ఆసియా కుబేరుడి చేతిలో ఐపీఎల్ డిజిటల్ హక్కులు
వచ్చే ఐదేళ్లపాటు (2023-2027) జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారహక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ కాసుల పంట పండించుకొంది. సీజన్ కు రెండుమాసాలపాటు.74 మ్యాచ్ లుగా సాగే ఈటోర్నీలో మ్యాచ్ కు సగటున 57 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున అందుకోనుంది. మొత్తం మీద 48వేల 390 కోట్ల రూపాయల రికార్డు మొత్తాన్ని ఆర్జించనుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సంస్థ.. డిజిటల్ ప్రసారహక్కులను 20 వేల కోట్ల 500 కోట్ల రూపాయల ధరకు దక్కించుకొంటే..మ్యాచ్ […]
వచ్చే ఐదేళ్లపాటు (2023-2027) జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారహక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ కాసుల పంట పండించుకొంది. సీజన్ కు రెండుమాసాలపాటు.74 మ్యాచ్ లుగా సాగే ఈటోర్నీలో మ్యాచ్ కు సగటున 57 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున అందుకోనుంది. మొత్తం మీద 48వేల 390 కోట్ల రూపాయల రికార్డు మొత్తాన్ని ఆర్జించనుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సంస్థ.. డిజిటల్ ప్రసారహక్కులను 20 వేల కోట్ల 500 కోట్ల రూపాయల ధరకు దక్కించుకొంటే..మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారహక్కులను స్టార్ ఇండియా గ్రూపుకు చెందిన డిస్నీ సంస్థ 23వేల 575 కోట్ల రూపాయలకు చేజిక్కించుకొంది. 2017లో ప్రత్యక్షప్రసార హక్కుల కోసం స్టార్ చెల్లించిన మొత్తం కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇది కాక..అంతర్జాతీయంగా ఐపీఎల్ ప్రసారహక్కులు, కొన్నిప్రత్యేకమ్యాచ్ ల ప్రసారహక్కులను బీసీసీఐ విక్రయించాల్సి ఉంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ మొదటి 10 సంవత్సరాల ప్రసారహక్కుల్ని సోనీ సొంతం చేసుకొంటే..ఆ తర్వాతి ఐదుసంవత్సరాల ప్రసారహక్కులు స్టార్ ఇండియా పరమయ్యాయి.
అయ్యారే!..అంబానీ..!
దేశంలోని ఎన్నో రకాల వ్యాపారాలను తన గుప్పిట్లో పెట్టుకొన్న ముకేశ్ అంబానీ చివరకు..కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ ప్రసారహక్కుల డిజిటల్ విభాగంలో అడుగుపెట్టాడు. ముకేశ్ అంబానీకి చెందిన వైకోమ్ 18 సంస్థ..అమెరికన్ జెయింట్ పారమౌంట్ గ్లోబల్ కు సహభాగస్వామిగా ఉంది. ఆస్ట్రేలియా మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్దోక్ కుమారుడు జేమ్స్ పారమౌంట్ గ్లోబల్ ను నిర్వహిస్తున్నారు. గతంలో ప్రసారహక్కుల వేలాన్ని 10 సంవత్సరాలకు విక్రయించిన ఐపీఎల్ బోర్డు ఆ తర్వాతి నుంచి ఐదేళ్ల కాలానికి మాత్రమే పరిమితం చేస్తూ వస్తోంది. 2023 సీజన్ నుంచి 2027 సీజన్ వరకూ ప్రసార హక్కులతో పాటు వివిధ రూపాలలో ఆదాయాన్ని పెంచుకోడానికి కసరత్తులు చేస్తోంది. ప్రస్తుత 2022 సీజన్ వరకూ మ్యాచ్ కు 60 కోట్ల రూపాయలు చొప్పున ఆర్జించిన ఐపీఎల్ బోర్డు..రానున్న కాలంలో మ్యాచ్ కు 100 కోట్ల రూపాయలు సంపాదించాలని నిర్ణయించింది. ప్రసారహక్కుల కనీస ధరను 32వేల 890 కోట్ల రూపాయలుగా నిర్ణయించినా..44 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే కళ్లజూసింది. ఇక నుంచి ఏడాదికి రెండు ఐపీఎల్ టోర్నీలు నిర్వహించాలంటూ భారత మాజీ శిక్షకుడు రవిశాస్త్రి సలహా ఇచ్చారు. ఈ సూచనను సైతం ఐపీఎల్ బోర్డు పరిగణనలోకి తీసుకొని సాధ్యాసాధ్యాల గురించి నిపుణులతో చర్చిస్తోంది.
