Telugu Global
NEWS

బీఆర్ఎస్ కి ఏపీలో ఉండవల్లి నాయకత్వం వహిస్తారా..?

తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి గా మారుతోందన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. బీఆర్ఎస్ కోసం అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను ముందుగా నియమించాలనే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో ప్రగతి భవన్‌ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కూడా హాజరయ్యారు. ఇదే నెలలో కొత్త పార్టీపై ప్రకటన ఉంటుంది. దీనికోసం ఈనెల 19న జరిగే […]

BRS-AP-Undavalli-KCR
X

తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి గా మారుతోందన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. బీఆర్ఎస్ కోసం అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను ముందుగా నియమించాలనే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో ప్రగతి భవన్‌ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కూడా హాజరయ్యారు. ఇదే నెలలో కొత్త పార్టీపై ప్రకటన ఉంటుంది. దీనికోసం ఈనెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేయబోతున్నారు. జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ఢిల్లీలో పార్టీ తరఫున మాట్లాడేందుకు అధికార ప్రతినిధులను కూడా నియమించబోతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి. వైసీపీని, టీడీపీని, జనసేనను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఆయన సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఆయన ఈ విషయాలు చర్చించారు.

ప్రగతి భవన్ లో కేసీఆర్, ఉండవల్లి మధ్య మూడు గంటలకు పైగా చర్చలు జరిగాయి. జాతీయ స్థాయిలో ఏం చేయాలనే విషయంపై వీరిద్దరూ చర్చించారు. అదే సమయంలో ఏపీలో పార్టీ నాయకత్వం విషయంలో కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్ నేతలు, ఆంధ్రప్రాంత నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సడన్ గా కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేయాలంటే ఇక్కడి పరిస్థితులు అనూకూలిస్తాయా, ప్రజలు స్వాగతిస్తారా అనే విషయంలో కూడా చర్చలు జరిగాయని అంటున్నారు.

జాతీయ పార్టీగా బీఆర్ఎస్ మారితే.. కచ్చితంగా ఏపీలో కూడా ఆ పార్టీకి నాయకత్వం, సంస్థాగత నిర్మాణం ఉండాలి. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. కొన్నిసార్లు జగన్ నిర్ణయాలను ఆయన స్వాగతిస్తారు, మరికొన్ని సార్లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఆయన కేసీఆర్ ని కలవడం సంచలనంగా మారింది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి ఉండవల్లి నాయకత్వం వహిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఉండవల్లి ఏపీకి పరిమితం కాకూడదు అనుకుంటే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తరపున ప్రతినిధిగా ఉండే అవకాశాలున్నాయి. ఏపీలో యువనాయకత్వానికి అవకాశం ఇచ్చేందుకు కూడా కేసీఆర్ ఆలోచన చేయొచ్చు. ఏపీలో బీఆర్ఎస్ కి ఉండవల్లి ప్రతినిధిగా ఉంటారా, మరొకరికి అవకాశం ఇస్తారా అనేది.. అతి త్వరలో తేలిపోతుంది.

First Published:  13 Jun 2022 7:57 AM IST
Next Story