10 లక్షల ఉద్యోగాల భర్తీకి మోడీ గ్రీన్‌సిగ్నల్.. కేటీఆర్ ఎఫెక్ట్ అంటున్న టీఆర్ఎస్
రాబోయే ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉద్యోగాలన్నీ యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ గత వారం ప్రధాని మోడీ కి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ప్రైవేట్ ఉద్యోగాలను ఇస్తామన్న ప్రధాని మోడీ హామీ […]
రాబోయే ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉద్యోగాలన్నీ యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ గత వారం ప్రధాని మోడీ కి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ప్రైవేట్ ఉద్యోగాలను ఇస్తామన్న ప్రధాని మోడీ హామీ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రమే 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని, మరో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతోందని.. కేంద్రం మాత్రం ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉపాధి అవకాశాలను దెబ్బతీసిందని ఆ లేఖలో ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడం ద్వారా పెద్ద దెబ్బ కొట్టారని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ యువతతో కలసి ఆందోళన చేస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
మంత్రి కేటీఆర్ లేఖ రాసి వారం తిరగకముందే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి మోడీ నిర్ణయించారు. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగాన్ని కూడా ప్రతిపక్షలు ఒక ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే భారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. ఈ మేరకు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి.. వెంటనే ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్దపడటం కేటీఆర్ ఎఫెక్టే అని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
‘కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే చెప్పాలని పీఎం నరేంద్ర మోడీ సమీక్షలో వెల్లడించారు. రాబోయే ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల మందిని రిక్రూట్ చేసుకోవడానికి యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మోడీ చెప్పారు’ అంటూ పీఎంవో ట్వీట్ చేసింది.