రూ. 44,075 కోట్లకు ఐపీఎల్ హక్కులు దక్కించుకున్న సోనీ టీవీ, వయాకామ్18
ఐపీఎల్ హక్కులు మరోసారి బీసీసీఐకి కాసుల పంట పండించాయి. గత ఐదేళ్లుగా టీవీ, డిజిటల్, వరల్డ్ మీడియా హక్కులు స్టార్ ఇండియా చేతిలో ఉన్నాయి. కానీ ఈ సారి 2023-27 వరకు ఐదు సీజన్లకు సంబంధించి నాలుగు ప్యాకేజీలుగా విభజించి బీసీసీఐ టెండర్లు పిలిచింది. ఆదివారం ప్రారంభమైన బిడ్డింగ్ సోమవారం కూడా కొనసాగుతున్నది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏ, బీ ప్యాకేజీలను భారీ ధరకు రెండు మీడియా సంస్థలు చేజిక్కించుకున్నాయి. ప్రస్తుత బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాను […]
ఐపీఎల్ హక్కులు మరోసారి బీసీసీఐకి కాసుల పంట పండించాయి. గత ఐదేళ్లుగా టీవీ, డిజిటల్, వరల్డ్ మీడియా హక్కులు స్టార్ ఇండియా చేతిలో ఉన్నాయి. కానీ ఈ సారి 2023-27 వరకు ఐదు సీజన్లకు సంబంధించి నాలుగు ప్యాకేజీలుగా విభజించి బీసీసీఐ టెండర్లు పిలిచింది. ఆదివారం ప్రారంభమైన బిడ్డింగ్ సోమవారం కూడా కొనసాగుతున్నది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏ, బీ ప్యాకేజీలను భారీ ధరకు రెండు మీడియా సంస్థలు చేజిక్కించుకున్నాయి.
ప్రస్తుత బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాను దాటేసి.. ఏ ప్యాకేజీని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ రూ. రూ. 23,575 కోట్లకు, బీ ప్యాకేజీని రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 రూ. 20,500 కోట్లకు దక్కించుకున్నాయి. ఈ రెండు ప్యాకేజీలు కలిపి రూ. 44,075 కోట్ల భారీ ధర పలకడం గమనార్హం. అంటే ఒక్కో మ్యాచ్‌కు రెండు ప్యాకేజీలకు కలిపి రూ. 107.50 కోట్లు పలకడం విశేషం. గతంలో ఐదేళ్లకు స్టార్ ఇండియా అన్ని రకాల బ్రాడ్‌కాస్టింగ్ హక్కులకు గాను ఒక్కో మ్యాచ్‌కు రూ. 60.1 కోట్లు చెల్లించింది. కానీ, తాజాగా ఏ+బీ ప్యాకేజీలే మ్యాచ్‌కు రూ. 107.50 కోట్లు చెల్లిస్తుండటంతో బీసీసీఐ ఖజానా నిండిపోనుంది.
ఏ ప్యాకేజీలో ఇండియన్ సబ్‌కాంటినెంట్‌కు సంబంధించిన టీవీ హక్కులు మాత్రమే ఉంటాయి. ఇక బీ ప్యాకేజీలో ఇండియన్ సబ్‌కాంటినెంట్‌కు సంబంధించిన డిజిటల్ హక్కులు మాత్రమే ఉంటాయి. అయితే బీసీసీఐ ఈ రెండు బిడ్లకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో ప్రకటించనున్నది. ఈ రెండు ప్యాకేజీలు కాకుండా సీ, డీలకు బిడ్డింగ్ ప్రారంభమైంది. సీ ప్యాకేజీలో 18 మ్యాచ్‌ల నాన్-ఎక్స్‌క్లూసీవ్ హక్కులు, డీ ప్యాకేజీలో రెస్టాఫ్ ది వరల్డ్ ఎక్స్‌క్లూసీవ్ హక్కులు ఉంటాయి. ఈ రెండు ప్యాకేజీల బిడ్డింగ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్నది.
టీవీ హక్కుల కోసం సోనీతో పాటు స్టార్ ఇండియా, రిలయన్స్ వయాకామ్18 మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ చివరకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ గెలుచుకున్నది. ఇక ప్యాకేజీ బీ డిజిటల్ రైట్స్ కోసం వయాకామ్ 18, డిస్నీ స్టార్, జీ ఇండియా పోటీ పడ్డాయి. అయితే అత్యధిక బిడ్ వేసిన రిలయన్స్‌కు హక్కులు దక్కాయి. ప్యాకేజీ బిని చాలెంజ్ చేసే హక్కు సోనీకి వచ్చింది. చివరకు అవి రిలయన్స్ వయాకామ్ 18కే దక్కడం విశేషం. సీ, డీ బిడ్డింగ్ కూడా పూర్తయితే.. ఐపీఎల్ వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం ప్రపంచంలో రూ.100 కోట్లకు మించిన ధరతో ఒక మ్యాచ్‌ను అమ్మిన ఘనత అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (రగ్బీ) కే సాధ్యమైంది. ప్రస్తుతం జరుగుతున్న టెండర్లతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన రెండో లీగ్‌గా ఐపీఎల్ అవతరించింది.