ప్రతిపక్షాలకు శరద్ పవార్ షాక్… రాష్ట్రపతిగా పోటీ చేయబోనని వెల్లడి
విపక్షాలకు శరద్ పవార్ షాక్ ఇచ్చారు. భారతదేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవి కోసం జూలై 18న జరగనున్న ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్ ఉంటారన్న వార్తలను ఆయన తోసిపుచ్చినట్టు సమాచారం. నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ, “నేను రాష్ట్రపతి రేసులో లేను, రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉండబోను” అని చెప్పారు. “పవార్ రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని నేను […]
విపక్షాలకు శరద్ పవార్ షాక్ ఇచ్చారు. భారతదేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవి కోసం జూలై 18న జరగనున్న ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్ ఉంటారన్న వార్తలను ఆయన తోసిపుచ్చినట్టు సమాచారం.
నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ, “నేను రాష్ట్రపతి రేసులో లేను, రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉండబోను” అని చెప్పారు.
“పవార్ రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని నేను అనుకోను. పవార్ ప్రజల్లో ఉండడానికి ఇష్టపడే ప్రజల మనిషి. అతను తనను తాను రాష్ట్రపతి భవన్‌కు పరిమితం చేసుకోరు” అని ఎన్‌సిపి నాయకుడు, మహారాష్ట్ర మంత్రి ఒకరు అన్నారు.
ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించడానికి అవసరమైన ఓట్ల సంఖ్యను పెంచుకోగలవని పవార్ కు నమ్మకం లేదని ఎన్ సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోయే పోరులో పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపడం లేదని వారు అంటున్నారు.
ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి, ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేనకు చెందిన సంజయ్ పవార్‌ను ఓడించి బీజేపీ సీటు సాధించింది. సేనకు మద్దతు ఇస్తామని వాగ్దానం చేసిన పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలను బిజెపి తన వైపు లాక్కోగలిగింది.
కాంగ్రెస్, శివసేన పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని పట్టుదలగా ఉన్నాయి. సోనియా గాంధీ కూడా పవార్ అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నారు. సోనియా గాంధీ ఆదేశంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, గత గురువారం పవార్‌ని ముంబైలో కలిసి రాష్ట్రపతి ఎన్నికలపై చర్చలు జరిపినట్టు సమాచారం.
ఆదివారం నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్ నుండి కూడా పవార్ కు కాల్ వచ్చింది.
ఇదే విషయంపై మల్లికార్జున్ ఖర్గే శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లతో కూడా మాట్లాడారు.
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశమవుతున్న నేపథ్యంలో పవార్ అంశాన్నిఖర్గే బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు.
ఒకవైపు కాంగ్రెస్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తుండగా పవార్ మాత్రం ససేమిరా అంటున్నారు. అయితే ఈ విషయాన్ని పవార్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి తెలియజేయలేదు.
భారత తదుపరి రాష్ట్రపతి కోసం జూలై 18న ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ మూడు రోజుల తర్వాత నిర్వహించబడుతుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది.