అంతంత ఫీజులు కట్టి నన్ను నరకంలో పడేశారు…. ఓ చిన్నారి డెత్ నోట్
”అంతంత ఫీజులు కట్టి నన్ను నరకంలో పడేశారు” ఆత్మహత్య చేసుకొని చనిపోయే ముందు ఓ చిన్నారి ఆక్రందన ఇది. చిన్నారులను అలవిగాని వత్తిడిలుతో…వేధింపులతో…ఆత్మహత్యలవైపు నెడుతున్న కార్పోరేట్ స్కూళ్ళ, కాలేజీల తీరుపై ఆ చిన్నారి తన చావుతో నిరసన సంతకం చేశాడు. బెంగళూరు సమీపంలోని హొసకోటేకి చెందిన రమేశ్, మంజుళ దంపతుల కుమారుడు 14 ఏళ్ళ పూర్వజ్ ఉళ్లాలలోని శారదా విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్ లో ఉంటాడు. మనదగ్గర నారాయణ, చైతన్య వంటిదే […]
”అంతంత ఫీజులు కట్టి నన్ను నరకంలో పడేశారు” ఆత్మహత్య చేసుకొని చనిపోయే ముందు ఓ చిన్నారి ఆక్రందన ఇది. చిన్నారులను అలవిగాని వత్తిడిలుతో…వేధింపులతో…ఆత్మహత్యలవైపు నెడుతున్న కార్పోరేట్ స్కూళ్ళ, కాలేజీల తీరుపై ఆ చిన్నారి తన చావుతో నిరసన సంతకం చేశాడు.
బెంగళూరు సమీపంలోని హొసకోటేకి చెందిన రమేశ్, మంజుళ దంపతుల కుమారుడు 14 ఏళ్ళ పూర్వజ్ ఉళ్లాలలోని శారదా విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్ లో ఉంటాడు.
మనదగ్గర నారాయణ, చైతన్య వంటిదే ఆ స్కూల్ కూడా… పొద్దున 6 గంటలనుండి రాత్రి పది గంటల వరకు చదువు….చదువు…చదువు…పిల్లలకు అర్దమవుతుందా లేదా , ఆ పిల్లలు స్వేచ్చగా తమ మెదడ్లను వినియోగిస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, నాలెడ్జ్ కాక ర్యాంకులే లక్ష్యంగా చిన్నారుల మెదడ్లను రుద్దీ రుద్దీ బండ చదువులతో చిన్నారుల సున్నితత్వంపై ప్రతిరోజూ దాడి చేస్తూ చివరకు వాళ్ళను చావు వైపు నెడుతున్నారు.
పూర్వజ్ విషయంలోనూ అదే జరిగింది. ఆ చిన్నారి తల్లితో పెంచుకున్న ప్రేమను కూడా గుర్తించలేదు ఆ స్కూలు యాజమాన్యం…..తల్లి పుట్టినరోజుకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పనీయలేదా దుర్మార్గులు.
జూన్ 11న పూర్వజ్ తల్లి మంజుళ పుట్టినరోజు. ఆ రోజు తల్లితో మాట్లాడాలనుకున్నాడా చిన్నారి. విషయం చెప్పి వార్డెన్ ను మొబైల్ అడిగాడు. ఆయన నిరాకరించాడు. బతిమిలాడాడు…ఏడ్చాడు…. యాజమాన్యపు పనికి మాలినకఠిన నియమాలు మెదడ్లో నింపుకున్న ఆ వార్డెన్ కరగలేదు. ఫోన్ ఇవ్వ్వలేదు. అక్కడితో అయిపోలేదు….కుటుంబ సభ్యులు పూర్వజ్ తో మాట్లాడడానికి స్కూలుకు అనేక సార్లు ఫోన్ చేశారు. కానీ స్కూలు యాజమాన్యం అనుమతించలేదు. ఆ రోజు ఆ బాలుడు రాత్రి 12 దాకా తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి చిన్నారి ఏం ఆలోచించాడో? ఈ నరకం నుంచి బైటపడటానికి చావు తప్ప మరో మార్గం లేదనుకున్నాడో ఏమో ఆ రాత్రి చీకట్లో ఓ లేఖ రాసి తన గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. నరకం నుంచి శాశ్వతంగా విముక్తి పొందాడు.
ఆ చిన్నారి తన కుటుంబానికి రాసిన చివరి లేఖ గుండెల్ని పిండేస్తుంది. ”అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండండి. పాఠశాలలో నా కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకోండి. అంతేసి ఫీజులు కట్టి.. మీరు నన్ను నరకంలో పడేశారు. ఎవరూ బాధపడవద్దు.” అని రాశాడు పూర్వజ్
ఇది బెంగళూరులో జరిగిన సంఘటన కావచ్చు. ఇక్కడ…తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివి పదుల సంఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా వందల్లో జరిగి ఉంటాయి. చదువంటే నాలెడ్జ్ కాదు ర్యాంకులని తల్లితండ్రులు భావిస్తున్నంత కాలం…సమాజం అటువంటి భావాలను పెంచి పోసిస్తున్నంత కాలం కార్పోరేట్ నరకాల్లోంచి బైటపడేందుకు పూర్వజ్ లు ఇలా బలవ్వాల్సిందేనా ?.