Telugu Global
National

ఉద్యోగాలకి రావొద్దు.. పొలం పనులు చేసుకోండి -శ్రీలంక ప్రభుత్వం

శ్రీలంకలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవలు ప్రకటించింది ప్రభుత్వం. ఇదివరకు శని, ఆదివారాలు సెలవలు ఉంటే.. ఇప్పుడు కొత్తగా శుక్రవారం కూడా సెలవు ఇచ్చేస్తోంది. అంటే ఉద్యోగులు వారానికి పనిచేసేది కేవలం 4 రోజులే అనమాట. ఇదేదో ఉద్యోగులపై ప్రేమతో చేసిన పని కాదు, పెట్రోల్ సంక్షోభాన్ని కాస్తైనా తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల పొడవైన క్యూ లైన్లలో నిలబడుతున్నారు ప్రజలు. ఉద్యోగులకు సెలవలు […]

srilanka
X

శ్రీలంకలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవలు ప్రకటించింది ప్రభుత్వం. ఇదివరకు శని, ఆదివారాలు సెలవలు ఉంటే.. ఇప్పుడు కొత్తగా శుక్రవారం కూడా సెలవు ఇచ్చేస్తోంది. అంటే ఉద్యోగులు వారానికి పనిచేసేది కేవలం 4 రోజులే అనమాట. ఇదేదో ఉద్యోగులపై ప్రేమతో చేసిన పని కాదు, పెట్రోల్ సంక్షోభాన్ని కాస్తైనా తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల పొడవైన క్యూ లైన్లలో నిలబడుతున్నారు ప్రజలు. ఉద్యోగులకు సెలవలు ఇస్తే, వారు ఆఫీస్ కి వచ్చే అవసరం ఉండదు కాబట్టి, కనీసం కాస్తైనా డిమాండ్ తగ్గుతుందనేది ప్రభుత్వ ఆలోచన.

పొలంబాట పట్టండి..

ఆఫీస్ కి సెలవలు ఇస్తూనే.. పనిలో పనిగా వారిని పొలం పనులు చేయాలంటూ పురమాయించింది ప్రభుత్వం. సెలవు రోజుల్లో పొలం పని చేయాలని, కనీసం ఎవరి ఇంటి అవసరాలకు తగ్గట్టుగా వారు ఆహార పదార్థాలను పండించుకోవాలని, లేకపోతే దగ్గర్లో ఉన్న పొలాల్లో రైతులకు సాయం చేయాలని సూచించింది. సెలవు రోజు ఎలాంటి పొలం పని చేశారు, ఎంత మేరకు పనిచేశారనేది నివేదిక ఇవ్వాలని చెప్పింది.

సంక్షోభాలు గట్టెక్కేదెప్పుడు..

ప్రపంచ దేశాలు సాయం చేస్తున్నా.. శ్రీలంకలో సంక్షోభం ఇంకా తగ్గలేదు. ప్రధానిని మార్చేసినా కొత్త నిర్ణయాలతో పెద్ద ఫలితం కూడా కనపడ్డంలేదు. ఆహార పదార్థాల రేట్లు, ఇంధన రేట్లు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ పరిస్థితికి ప్రజలు అలవాటు పడటంతో.. ఇప్పుడు అక్కడ అశాంతి కాస్త తక్కువగానే ఉంది. అయితే క్రమక్రమంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆహార పదార్థాల కొనుగోలుకోసం ప్రజలు ఎక్కువ ఖర్చు చేయకుండా.. ఎవరికి వారు వాటిని పండించుకునేలా ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఇంధన వినియోగాన్ని కూడా పూర్తిగా తగ్గించేసింది. అత్యవసరమైతే తప్ప శ్రీలంకలో వాహనాలు రోడ్లపైకి రావట్లేదు. కానీ రవాణా రంగంపై ఆధారపడిన అనేక మంది ఇప్పుడు నిరుద్యోగులుగా మారిపోయారు. వారంతా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెదుక్కుంటున్నారు.

First Published:  14 Jun 2022 12:18 PM IST
Next Story