Telugu Global
National

ఈడీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన రాహుల్ గాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో తనను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ముప్పుతిప్పలు’ పెడుతున్నారట.. తాము అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవని వారు ఉసూరుమంటున్నారు. మేము అడుగుతున్న ప్రశ్నల్లో చాలావాటికి ఆయన.. ముందే ‘ట్యూషన్ చెప్పించుకున్న కుర్రాడిలా’ సమాధానాలు ఇస్తున్నారని, కొన్నింటికి జవాబులు చెప్పకుండా ఎగవేస్తున్నారని అధికారులు ‘బావురుమంటున్నారు’. ‘మేము అడుగుతున్నవాటికి రాహుల్ ఆచితూచి సమాధానమిస్తున్నారు. ఏ ప్రశ్నకు ఎలా సమాధానమివ్వాలో, కొన్నింటికి జవాబు చెప్పకుండా ఎలా దాటవేయాలో ఆయనకు […]

Rahul-Gandhi-ED-Questions
X

నేషనల్ హెరాల్డ్ కేసులో తనను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ముప్పుతిప్పలు’ పెడుతున్నారట.. తాము అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవని వారు ఉసూరుమంటున్నారు. మేము అడుగుతున్న ప్రశ్నల్లో చాలావాటికి ఆయన.. ముందే ‘ట్యూషన్ చెప్పించుకున్న కుర్రాడిలా’ సమాధానాలు ఇస్తున్నారని, కొన్నింటికి జవాబులు చెప్పకుండా ఎగవేస్తున్నారని అధికారులు ‘బావురుమంటున్నారు’. ‘మేము అడుగుతున్నవాటికి రాహుల్ ఆచితూచి సమాధానమిస్తున్నారు. ఏ ప్రశ్నకు ఎలా సమాధానమివ్వాలో, కొన్నింటికి జవాబు చెప్పకుండా ఎలా దాటవేయాలో ఆయనకు లాయర్లు ఎంచక్కా ‘ట్యూషన్’ ఇచ్చినట్టు కనిపిస్తోంది’ అని ఓ అధికారి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

ఆయన సమాధానాల్లో చాలావాటికి మేమసలు సంతృప్తి చెందలేదు అని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాహుల్ గాంధీని ఈడీ అధికారులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రాహుల్ షేర్ హోల్డింగ్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కి సంబంధించి కొన్ని ఆర్థిక లావాదేవీల పత్రాలను ఈడీ .. ఆయనకు చూపిందని, వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరిందని సమాచారం. వారి కోర్కె మేరకు రాహుల్ అన్నింటినీ కూలంకషంగానే పరిశీలించారు. ఈ సంస్థల్లో మీ పాత్ర, మీ ప్రమేయం ఏమిటని అధికారులు ఆయనను ప్రశ్నించారు. రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటలవరకు ఈ ‘కార్యక్రమం’ కొనసాగింది.

నేనిస్తున్న సమాధానాల్లో తప్పులుంటే మీరే చూడాలని రాహుల్ .. ఈడీ అధికారులను కోరారట. అయితే మీరే జాప్యం చేస్తున్నారని వారు విసుక్కున్నారని, ఇందుకు రాహుల్ వారిని క్షమించాలని కోరారని తెలిసింది. ఈ తిరకాసు ఏమిటో అర్థం కాక కొందరు అధికారులు కామ్ అయిపోయారట. నిన్నటి ప్రశ్నల్లో కొన్నింటిని అసలు వారు ముట్టుకోలేదని, అందువల్ల మళ్ళీ మంగళవారం విచారిస్తామని చెప్పారని తెలుస్తోంది.

ఇక మంగళవారం కూడా ఈడీ ఎదుట రాహుల్ ‘ప్రశ్నోత్తర కార్యక్రమం’ కొనసాగుతోంది. కాగా నేటి కాంగ్రెస్ శ్రేణుల నిరసనలో సీనియర్ నేతలైన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కె.సి. వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, రణదీప్ సూర్జేవాలా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ తదితరులున్నారు.

ఈడీ అసలు చట్టాన్ని పాటించడం లేదని, ఈ దర్యాప్తు సంస్థ చట్టాన్ని సరిగా పాటించినట్లయితే తమకెలాంటి సమస్య ఉండేది కాదని సీనియర్ నేత పి. చిదంబరం వ్యాఖ్యానించారు. షెడ్యూల్డ్ నేరమేమిటి ? ఏ పోలీసు డిపార్ట్ మెంట్ ఎఫ్ ఐ ఆర్ పెట్టింది ? అసలు ఎఫ్ ఐ ఆర్ కాపీ ఏదీ? అని తాము అడుగుతున్నామని, కానీ ఈ ప్రశ్నలకు సమాధానం లేదని ఆయన దుయ్యబట్టారు.

First Published:  14 Jun 2022 10:43 AM IST
Next Story