేదు

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఇవ్వాళ్ళ ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభమయ్యింది. ఈ భేటీకోసం 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 22 మంది జాతీయ స్థాయి నేతలను మమత ఆహ్వానించారు. అయితే ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రులే కాకుండా టీఆర్‌ఎస్, ఆప్‌, అకాళీదళ్‌, బీజేడీ సైతం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన‌ భేటీకి గైర్హాజరు […]

mamatha
X

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఇవ్వాళ్ళ ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభమయ్యింది. ఈ భేటీకోసం 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 22 మంది జాతీయ స్థాయి నేతలను మమత ఆహ్వానించారు. అయితే ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.

ముఖ్యమంత్రులే కాకుండా టీఆర్‌ఎస్, ఆప్‌, అకాళీదళ్‌, బీజేడీ సైతం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన‌ భేటీకి గైర్హాజరు అయ్యాయి.

ఇక ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జైరాం ర‌మేశ్‌, ర‌ణ‌దీప్ సింగ్ సూర్జేవాలా హాజ‌ర‌య్యారు. వీరితో పాటు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ త‌న పార్టీకి చెందిన మ‌రో ఎంపీతో క‌లిసి వ‌చ్చారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కూడా ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. మ‌హారాష్ట్రలో అధికార పార్టీ శివ‌సేన నుంచి ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చ‌తుర్వేది హాజ‌ర‌య్యారు. జేడీఎస్ నుంచి మాజీ ప్ర‌ధాని హెచ్‌డీ దేవేగౌడ‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, పీడీపీ నుంచి మెహ‌బూబా ముఫ్తీ, డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఐ నుంచి డి.రాజా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్ బయటకు వచ్చి మరీ విపక్ష నేతలను రిసీవ్‌ చేసుకున్నారు మమతా బెనర్జీ. దాదాపు రెండు గంట‌ల పాటు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.

రాష్ట్రపతి పదవికి పోటీ పడేందుకు శరద్ పవార్ నిరాకరిస్తుండటంతో క్రితం సారి జ‌రిగిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో వెంక‌య్య‌నాయుడిపై పోటీ చేసిన గోపాల‌కృష్ణ గాంధీని బ‌రిలోకి దించాల‌ని మమతా బెనర్జీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

First Published:  15 Jun 2022 5:29 AM GMT
Next Story