అంతై, ఇంతై..అంతింతై..!
ఐపీఎల్ ప్రసారహక్కుల విలువ గత 15 సీజన్లుగా అంతై ..ఇంతై..అంతింతై..అన్నట్లుగా పెరిగిపోతూ వస్తోంది. 2008 ప్రారంభసీజన్ నుంచి 10 సంవత్సరాలపాటు ప్రసారహక్కులను సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ కేవలం 8వేల 200 కోట్ల రూపాయల ధరకే సొంతం చేసుకొంది. గ్లోబల్ డిజిటల్ హక్కులను మూడు సంవత్సరాలకు గాను 2015లో నోవీ డిజిటల్ సంస్థ 302.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకొంది. 2017- 2022 మీడియా ప్రసారహక్కుల వేలం బరిలో స్టార్ ఇండియా, సోనీ పిక్చర్స్ నిలవడంతో పోటీ హోరాహోరీగా సాగింది. చివరకు స్టార్ ఇండియా ఐదేళ్ల కాలానికి 16వేల 347 కోట్ల రూపాయలకు ప్రసారహక్కులను దక్కించుకొంది. దీంతో మ్యాచ్ కు సగటున 55 కోట్ర రూపాయల వంతున ఐపీఎల్ బోర్డు రాబట్టగలిగింది. అన్ని ప్యాకేజీలు కలిపి వచ్చే ఐదేళ్ల కాలానికే రికార్డుస్థాయిలో 48 వేల 390 కోట్ల రూపాయలు ఆర్జించనుంది.
మ్యాచ్ కు 100 కోట్లు సాధ్యమేనా?
అల్లాఉద్దీన్ అద్భుత దీపం లాంటి ఐపీఎల్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఆర్జించాలని బీసీసీఐ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2022 సీజన్ విజయవంతం కావడంతో ఐపీఎల్ బ్రాండ్ విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇప్పటికే మీడియా రైట్స్, ప్రమోటర్లు, బ్రాండ్ వాల్యూ విషయంలో సీజన్ కో రికార్డు సృష్టిస్తున్న ఐపీఎల్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ 57 కోట్ల 50 లక్షల రూపాయలు కాగా.. రానున్న కాలంలో వందకోట్ల రూపాయలకు పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.ఇదే జరిగితే విశ్వవిఖ్యాత సాకర్ లీగ్ ‘ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్’ను ఐపీఎల్ అలవోకగా అధిగమించగలుగుతుంది. వచ్చే ఐదేళ్ల (2023-27 ) కాలానికి బీసీసీఐ ఐపీఎల్ మీడియా హక్కులను రూ. 32,890 కోట్లను బేస్ ప్రైజ్ (కనీస ధర) గా నిర్ణయించింది. ఈ లెక్కన ఒక్కో మ్యాచ్ కు టీవీ రైట్స్ ద్వారా కనీస ధరగా రూ. 49 కోట్లు దక్కనున్నాయి. డిజిటల్ రైట్స్ కోసం రూ. 33 కోట్లుగా నిర్ణయించారు.
దీనికి సంబంధించి.. స్పోర్ట్సీ సొల్యూషన్స్ సీఈవో ఆశిశ్ చద్దా మాట్లాడుతూ.. ‘వచ్చే సీజన్ లో ఒక్క మ్యాచ్ కోసం కనీస ధర లో 20-25 శాతం పెరుగుదల ఉండొచ్చు. కానీ డిజిటల్ రైట్స్ ప్యాకేజీలో మాత్రం భారీగా పెరుగుదల కనిపించే అవకాశమున్నది. వీటన్నింటి వల్ల రాబోయే సీజన్ లో ఒక్కో మ్యాచ్ విలువ సుమారు రూ. 115 కోట్ల నుంచి రూ. 120 కోట్ల మధ్యలో నిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదని చెప్పారు. ఇప్పటి వరకూ అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్ బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఒక్కో మ్యాచ్ విలువ రూ. 134 కోట్లు గా ఉంది. ఆ తర్వాత ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లో ఒక మ్యాచ్ విలువ రూ. 81 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో ఐపీఎల్ లో ప్రస్తుతం మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉంది. కానీ వచ్చే ఏడాది నుంచి అది వంద కోట్ల రూపాయలు దాటనుంది. దీంతో ఎన్ఎఫ్ఎల్ తర్వాతి స్థానంలో ఐపీఎల్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో అంబానీలు, అదానీల తర్వాత అత్యధికంగా ఆర్జిస్తున్న సంస్థ బీసీసీఐ మాత్రమే. అది కేవలం ఐపీఎల్ పుణ్యమా అంటూ జరుగుతోంది.