‘బుల్డోజర్ న్యాయం’ నుంచి పౌరులను రక్షించండి -‘సుప్రీం’కు మాజీ న్యాయమూర్తుల లేఖ
ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ న్యాయాన్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులుసుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లో పౌరులపై అధికారులు చేసిన హింసాకాండ, అణచివేత సంఘటనలపై సుమోటోగా కేసు స్వీకరించి న్యాయం చేయాలని ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. యూపీ లో ఆ నిరసనలకు సూత్రధారి అని […]
ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ న్యాయాన్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులుసుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లో పౌరులపై అధికారులు చేసిన హింసాకాండ, అణచివేత సంఘటనలపై సుమోటోగా కేసు స్వీకరించి న్యాయం చేయాలని ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ నాయకురాలు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. యూపీ లో ఆ నిరసనలకు సూత్రధారి అని చెప్పి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు జావేద్ మొహమ్మద్ ఇంటిని ప్రయాగ్‌రాజ్ అధికారులు బుల్డోజర్ తో కూల్చివేసిన నేపథ్యంలో మాజీ న్యాయమూర్తులు ఈ లేఖ రాశారు.
నిరసనకారులు చెప్తున్న దానిని వినకుండా, వాళ్ళు శాంతియుత నిరసనలలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వకుండా ఆ వ్యక్తులపై హింసాత్మక చర్యలు తీసుకోవడం అసమంజసమే కాదని, చట్టవ్యతిరేకమని ఆ లేఖ పేర్కొంది.
“భవిష్యత్తులో ఎవరూ నేరం చేయకుండా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా ఒక ఉదాహరణగా నిలిచే విధంగా దోషులపై అటువంటి చర్యలు తీసుకోవాలని” ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించినట్టు లేఖ పేర్కొంది. ఈ వ్యాఖ్యలే నిరసనకారులను క్రూరంగా,చట్టవిరుద్ధంగా చిత్రహింసలకు గురిచేయడానికి పోలీసులకు ధైర్యాన్ని ఇచ్చాయి, ”అని మాజీ న్యాయమూర్తులు ఆరోపించారు.
“పోలీసు కస్టడీలో ఉన్న యువకులను లాఠీలతో కొట్టడం, నిరసనకారుల ఇళ్లను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేయడం, మైనారిటీ ముస్లిం వర్గానికి చెందిన నిరసనకారులను పోలీసులు వెంబడించి కొట్టడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ మానవత్వాన్ని భయపెడుతున్నాయి.” అని లేఖలో పేర్కొన్నారు.
ఈ చర్యలు క్రూరమైన, చట్టవిరుద్దమైన విధ్వంసం, పౌరుల హక్కుల ఉల్లంఘన అని, ఇది రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను అపహాస్యం చేస్తుంది అని ఆ లేఖ పేర్కొంది.
న్యాయవ్యవస్థ యొక్క సత్తాను పరీక్షించే క్లిష్టమైన సమయం, అనేక సందర్భాల్లో, న్యాయవ్యవస్థ ఇటువంటి సవాళ్లను ఎదుర్కొంది. అలాంటి సమయాల్లో ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు క్రియాశీల౦గా వ్యవహరించింది అని పేర్కొన్న లేఖ 2020లో ఆకస్మిక లాక్‌డౌన్ సమయంలో, పెగాసస్ విషయంలో. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వలస కార్మికుల విషయంలో సుప్రీం కోర్టు సుమోటోగా స్పంధించింది అని గుర్తుచేసింది.
“అదే స్ఫూర్తితో, రాజ్యాంగ పరిరక్షకుడిగా , ఉత్తరప్రదేశ్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సుప్రీం కోర్టు వెంటనే సుమోటాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ”అని లేఖ కోరింది
సుప్రీం కోర్టుకు రాసిన ఈ లేఖపై సంతకం చేసినవారు….
1. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి,
2. జస్టిస్ వి. గోపాల గౌడ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి,
3. జస్టిస్ ఎ.కె. గంగూలీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
4. జస్టిస్ A.P. షా, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ చైర్‌పర్సన్,
5. జస్టిస్ కె. చంద్రు, మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి,
6. జస్టిస్ మహమ్మద్ అన్వర్, కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి,
7. శాంతి భూషణ్, సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు,
8. ఇందిరా జైసింగ్, సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు,
9. చందర్ ఉదయ్ సింగ్, సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు,
10. శ్రీరామ్ పంచు, సీనియర్ న్యాయవాది, మద్రాసు హైకోర్టు,
11. ప్రశాంత్ భూషణ్, న్యాయవాది, సుప్రీంకోర్టు,
12. ఆనంద్ గ్రోవర్, సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు.